డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ !!

Sharing is Caring...

Crime thriller…….

‘కలగా తలైవన్’ (Kalaga Thalaivan) ఇదొక తమిళ కార్పొరేట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఉదయనిధి స్టాలిన్, నిధి అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు తిరుమేని దర్శకత్వం వహించారు.2022 లో ఈ సినిమా విడుదలైంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది.

కథేంటంటే?

ఒక ప్రముఖ ఆటోమొబైల్ కార్పొరేట్ సంస్థ ఒక కొత్త ఇంధన వాహనాన్ని తయారు చేస్తుంది. అయితే, ఆ వాహనం పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగించే కాలుష్యాన్ని విడుదల చేస్తుందని ఆ కంపెనీ టెక్నికల్ టీమ్ గుర్తిస్తుంది. ఈ రహస్యాన్ని కంపెనీ దాచాలని చూసినప్పుడు, అక్కడే ఫైనాన్షియల్ అనలిస్ట్‌గా పనిచేసే తిరుమారన్ (ఉదయనిధి స్టాలిన్) దాన్ని లీక్ చేస్తాడు.  

దీంతో  కార్పొరేట్ సంస్థ, తమ కంపెనీలోని ఆ రహస్య లీక్‌ల మూలాన్ని కనిపెట్టడానికి, అర్జున్ (ఆరవ్) అనే ఒక క్రూరమైన హంతకుడిని రంగంలోకి దించుతుంది. అతగాడి బారినుంచి తిరుమారన్ ఎలా తప్పించుకున్నాడనేది అసలు కథ.

దర్శకుడు మగిజ్ తిరుమేని రాసుకున్న ఇన్వెస్టిగేషన్, విజిల్‌బ్లోయర్ ట్రాక్ చాలా ఇంటెలిజెంట్‌గా సాగుతుంది. అనవసరమైన కమర్షియల్ హంగులు లేకుండా జోనర్‌కు కట్టుబడి కథను నడిపించారు.ఉదయనిధి స్టాలిన్ ఎక్కడా అతి చేయకుండా చాలా సెటిల్డ్‌గా, ఇంటెలిజెంట్ క్యారెక్టర్‌కు తగ్గట్టుగా నటించారు. ఇక విలన్‌గా నటించిన ఆరవ్ తన ఫిజిక్,  క్రూరమైన నటనతో సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్‌గా నిలిచాడు.

నిధి అగర్వాల్ తన పరిధి మేర బాగానే నటించింది. అయితే, సినిమా ఇంటెన్స్ థ్రిల్లర్ కావడంతో ఆమె పాత్రకు పెద్దగా స్కోప్ దక్కలేదు. కథనంలో లవ్ ట్రాక్ కొంత బలహీనంగా ఉన్నప్పటికీ, ఉన్నంతలో ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. మిగిలిన నటీనటులు కూడా బాగానే  నటించారు.  

సినిమాలో చాలా తక్కువ ఫైట్స్ ఉంటాయి, కానీ ఉన్నవన్నీ చాలా రియలిస్టిక్‌గా, లాజికల్‌గా డిజైన్ చేశారు. ముఖ్యంగా రైల్వే స్టేషన్ సీక్వెన్స్,  క్లైమాక్స్ ఫైట్ థ్రిల్ ఇస్తాయి.సినిమా కొన్ని చోట్ల చాలా నెమ్మదిగా సాగుతుంది. ప్రేక్షకులకు ప్రతి చిన్న విషయాన్ని వాయిస్ ఓవర్ ద్వారా లేదా డైలాగుల ద్వారా మరీ ఎక్కువగా వివరించి చెప్పడం వల్ల థ్రిల్ కొంచెం తగ్గుతుంది.విలన్ పాత్రను మరీ విపరీతమైన రక్తపాతం ఇష్టపడే సైకోలా చూపించడం అతిగా అనిపిస్తుంది.

రైల్వే స్టేషన్ నేపథ్యంలో వచ్చే సీక్వెన్స్‌ చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. పెద్దగా అరుపులు లేదా రెగ్యులర్ మాస్ ఎలివేషన్స్ లేకుండా, హీరో, విలన్  పాత్రల మధ్య నడిచే నిశ్శబ్ద పోరు,  ఒకరి ప్లాన్‌లను మరొకరు పసిగట్టే సీన్స్ సినిమాకి హైలైట్‌గా నిలిచాయి.

అనవసరమైన హంగులు లేదా గాలిలో తేలే ఫైట్లు లేకుండా, సినిమా చివరిలో వచ్చే ఒకే ఒక్క రియలిస్టిక్, లాజికల్ యాక్షన్ ఫైట్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. సాధారణ కమర్షియల్ సినిమాల్లో లాగా హీరో గాల్లో తేలుతూ పదిమందిని ఒకేసారి కొట్టే రొటీన్ ఫైట్స్ ఇందులో ఉండవు. ఎంతటి బలవంతుడైనా ఒకేసారి ఒకరిద్దరిని మాత్రమే డీల్ చేయగలడు అనే సహజమైన లాజిక్‌తో ఈ ఫైట్‌ను డిజైన్ చేశారు.

మాజీ కమాండో అయిన క్రూరమైన విలన్ అర్జున్ ను కేవలం కండబలంతో కాకుండా,హీరో తిరుమారన్ బుద్ధిబలంతో, మైండ్ గేమ్‌తో ఎలా లొంగదీశాడు అనేది క్లైమాక్స్‌లో చాలా ఆసక్తికరంగా చూపించారు. కథ అంతా కార్పొరేట్ రహస్యాలను లీక్ చేసే కేవలం ఒక సాధారణ విజిల్‌బ్లోయర్ కథలా సాగినప్పటికీ, అసలు హీరో ఈ కంపెనీ గుట్టును ఎందుకు రట్టు చేయాల్సి వచ్చింది అనే దాని వెనుక ఉన్న ఒక బలమైన పర్సనల్ మోటివ్  క్లైమాక్స్ లోనే రివీల్ అవుతుంది. ఆ ట్విస్ట్ కథకు ఒక సరైన ముగింపుని ఇస్తుంది.

ఈ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ లో డి. ఇమ్మాన్, శ్రీకాంత్ దేవా అందించిన నేపథ్య సంగీతం, అలాగే కెమెరామెన్ కె. డిల్‌రాజ్ క్లోజప్ షాట్స్ సన్నివేశంలోని టెన్షన్‌ను థ్రిల్లింగ్‌గా ఎలివేట్ చేశాయి.

‘కలగా తలైవన్’ అనేది రెగ్యులర్ మాస్ మసాలా ఫైట్లు లేని, డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్. కథనంలో కొన్ని సాగతీతలు ఉన్నప్పటికీ, క్రైమ్ థ్రిల్లర్ జోనర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది ఖచ్చితంగా నచ్చుతుంది. 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!