Actual events ………….
‘IB 71’ …2023 నాటి యాక్షన్ థ్రిల్లర్ సినిమా..’ఘాజీ’ చిత్ర దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో, విద్యుత్ జమ్వాల్, అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ పీరియడ్ స్పై థ్రిల్లర్ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
కథాంశం ఏమిటంటే ?
ఇది 1971 నాటి ఇండో-పాక్ యుద్ధానికి ముందు జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన దేశభక్తి చిత్రం. పాకిస్తాన్, చైనా దేశాలు కలిసి భారతదేశంపై దాడి చేయడానికి కుట్ర పన్నుతాయి. ఈ ముప్పు నుండి దేశాన్ని కాపాడటానికి ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) అధికారి దేవ్ జమ్వాల్ (Vidyut Jammwal) కేవలం 10 రోజులలో 30 మంది ఏజెంట్లతో కలిసి ఒక అత్యంత రహస్యమైన మిషన్‌ను ఎలా విజయవంతం చేశాడు అనేదే ఈ సినిమా కథ.
యాక్షన్ సీన్లతో పాటు మైండ్ గేమ్స్, ప్లానింగ్, సస్పెన్స్‌తో ఈ సినిమా సాగుతుంది. సంకల్ప్ రెడ్డి స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ‘ఘాజీ’ సినిమాతో మెప్పించిన దర్శకుడు ఈ సినిమాను కూడా అంతే ఇంటెలిజెంట్‌గా తెరకెక్కించారు. అనవసరమైన పాటలు, లవ్ ట్రాక్‌లు పెట్టకుండా మొదటి నుండి చివరి వరకు కథపైనే దృష్టి పెట్టారు.
సాధారణంగా విద్యుత్ అంటే భారీ మార్షల్ ఆర్ట్స్ ఫైట్లు గుర్తుకొస్తాయి. కానీ ఇందులో ఆయన తన కండల బలాన్ని కాకుండా మైండ్ పవర్‌ను ఉపయోగించే ఐబీ ఆఫీసర్‌గా చాలా హుందాగా, అద్భుతంగా నటించారు.
విమానం హైజాక్ అయి పాకిస్తాన్‌లోని లాహోర్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన తర్వాత నుంచి అసలు కథ మొదలవుతుంది..ఆ తర్వాత వచ్చే సీన్లు ప్రేక్షకులకు మంచి థ్రిల్ ఇస్తాయి. ఐబీ చీఫ్‌గా అనుపమ్ ఖేర్ తన నటనతో సినిమాకు అదనపు బలాన్ని చేకూర్చారు.
సినిమా ప్రారంభంలో క్యారెక్టర్ల పరిచయం, హైజాక్ ప్లాన్ వివరించే సీన్లు కొంచెం నెమ్మదిగా సాగుతాయి. పాకిస్తాన్ ఆర్మీ , అక్కడి ఇంటెలిజెన్స్ అధికారులను కొన్ని సీన్లలో చాలా బలహీనంగా, అమాయకులుగా చూపించడం కొద్దిగా లాజిక్‌కు దూరంగా అనిపిస్తుంది.
‘IB 71’ కేవలం గాల్లో ఫైట్లు చేసే రొటీన్ దేశభక్తి సినిమా కాదు. తెరవెనుక మన దేశ ఐబీ ఏజెంట్లు ప్రాణాలు పణంగా పెట్టి చేసిన ఒక రహస్య పోరాటం. ‘ఘాజీ’, ‘మద్రాస్ కేఫ్’ వంటి ఇన్వెస్టిగేటివ్, స్పై థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా ఖచ్చితంగా చాలా బాగా నచ్చుతుంది.
తెలివైనవాడిగా భావించే ఒక పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్ (అఫ్జల్ ఆగా – ఈ పాత్రను అశ్వత్ భట్ పోషించారు) ఐబీ ఏజెంట్ల సంభాషణలను దొంగ చాటుగా వినే సన్నివేశాలు,హోటల్ నుంచి మన ఏజంట్లు పాక్ మిలిటరీ సిబ్బంది ని మాయ చేసి తప్పించుకుని బోర్డర్ కి చేరుకునే సన్నివేశాలు బాగుంటాయి.హోటల్ లో మిలటరీ సిబ్బందిని బంధించి ఐబీ ఏజెంట్లు తప్పించుకునే సీన్స్ ఆకట్టుకుంటాయి. తర్వాత ఏమవుతుందా ఉత్కంఠ కలుగుతుంది.
కథలో లోపాలు ఉన్నప్పటికీ, ‘ఐబీ 71’ ఒకసారి చూడదగ్గ చిత్రమే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేక పోయింది. ఈ చిత్రాన్ని దాదాపు ₹25 కోట్ల నుండి ₹28 కోట్ల పరిమిత బడ్జెట్‌తో నిర్మించారు.బాక్సాఫీస్ రన్ ముగిసే సమయానికి ఇండియాలో దాదాపు ₹22.49 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది.
విదేశీ కలెక్షన్లతో కలుపుకుని ఈ సినిమా లైఫ్‌టైమ్ రన్‌లో ప్రపంచవ్యాప్తంగా సుమారు ₹29.19 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది.ఈ సినిమా విడుదలైన సమయంలోనే బాలీవుడ్‌లో ‘ది కేరళ స్టోరీ’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. దాని ప్రభావం వల్ల ‘IB 71’ సినిమా పై పడింది.
విద్యుత్ జమ్వాల్ అనగానే ప్రేక్షకులు ఆశించే భారీ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ సీన్లు ఇందులో లేకపోవడం, కథనం కొంత స్లో గా సాగడం వల్ల సాధారణ మాస్ ఆడియన్స్ ఈ సినిమాను పెద్దగా ఆదరించలేదు.పెట్టిన పెట్టుబడి (బడ్జెట్) కి సమానంగా వసూళ్లను రాబట్టినప్పటికీ, డిస్ట్రిబ్యూటర్లకు, థియేటర్లకు పెద్దగా లాభాలను తెచ్చిపెట్టలేకపోయింది.

