యాక్షన్ ఎమోషనల్ డ్రామా !!

Sharing is Caring...

Action emotional thriller……..

‘సర్జామీన్’ (Sarzameen)  అంటే “స్వదేశం”, “మాతృభూమి” లేదా “నేల” అని అర్ధం. ఇదొక యాక్షన్ ఎమోషనల్ థ్రిల్లర్ సినిమా. తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లోనూ డబ్ అయి జియోహాట్‌స్టార్ లో అందుబాటులో ఉంది. 

పృథ్వీరాజ్ సుకుమారన్, కాజోల్, ఇబ్రహీం అలీ ఖాన్ (సైఫ్ అలీ ఖాన్ కుమారుడు – మొదటి సినిమా) ప్రధాన  పాత్రల్లో నటించారు.కాయోజ్ ఇరానీ దర్శకత్వం వహించారు. నిర్మాత: కరణ్ జోహార్. 

కథేంటంటే?

“విజయ్ ఒక బాధ్యతాయుతమైన ఆర్మీ ఆఫీసర్‌, కానీ కఠినమైన తండ్రి. పైగా అతనికీ తన తండ్రితో కొన్ని వ్యక్తిగత విభేదాలు ఉన్నాయి. విజయ్ తన పదిహేనేళ్ల కొడుకు హర్మాన్‌ను చూసి సిగ్గుపడుతుంటాడు. ఎందుకంటే హర్మాన్ భయస్తుడు. నత్తి ఉన్నవాడు. హర్మాన్‌ను అతని తల్లి అమితంగా ప్రేమిస్తుంది, కానీ అతను మాత్రం ఎప్పుడూ తన తండ్రి మెప్పు కోసం తపిస్తూ ఉంటాడు.

కొన్ని పరిస్థితుల కారణంగా హర్మాన్ కిడ్నాప్ అవుతాడు. అయితే ఎనిమిదేళ్ల తర్వాత, చనిపోయాడని అందరూ భావించిన హర్మాన్, ఇబ్రహీం అలీ ఖాన్ రూపంలో తిరిగి వస్తాడు. ఎంతో ఆత్మవిశ్వాసంతో, ధృడంగా కనిపిస్తున్న హర్మాన్, ఇన్నేళ్లూ శత్రువుల భూభాగంలో గడపడం వల్ల దేశద్రోహిగా మారాడా? అని విజయ్ మాత్రం సందిగ్ధంలో పడతాడు.చివరికి ఏం జరిగింది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే

ఆర్మీ ఆఫీసర్‌గా, దేశం కోసం కొడుకును కూడా శంకించే తండ్రి పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ తన నటనతో సినిమాను నిలబెట్టారు. కొడుకు కోసం తపించే తల్లిగా కాజోల్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది.సైఫ్ అలీ ఖాన్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ఇబ్రహీం తన మొదటి సినిమాలోనే ఒక క్లిష్టమైన పాత్రను ఎంచుకున్నాడు, ఎమోషనల్ సీన్స్‌లో పర్వాలేదనిపించాడు.

సినిమా ప్రారంభంలో వచ్చే ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్స్, కాశ్మీర్ మంచు కొండల నేపథ్యంలో సాగే యాక్షన్ బ్లాక్స్ సాంకేతికంగా చాలా అద్భుతంగా ఉంటాయి. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆర్మీ ఆఫీసర్‌గా చాలా ఫిట్‌గా, పవర్‌ఫుల్‌గా కనిపించిన సీన్లు ఆకట్టుకుంటాయి.

కొడుకు గురించి భర్తతో కాజోల్ వాదించే సీన్లు, దేశభక్తి గల ఆర్మీ ఆఫీసర్‌గా పృథ్వీరాజ్ పడే మానసిక సంఘర్షణ సీన్లు నటీనటులుగా వారిద్దరి ప్రతిభను చూపిస్తాయి. సినిమా ముగింపులో దేశమా? లేక కొడుకా? అనే క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు పృథ్వీరాజ్ తీసుకునే నిర్ణయం, ఆ సమయంలో వచ్చే హై-వోల్టేజ్ డ్రామా ప్రేక్షకులకు నచ్చుతుంది. 

1980ల నాటి అమితాబ్ బచ్చన్ క్లాసిక్ ‘శక్తి’ సినిమా తరహాలోనే ఈ తండ్రీకొడుకుల సంఘర్షణ ఉంటుంది. కథనం చాలా చోట్ల ఊహకందేలా సాగుతుంది. స్క్రీన్‌ప్లే సాగదీసినట్లు ఉంటుంది. కథలో ట్విస్ట్‌లు ఉన్నప్పటికీ, అవి ప్రేక్షకులను పెద్దగా థ్రిల్ చేయవు. దేశభక్తి, కుటుంబ సెంటిమెంట్లను ఇంకాస్త బలంగా రాసుకోవాల్సింది.

మంచి నటీనటులు ఉన్నప్పటికీ, బలహీనమైన కథనం,రొటీన్ మేకింగ్ వల్ల ఒక యావరేజ్ మిలిట్రీ థ్రిల్లర్‌గా మిగిలిపోయింది. థియేట్రికల్ రిలీజ్ కాకుండా నేరుగా ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమాకు అసలైన ప్రాణం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను తనూజ్ తికూ అందించారు. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ కమల్‌జీత్ నేగి అద్భుతమైన విజువల్స్ అందించారు. సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్లలో కెమెరా వర్క్ ఒకటి. 

కాశ్మీర్ లోయలోని మంచు కొండలు, అక్కడి అందాలను కెమెరాలో చాలా రిచ్‌గా, కంటికి ఇంపుగా చూపించారు. మిలిటరీ ఆపరేషన్లు, బోర్డర్ ఫైట్స్, రెస్క్యూ సీన్లను కమల్‌జీత్ నేగి తన కెమెరాతో చాలా రియలిస్టిక్‌గా, గ్రిప్పింగ్‌గా క్యాప్చర్ చేశారు. ఆసక్తి ఉన్నవారు సినిమాను జియోహాట్‌స్టార్‌లో ఓసారి చూడవచ్చు.
 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!