తెలంగాణ ‘పానకాల స్వామి’ ని చూసారా ?

Sharing is Caring...

తెలంగాణ లోని ఖమ్మం జిల్లాలో కూడా ఒక పానకాల స్వామి ఉన్నాడు. మంగళగిరి పానకాలస్వామి అంత పాపులర్ కాక పోయినా ఈ స్వామి కూడా స్వయంభువు.కొండ రాళ్ళ మధ్య పెద్ద రాతిలో వెలసిన నరసింహ స్వామి. బిందె తో పోసినా…గ్లాసు తో పోసినా సగం పానకం మాత్రమే స్వామి స్వీకరిస్తాడు.

అందుకే స్వామి వారికి పానకాల స్వామి అనే పేరు వచ్చింది. చుట్టూ పచ్చటి పొలాలు నడుమ కొండరాళ్ళు.ఆ కొండ రాళ్ళ వంపులోనే చిన్న గుడి. ఈ గుడికి 400 వందల సంవత్సరాల చరిత్ర ఉందట.అయితే వాటికి సంబంధించిన ఆధారాలు అక్కడ ఏమి లేవు.

ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న ఈ దేవాలయానికి ప్రచారం లేదు. దేవాదాయ శాఖా, ఆలయ ధర్మకర్తలు పట్టించుకోక పోవడంతో ఈ పానకాల స్వామికి ఆదరణ కరువైంది. మామూలు రోజుల్లో భక్తులు ఎవరూ రారని.. ఎపుడో అరుదుగా వస్తుంటారని అక్కడి రైతు ఒకరు చెప్పాడు.

ఈ గుడి ఎక్కువ కాలం ఆ గ్రామ దొరల ఆధీనంలో ఉండటం మూలానా భక్తులు నరశింహ స్వామికి దూరంగా ఉండిపోయారు.తర్వాత దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చినా ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదు.భక్తులు వచ్చినా రాకపోయినా పూజారి వెంకట రమణా చార్యులు రోజు వచ్చి స్వామి వారికి నైవేద్యం నివేదించి వెళతారు.

పూజారి తండ్రి,తాత గార్లు కూడా ఈ స్వామిని సేవించారు.ప్రతి ఏటా వచ్చే కాముని పున్నమి రోజు మాత్రం ఇక్కడ తిరణాల జరుగుతుంది.ఆ రోజున స్వామి వారికి కళ్యాణం జరుగుతుంది.స్వామి ఉత్సవ విగ్రహాన్ని ఆ రోజు ఊరేగింపుగా తీసుకొస్తారు.భద్రత దృష్ట్యా స్వామి ఉత్సవ విగ్రహాలను నాగులవంచ లోని రామాలయంలో ఉంచారు.అప్పట్లో స్వామి వారికి 150 ఎకరాల మాన్యాన్నినిజాం నవాబు కానుకగా ఇవ్వగా వాటిని అమ్మి సొమ్మును బ్యాంకులో వేసారట.

 

పచ్చటి ప్రకృతి మధ్య వెలసిన ఈ స్వామికి ప్రచారం కూడా తక్కువే.సర్కారు పూనుకుంటే అద్భుతమైన పర్యాటక క్షేత్రం గా వెలుగొందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అన్నట్టు ఈ ఆలయ ధర్మకర్త మరెవరో కాదు.కోట్లకు పడగలెత్తిన అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాప్ రెడ్డి దగ్గరి బంధువు సురేంద్రరెడ్డి.ఆయన సారద్యం లో ఎలాంటి అభివృద్ధి లేదనే విమర్శలున్నాయి. ఈ దేవాలయం ఖమ్మం….. బోనకల్ దారిలో నాగులవంచ నుంచి సీతంపేట మీదుగా వెళితే పచ్చటి పొలాల మధ్య కనిపిస్తుంది.ప్రభుత్వం పట్టించుకుని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. 

————-–  KSK.Theja 

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!