ఆ రాజు గారి సమాధిలో వందల కోట్ల బంగారం !!

Sharing is Caring...

Rich tomb……..

ఈజిప్ట్ పాలకుడైన  టుటన్‌ ఖామెన్ సమాధి ప్రాచీన ఈజిప్ట్ చరిత్రలోనే అత్యంత సంపన్నమైనదిగా, చెక్కుచెదరకుండా లభించిన ఏకైక సమాధిగా గుర్తింపు పొందింది. ఇందులో సుమారు 5,000 కంటే ఎక్కువ వస్తువులు దొరికాయి. మమ్మీ ముఖంపై ఉంచిన  ముసుగు పూర్తిగా 11 కిలోల (22 పౌండ్ల) స్వచ్ఛమైన బంగారంతో తయారు చేశారట. ఇది ప్రపంచవ్యాప్తంగా ఈజిప్ట్ నాగరికతకు చిహ్నంగా మారింది.

ఆయన మమ్మీని మూడు శవపేటికలలో ఒకదానిలో ఒకటి ఉంచి భద్రపరిచారు. వాటిలో లోపలి చివరి శవపేటిక పూర్తిగా సుమారు 110 కిలోల స్వచ్ఛమైన బంగారంతో చేశారట. సమాధిలో బంగారు పూత పూసిన అద్భుతమైన సింహాసనం (Golden Throne), నాలుగు యుద్ధ రథాలు లభించాయి.

బంగారు చెప్పులు, నగలు, ఆయుధాలు, దేవుళ్ల విగ్రహాలు, నిత్యజీవితంలో వాడే వస్తువులన్నీ బంగారంతో తళతళలాడుతూ కనిపించాయి.ప్రస్తుతం ఈ అపారమైన బంగారు నిధులన్నీ కైరోలోని ది గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం (The Grand Egyptian Museum) లో ప్రజల సందర్శనార్థం భద్రపరిచారు. 

కింగ్ టట్ క్రీ.పూ. 1332 నుండి 1323 వరకు ఈజిప్టును పాలించిన రాజు . అతను కేవలం ఎనిమిది లేదా తొమ్మిది సంవత్సరాల వయస్సులో బాలుడిగా ఈజిప్టు సింహాసనాన్ని అధిష్టించాడు. సలహాదారుల సూచనలతో రాజ్యాన్ని పాలించిన టుటన్‌ఖామెన్ (కింగ్ టుట్) 19 సంవత్సరాల వయస్సులోనే ఆకస్మికంగా మరణించారు.

ఆయన మరణం వెనుక ఉన్న ఖచ్చితమైన కారణంపై అనేక పరిశోధనలు జరిగాయి. 1922లో బ్రిటిష్ పురాతత్వ శాస్త్రవేత్త హోవార్డ్ కార్టర్ కనుగొన్న ఆయన సమాధిలో అపారమైన బంగారు నిధులు, చారిత్రాత్మక వస్తువులు లభించాయి. 

మొదట్లో టుటన్‌ఖామెన్‌ను ఎవరో తలపై కొట్టి హత్య చేశారనే పుకార్లు ఉండేవి. అయితే, 2005-2010 మధ్యకాలంలో జరిపిన ఆధునిక CT స్కాన్‌లు, DNA పరీక్షల ద్వారా శాస్త్రవేత్తలు ఆయన మరణానికి గల అసలు కారణాలను విశ్లేషించారు.
ఆయన మరణానికి కొద్దిరోజుల ముందు ఎడమ తొడ ఎముక లేదా మోకాలి భాగం తీవ్రంగా విరిగినట్లు తేలింది.

ఆ కాలంలో యాంటీబయాటిక్స్ లేకపోవడం వల్ల ఆ గాయం తీవ్రమైన ఇన్ఫెక్షన్ (గ్యాంగ్రీన్ లేదా సెప్టిసేమియా) గా మారి ఉండవచ్చు.DNA పరీక్షల్లో ఆయన శరీరంలో అత్యంత ప్రమాదకరమైన మలేరియా పరాన్నజీవుల (Malaria parasites) అవశేషాలు కనుగొనబడ్డాయి.

రాజవంశంలో జరిగిన అంతర్గత వివాహాల (Inbreeding) కారణంగా ఆయన పుట్టుకతోనే కుంటితనం,ఎముకల బలహీనత వంటి సమస్యలతో బాధపడేవారు. నడవడానికి కర్రల సహాయం తీసుకునేవారు.బలహీనమైన శరీరం కలిగిన కింగ్ టుట్, రథం పైనుంచి పడటం వల్ల కాలు విరిగి, అదే సమయంలో సోకిన మలేరియా వ్యాధి తోడై మరణించి ఉంటారని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. 

 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!