డా. వంగల రామకృష్ణ ……………………………………… Vishnu Leelas
మూడు అడుగులతో ముల్లోకాలను కొలిచిన అద్భుతమూర్తి మన వామన మూర్తి. విష్ణుమూర్తి మరుగుజ్జుగా వచ్చినా ముల్లోక విజేత అయిన బలిచక్రవర్తిని మూడు లోకాలలో ఎక్కడా లేకుండా చేసి చరిత్ర సృష్టించాడు. ఇందుకు ఆయన యుద్ధం చేయలేదు..రక్తపాతం సృష్టించలేదు. రక్తరహిత ప్రణాళికతో వచ్చి వచ్చిన పని పూర్తి చేసుకుని బలిచక్రవర్తిని అసహాయుడిని చేశాడు.
స్వయంగా తనకు భక్తుడు, తన ప్రియ భక్తుడు ప్రహ్లాదుడికి మనవడు అయిన బలిని కేవలం రాక్షసుడైన నేరానికి బలితీసుకోవాలనుకోలేదు. త్రివిక్రముడై విజృంభించినా బలిచక్రవర్తి చేసే విశ్వజిద్యాగంలో మారణహోమం సృష్టించలేదు.
బలి ఇచ్చిన మూడడుగుల నేలను మూడు అడుగులతో స్వీకరించాడు వామనుడు. ఒకటి తర్వాత ఒకటిగా పాదాలుసాచి ముల్లోకాలను స్వీకరించలేదు. బలి ఒకేసారి ఇచ్చిన మూడడుగుల నేలను (త్రిపాద ధరణి) హరీ ఒకేసారిగా స్వీకరించాడు. రెండు కాళ్ళ విష్ణువు ఒకేసారి మూడడుగుల నేలను ఎలా స్వీకరించాడు?
విష్ణువు మూడు పాదాలున్నవాడని రుగ్వేదం చెబుతోంది. ఆయన మూడుపాదాలున్నవాడిగా ఎప్పుడూ కనబడలేదే..? నిజమే..ఆయనకున్న మూడు పాదాలలో రెండు భూమ్యకాశాలను ఆవరించి ఉంటాయి కనుక అవి మాత్రమే మానవులకు కనిపిస్తాయి. మూడోది చీకటిమయమైన అధోలోకంలో ఉంటుంది. అందుకని అది అదృశ్య రూపంగా ఉంటుంది.
ప్రత్యక్షనారాయణుడైన సూర్యుడికి ఉదయ, మధ్యాహ్నాలు రెండు పాదాలైతే, చీకట్లు కమ్ముకునే దీర్ఘరాత్రే మూడోపాదం. వామనుని మూడు పాదాలు విశ్వరూప, తైజస రూప, ప్రాజ్ఞ రూపాలని మూడు రకాలు.
బలి వంటి మహాదాత దానం చేసిన భూమిని చేత్తోకాకుండా కాళ్ళతో తీసుకోవడమేమిటి? తన భక్తుడు, త్రైలోక్య సామ్రాట్టు అయిన మహనీయుని ఆయన బంధుమిత్రులు, భార్యాబిడ్డలు చూస్తుండగా బహిరంగంగా అవమానించవచ్చా? విష్ణుమూర్తికి ఆపాటి మర్యాద తెలియదా..?
విష్ణువు అధోక్షజుడు. ఆయనకు ఎవరు ఏది ఇచ్చినా పాదాల దగ్గరపెట్టవలసిందే తప్ప చేతికి ఇవ్వడానికిలేదు. ఆయన చేతులు ఆదుకోడానికే తప్ప ముడుపులు అందుకోడానికి కాదు. బలి మూడు అడుగుల నేలను పాదాలకు సమర్పించాడు కనుకనే విష్ణువు కాలదన్నక పాదాలతో స్వీకరించి చేతులతో రక్షించాడు.
విష్ణుపాదమే పరమపదం. అది అమర గంగకు పుట్టుక స్థానం. విష్ణుపాదాలు పట్టుకున్నవారిని, సమర్పణ చేసిన వస్తుజాలాన్ని గంగ తన నీటితో పవిత్రంచేసి స్వామికి అందిస్తుంది. ఈ పాదాలను తాకిన పాదుకలు పద్నాలుగేళ్ళు అయోధ్యానగరాన్ని శత్రుల బారిన పడకుండా కాపాడాయి. బండబారిన అహల్య బతుకును ఈ పాదధూళే చక్కనొత్తి పునర్జన్మనిచ్చి కాపాడింది. ఇంత బలవత్తరమైనవి, మహత్తరమైనవి కనుకనే బ్రహ్మదేవుడంతటివాడు రోజూ కడిగి ఆ శ్రీపాద తీర్థాన్ని శిరసున జల్లుకుంటున్నాడు.
వేదాలు వామనుని ఉరుకాయుడు, ఉరుక్రముడని వర్ణించాయి. ధూళి ధూసరమైన ఆయన పాదాలలో సమస్త లోకాలూ అంతర్హితమయ్యాయని చెబుతున్నాయి. వేదాంత దేశికుడు మరో అడుగు ముందుకేసి “ఆకాశానికి ఎత్తిన పాదం ధ్వజమై, మందాకినీ జలం పటమై అలరారుతోందన్నాడు. ఇది బలి చక్రవర్తి ఔదార్యాన్ని పై లోకాల్లో ప్రకటించడానికి ఎత్తిన పతాకంలా ఉందని” గొప్పగా ఉత్ప్రేక్షించాడు.
బలిచక్రవర్తి విష్ణుభక్తుడు. విష్ణుభక్తులు ఫలితమాశించకుండా నిష్కారణ పూజలు చేయాలే తప్ప గొంతెమ్మ కోరికలు పెట్టుకోకూడదు. అప్పుడే హరి స్పందించి అభీష్టాలు నెరవేరుస్తాడు. ఈ నియమం తప్పి ఇంద్రపదవి కోరుకుని విశ్వజిద్యాగం చేశాడు బలి. మనకు ఎన్ని రకాల అర్హతలున్నా దైవం అనుకూలించినప్పుడే కోరుకున్నవి నెరవేరుతాయి.
అంత వరకు ఎదురు చూడడం తప్ప చేయగలిగింది లేదు. కానీ బలి తొందరపడి ఇంద్రపదవి లాక్కున్నాడు, దేవతల తల్లి అదితి మొరపెట్టుకుంటే హరి వామనుడై వచ్చాడు. నీ కోరిక తప్పక తీరుతుందని, అందుకు సావర్ణి మనువు కాలం వరకు ఎదురు చూడాలని బలికి చెప్పాడు వామనుడు.
దానం పేరుతో సమస్తమూ వదులుకున్న బలి అంతవరకు ఎక్కడ ఉండాలి?
అందుకే వామనుడు దయతలచి పాతాళంలో తన మనిషిగా ఉండమన్నాడు. అక్కడ ధర్మ పాలనలో తనకు సహకరించమన్నాడు. బలి ఆ మాటలను తలదాల్చి పాతాళలోక చక్రవర్తి అయ్యాడు.
శ్రీమహావిష్ణువు విభవావతారాల్లో త్రివిక్రమ స్వరూపం అత్యంత అద్భుతం. భాద్రపద శుక్లపక్షంలో శ్రవణా నక్షత్రయుక్తమైన ద్వాదశినాడు అందరూ వామన జయంతిని జరుపుకొంటారు.
శ్లో॥ దేవేశ్వరాయ దేవాయ దేవసంభూతికారిణే |
ప్రభవే సర్వదేవానాం వామనాయ నమోనమః ॥