ఒక అన్వేషి యాత్ర – అనుభవాలు (1)

Sharing is Caring...

Thopudu bandi Sadiq    …………………………………….       

మూడు దశాబ్దాలుగా  ఆపేరు నన్ను వెంటాడుతోంది. ఉస్మానియా యూనివర్సిటీ ల్యాండ్ స్కేప్ గార్డెన్ లో యోగా సాధన ప్రారంభించిన నాటి నుంచి తరచూ ప్రస్తావనకు వచ్చిన పేరు. గత కొన్ని దశాబ్దాలుగా యోగ,ప్రాణాయామ,ధ్యానం సాధన చేస్తున్న కోట్లాదిమందికి అంతర్లీనంగా స్పూర్తిని,ఉత్తేజాన్ని ఇస్తున్న పేరు ” మహావతార్ బాబాజీ.”

గత యాభై ఏళ్ళుగా ప్రపంచ ప్రసిద్ధి పొందిన రచన …వివిధ భాషల్లోకి అనువాదమైన పుస్తకం …స్వామీ యోగానంద పరమహంస రాసిన ‘ఒక యోగి ఆత్మకథ’ చదివిన తర్వాత ‘బాబాజీ ‘ ఎవరు?ఏమిటి? అనేది అర్ధమయ్యింది. ఆయన ధ్యానం చేసిన గుహ ఒకటి హిమాలయాల్లో ఉంది అని చదివాను.

అప్పటికి నాకు హిమాలయాలు ఒక స్వప్నం,ఒక భౌగోళిక అద్భుతం మాత్రమే. అక్కడికి నేను వెళ్ళగలను ..ఎదో ఒకనాడు వెళ్తాను అనే ఊహ కూడా నాకు లేదు. కానీ వెళ్లాను.  ఆ గుహలో ధ్యానం చేశాను. బాబాజీ ఉనికిని అనుభూతి చెందాను. అది ఎలా సాధ్యమైంది?ఆ ప్రస్థానం  ఎలా మొదలై… ఎలా ముగిసింది ? దాన్ని మీతో పంచుకునే ఒక చిన్న ప్రయత్నమే ఈ వ్యాసం.

కొన్నేళ్లుగా నా హిమాలయ యాత్రలు కొనసాగుతున్నాయి.ఉత్తరాఖండ్ కు సంబంధించి హిమాలయ పర్వత ప్రాంతాలు రెండు భాగాలుగా ఉంటాయి.ఒకటేమో ఘర్వాల్ ప్రాంతం.ఇందులోనే చార్ ధాం అంటే బదరీ నాద్,కేదార్ నాద్,గంగోత్రి,యమునోత్రి ఉంటాయి.

హరిద్వార్, రిషికేశ్,గుప్తకాశి,ఉత్తరకాశి,తుంగనాద్,డెహ్రాడూన్,ముస్సోరీ ఇవన్నీ కూడా ఈ ఘర్వాల్ పర్వత శ్రేణుల్లోనే ఉంటాయి.జోషిమట్,వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్,హేమకుండ్ సాహిబ్ వంటివి కూడా ఇక్కడే ఉంటాయి.

హైందవం,ముఖ్యంగా శైవం అత్యంత బలంగా ఉండే ప్రాంతం.ఆర్ధికంగా, సామాజికంగా బాగా వెనుకబడిన ప్రాంతం. ఆధ్యాత్మిక పర్యాటకం ద్వారానే ఇక్కడ ఎక్కువ మందికి ఉపాధి లభిస్తుంది.నా గత పర్యటనలన్నీ రిషికేశ్ కేంద్రంగా ఈ పర్వత శ్రేణుల్లోనే కొనసాగాయి.ఇక రెండోది కుమావూన్ ప్రాంతం. ఇది బాగా అభివృద్ధి చెందిన ప్రాంతం.

ఇక్కడ ఆధ్యాత్మికత కన్నా పర్యాటకానికే ప్రాధాన్యత ఎక్కువ. బైజ్నాద్,జాగేశ్వర్,భాగేశ్వర్,పాతాళ్ భువనేశ్వర్ వంటి క్షేత్రాలు ఉన్నా ఆంగ్లేయుల ప్రభావంతో రొమాంటిక్ టూరిజం దాన్ని డామినేట్ చేసింది.నైనితాల్,ఆల్మోరా,కావ్సాని,మున్శియారి వంటి హిల్ స్టేషన్ ల వల్ల యాత్రికులకు నయనానందం,మానసిక ఉల్లాసం కాస్త ఎక్కువగానే దొరుకుతుంది.

దానికితోడు హిమాలయాల శిఖర దర్శనం , దేవదారు,పైన్,ఫెర్న్ వృక్షాలు,బిర్తిలాంటి జలపాతాలు ఎక్కువగా ఉండటం వల్ల భక్తితో సంబంధం లేని దేశ,విదేశీ యాత్రికులు ఎక్కువగా వస్తారు. ఉత్తరాఖండ్లోని ఈ రెండు పర్వత శ్రేణులను కలిపి దేవభూమి అని పిలుస్తారు.అలాంటి కుమావూన్ పర్వత శ్రేణుల్లోనే కుకూచిన్ ప్రాంతం ఉంది.అక్కడే మహావతార్ బాబాజీ గుహ,పాండవ్ ఖోలి ఉన్నాయి.

ఈసారి నా పర్యటనకు బాబాజీ గుహనే లక్ష్యంగా పెట్టుకొని ప్రారంభించాను.యాత్ర గురించి ముఖపుస్తకంలో ప్రకటించిన తర్వాత చాలామంది స్పందించారు.కానీ,యధావిధిగా నాతొ పాటు మరో ఇద్దరు మాత్రం ఫైనల్ అయ్యారు.అందులో ఒకరు గుంటూరు లో బిజినెస్ చేస్తున్న గజేందర్ రెడ్డి,మరొకరు రామ్ జొన్నలగడ్డ . ముగ్గురం కలిసి తెలంగాణా ఎక్స్ప్రెస్ లో డిల్లీ చేరాం.మరుసటి రోజు ఉదయాన్నే ఆరు గంటలకు న్యూ డిల్లీ స్టేషన్ నుంచి ఖాట్ గోదాం ఎక్స్ప్రెస్ ఎక్కి ఉదయం 11 గంటలకు హల్ద్వానీ దాటి ఖాట్ గోదాం స్టేషన్ లో దిగాం.

భారతీయ రైల్వే కు అదే ఆఖరి స్టేషన్.అక్కడి నుంచి ఇక రైలు మార్గం లేదు. స్టేషన్ బయటికి వచ్చి చూస్తె ,వందలాది ట్యాక్సీ లు. రైలు దిగిన వారిలో అత్యధిక శాతం యువతరమే.అందరి గమ్యమూ నైనిటాల్,ఆల్మోరా,రాణీఖేట్ వరకే.మేము తప్ప కుకూచిన్ వెళ్ళేవారు మాకు కన్పించలేదు.మేమూ ఒక ట్యాక్సీ మాట్లాడుకున్నాం.మా డ్రైవర్ పేరు పూరణ్ సింగ్ నేగి. మున్ముందు అతని పాత్ర చాలా ఉంది.

భవిష్యత్ పోస్టుల్లో అతని గురించి మరింత రాస్తాను.ముందుగా రాణిఖేట్ వరకు వెళ్లి రాత్రి అక్కడ బస చేద్దాం అనుకున్నాం.  కేవలం నాలుగు గంటల ప్రయాణమే.మరో మూడు గంటలు ప్రయాణిస్తే ద్వారాహట్ చేరుకోవచ్చు అని చెప్పాడు.సరే అని రెండున్నర వేలకు మాట్లాడుకొని బయలు దేరాం.

దారిలో భీమ్ తాల్ చూపించాడు.అలాగే,రోడ్డు కత్తెరలా మలుపులు తిరిగే చోట ఒక యోగి సమాధి,మందిరం ఉన్నాయి. దాన్ని ఖైంచి ధాం అంటారు.దాన్ని కూడా సందర్శించాం.తర్వాత రాణిఖేట్ ఆర్మీ కంటోన్మెంట్ ఏరియా,అదీ దాటి ద్వారాహట్ చేరేసరికి సాయంత్రం నాలుగున్నర అయ్యింది.

అక్కడ యోగోదాసత్సంగ్ సొసైటీ సభ్యులు ఉండటానికి సౌలభ్యం ఉంది కానీ ,మాలాంటి యాత్రికులకు అంతగా అవకాశాలు లేవు.మరో గంట ప్రయాణం చేస్తే నేరుగా కుకూచిన్ చేరుకోవచ్చు.అక్కడ జోషీ గారి గెస్ట్ హౌస్ ఉంది అని ముందుగానే సేకరించుకున్న సమాచారం .

దాంతో మరో రెండొందలు అదనంగా చెల్లిస్తామనే మాటతో బయలు దేరి సాయంత్రం ఐదున్నరకి కుకూచిన్ లోని జోషీ గారి స్థావరానికి చేరాం. చిరునవ్వుతో, ఒక కప్పు వేడి వేడి టీ తో జోషీ గారు స్వాగతం పలికారు……ఎదురుగా ఒక పర్వతాన్ని చూపించి ,అదిగో…అక్కడే బాబాజీ గుహ ఉంది అన్నారు.  

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!