చూడదగిన కోర్టు రూమ్ డ్రామా !!

Sharing is Caring...

MURDER MISTARY…………..

నటి జ్యోతిక లాయర్ పాత్రలో నటించిన కోర్టు రూమ్ డ్రామా చిత్రం పొన్మగల్ వందాళ్. ఈ సినిమా తెలుగులో “బంగారు తల్లి ” పేరుతో డబ్బింగ్ అయి ఆహా (aha) ఓటీటీ వేదికగా విడుదలైంది. ఈ చిత్రానికి జె.జె. ఫ్రెడ్‌రిక్ దర్శకత్వం వహించారు.

జ్యోతిక కెరీర్‌లోనే ఆమె మొదటిసారి పూర్తిస్థాయి లాయర్ పాత్ర పోషించిన చిత్రం ఇది.కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది. సినిమాలో ఆమె రెండు పాత్రల్లో నటించింది.

కథ ఏమిటంటే ?

జ్యోతిక ఈ చిత్రంలో ధైర్యవంతురాలైన జూనియర్ న్యాయవాది పాత్రను పోషించారు. ఊటీ నేపథ్యంలో సాగే ఈ కథలో, 15 ఏళ్ల క్రితం ఐదుగురు పిల్లల కిడ్నాప్, హత్య కేసులో నిందితురాలిగా ముద్రపడి ఎన్‌కౌంటర్ అయిన ‘జ్యోతి’ అనే మహిళ కేసును జ్యోతిక మళ్లీ రీ-ఓపెన్ చేయిస్తుంది.

సమాజం, తోటి లాయర్లు, బాధితుల కుటుంబాల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురైనప్పటికీ, చట్ట వ్యతిరేక శక్తులతో పోరాడి అసలైన నేరస్థులను ఎలా పట్టుకుంది, సమాజంలో జరుగుతున్న బాలల లైంగిక వేధింపుల (Child Abuse) వెనుక ఉన్న నల్లటి నిజాలను కోర్టులో ఎలా నిరూపించింది అనేది ఈ సినిమా ముఖ్య కథాంశం.

లాయర్ పాత్రలో జ్యోతిక అద్భుతమైన నటనను కనబరిచారు. కోర్టు రూమ్ సీన్స్‌లో ఎమోషనల్ డైలాగ్స్ చెప్పేటప్పుడు ఆమె పలికించిన హావభావాలు సినిమాకు ప్రధాన బలం. సమాజంలో చిన్న పిల్లలపై (ముఖ్యంగా బాలికలపై) జరుగుతున్న లైంగిక వేధింపుల చుట్టూ కథ అల్లుకున్నారు.

తల్లి దండ్రులు ఆడపిల్లలకు జాగ్రత్తగా ఉండమని చెప్పడం మాత్రమే కాదు, మగపిల్లలకు ఆడవారిని గౌరవించడం కూడా నేర్పించాలి” అనే సందేశం అందరినీ ఆకట్టుకుంటుంది.

ఆర్. పార్థిబన్, కె. భాగ్యరాజ్, త్యాగరాజన్ వంటి సీనియర్ నటుల నటన సినిమాకు మరింత బలాన్ని చేకూర్చింది. పార్థిబన్, జ్యోతిక ల మధ్య వచ్చే కోర్టు వాదనలు ఆసక్తికరంగా ఉంటాయి. గోవింద్ వసంత అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) ఎమోషనల్ సీన్లను బాగా ఎలివేట్ చేసింది.

సినిమాకు రామ్‌జీ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఈ చిత్రంలో ఆయన కెమెరా వర్క్ సినిమా మూడ్‌ను, ఎమోషన్స్‌ను ప్రేక్షకులకి కనెక్ట్ చేయడంలో కీలక పాత్ర పోషించింది. సినిమాలో ఎక్కువ భాగం కోర్టు రూమ్‌లోనే సాగుతుంది.

సాధారణంగా ఒకే గదిలో షూట్ చేసేటప్పుడు విజువల్స్ బోర్ కొట్టే అవకాశం ఉంటుంది. కానీ, ఇందులో లాయర్ల మధ్య జరిగే వాదోపవాదాలు, జ్యోతిక ముఖంలో పలికే భావోద్వేగాలను సరిగ్గా క్యాప్చర్ చేయడానికి విభిన్నమైన కెమెరా యాంగిల్స్, క్లోజప్ షాట్స్‌ను ఉపయోగించారు. లైటింగ్ వర్క్ కూడా కోర్టు రూమ్‌కు తగినట్లుగా చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది

కథ ప్రారంభమైన కొద్దిసేపటికే ట్విస్టులు ఏమై ఉంటాయో, సినిమా క్లైమాక్స్ ఎలా ముగుస్తుందో ప్రేక్షకులు సులభంగా ఊహించేయవచ్చు.ఓటీటీ (OTT) సినిమాల్లో ప్రేక్షకులు వాస్తవికతను ఎక్కువగా కోరుకుంటారు. కానీ దర్శకుడు జె.జె. ఫ్రెడ్‌రిక్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాల తరహాలో కోర్టు డ్రామాను కాస్త అతి నాటకీయంగా  మార్చారు.

జ్యోతిక పాత్ర ద్వారా దర్శకుడు సమాజానికి సందేశాన్ని ఇవ్వడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో, కొన్ని చోట్ల సినిమా కాస్త లెక్చర్ ఇస్తున్నట్లు, డాక్యుమెంటరీ తరహాలో సాగుతుంది.మంచి సామాజిక కథాంశమే , కానీ కథనం పాత పద్ధతిలో సాగుతుంది.

సామాజిక సందేశాలు ఉన్న సినిమాలు లేదా సీరియస్ కోర్టు రూమ్ డ్రామాలను ఇష్టపడేవారైతే, జ్యోతిక నటన కోసం ఈ చిత్రాన్ని ఖచ్చితంగా ఒకసారి చూడవచ్చు.యూట్యూబ్ లో కూడా ఉంది..ఆసక్తి ఉన్నవారు చూడ వచ్చు.  

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!