ఎలిఫెంట్ ‘మాధురి’ కథ ఏమిటి ?

Sharing is Caring...

Elephant Madhuri ……

ముప్పై ఆరేళ్ళ ఆ ఆడ ఏనుగు పేరు మాధురి.. మహాదేవి అని కూడా పిలుస్తారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ ప్రజల సెంటిమెంట్‌కు, జంతు సంరక్షణ సంస్థ (PETA) నిబంధనలకు మధ్య నలిగిన ఈ ఏనుగు కథ దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది. 

మాధురి అనే ఈ ఏనుగు ను కేవలం 3 సంవత్సరాల వయసులోనే (కర్ణాటక అడవుల నుండి) తల్లికి దూరం చేసి మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా నందని గ్రామంలో ఉన్న ఒక జైన్ మఠానికి  తీసుకు వచ్చారు. అప్పటి నుంచి మాధురి అక్కడే ఒంటరి గా ఉంది.

PETA ఇండియా నివేదికల ప్రకారం, ఈ ఏనుగు దాదాపు 33 సంవత్సరాల పాటు ఒకే కాంక్రీట్ షెడ్డులో ఒంటరిగా, కాళ్లకు ఇనుప గొలుసులతో బంధించబడి ఉంది. ఊరేగింపులు, పండగల సమయంలో దానిని గట్టి తాళ్లతో కట్టి, అంకుశం తో  పొడుస్తూ నడిపించేవారు. సరిగ్గా నడవలేక, ఇతర ఏనుగులతో కలవలేక ఇది తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైంది. కీళ్ల నొప్పులు వచ్చాయి.  

2025 లో, PETA ఇండియా దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ముంబై హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం, మాధురిని ఆ మఠం నుండి రక్షించారు. అనంతరం దానిని మెరుగైన వైద్యం, స్వేచ్ఛ కోసం గుజరాత్‌లోని అనంత్ అంబానీకి చెందిన ప్రపంచ ప్రసిద్ధ జంతు పునరావాస కేంద్రం ‘వంతారా’  కు తరలించారు. వంతారాలో ఈ ఏనుగుకు గొలుసులు లేని స్వేచ్ఛ, ప్రత్యేక వైద్యం, హైడ్రోథెరపీ, ఇతర ఏనుగుల స్నేహం లభించాయి.

మాధురిని గుజరాత్‌కు తరలించడం కొల్హాపూర్ గ్రామస్తులలో, మఠం నిర్వాహకులలో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. స్థానిక ప్రజలు మాధురిని ఒక ఏనుగులా కాకుండా, తమ సొంత కూతురిలా, ఒక దైవ స్వరూపంగా భావించేవారు.

మాధురి వెళ్ళిపోవడంతో ఆ గ్రామాలన్నీ శోకసంద్రంలో మునిగిపోయాయి. ఏనుగును తిరిగి తమకు అప్పగించాలని స్థానికులు పెద్ద ఎత్తున నిరసనలు చేశారు, కోర్టులను ఆశ్రయించారు. చివరకు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి, ఏనుగును వెనక్కి తీసుకురావడానికి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసింది.

తీవ్రమైన చట్టపరమైన చర్చల అనంతరం , ప్రజా సెంటిమెంట్‌ను గౌరవిస్తూ, సుప్రీంకోర్టు నియమించిన హై-పవర్ కమిటీ (HPC) వంతారా యాజమాన్యం మాధురిని తిరిగి కొల్హాపూర్ పంపడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. అయితే, మళ్లీ పాత నరకం ఎదురుకాకుండా  కఠినమైన నిబంధనలను విధించారు. 

మాధురిని ఇకపై ఎలాంటి గుడి ఊరేగింపులలో, పండగలలో లేదా ప్రదర్శనలలో తిప్పకూడదు. మాధురిని  గొలుసులతో బంధించకూడదు. దాని కోసం మఠం నిర్వాహకులు పూల్, ఓపెన్ స్పేస్‌తో కూడిన ప్రత్యేకమైన 4 ఎకరాల శాంక్చురీని నిర్మించాలి.ప్రతి 15 రోజులకు ఒకసారి వంతారాకు చెందిన ప్రత్యేక వైద్య బృందం కొల్హాపూర్ వచ్చి మాధురి ఆరోగ్యాన్ని తనిఖీ చేసి కోర్టుకు నివేదిక సమర్పించాలి.

మాధురి ప్రత్యేక అంబులెన్స్‌లో వంతారా వైద్యుల సమక్షంలో కొల్హాపూర్‌కు చేరుకుంది. గ్రామస్థులు మాధురికి పూల వర్షంతో, బ్యాండ్ మేళాలతో ఘన స్వాగతం పలికారు.

జంతు సంరక్షణ నిబంధనలకు, మనుష్యుల ప్రేమ, సెంటిమెంట్‌కు మధ్య జరిగిన ఒక అరుదైన, భావోద్వేగ పూరితమైన ప్రయాణమే ఈ మాధురి కథ.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!