ఎన్జీవోలపై గురి పెట్టిన సర్కార్ !

Sharing is Caring...

పార్లమెంట్ ‌ఆమోదించిన  విదేశీ విరాళాల సవరింపు చట్టాన్ని దేశంలోని పలు స్వచ్చంద సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటివరకు 50 శాతంగా ఉన్న నిర్వహణ ఖర్చులను 20 శాతానికి తగ్గించడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నిర్వహణ ఖర్చులను 20 శాతానికి తగ్గించడం మూలాన ఉద్యోగుల వేతనాలు చెల్లించడం కష్టమని అభిప్రాయపడుతున్నాయి. కార్యక్రమాలను నిర్వహించడానికి అవసరమైన ఉద్యోగులు లేకపోతే … వారికి సరిపడా జీతాలు ఇవ్వలేకపోతే  ఎన్జీవో ల మనుగడే ప్రశ్నార్ధకం గా మారుతుందని ఎన్జీవో నిర్వాహకులు అంటున్నారు. 

కాగా ఈ కొత్త చట్టం ఎన్జీవోలను వేధింపులకు గురి చేసేలా ఉందని కొందరు అంటున్నారు. ఒక కమిట్మెంట్ తో పని చేసే సంస్థలకు ఈ చట్టం అశనిపాతమే.  నిపుణులకు , ఉద్యోగులకు ఇచ్చే జీతాల్లో కొత్త పడుతుందని అంటున్నారు. దాని వల్ల చేస్తున్న కార్యక్రమంలో లక్ష్యాలను సాధించడం కష్టమౌతుంది. 

విదేశీ విరాళాలు దారి మళ్లకుండా నియంత్రించేందుకు చేపట్టిన సవరణలు బాగానే ఉన్నప్పటికీ నిజాయితీ, నిబద్దత తో పని చేసే సంస్థలకు ఇబ్బందులు ఎదురవుతాయి. విరాళాల వినియోగంలో జవాబుదారీ తనం కావాలనే ఉద్దేశ్యంతో క్షేత్ర స్థాయిలో నిజంగా పనిచేస్తున్న ఎన్జీవోలపై ఇలా ఆంక్షలు విధించడం సబబు కాదని అంటున్నాయి. ప్రజారోగ్యం మొదలు హక్కుల పరిరక్షణ వరకు వివిధ రంగాలలో ప్రజలకు అండగా ఉంటున్న ఎన్జీవోల గొంతు నొక్కడం సమంజసం కాదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది. ప్రభుత్వ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

విదేశీ విరాళాలు స్వీకరించే ప్రతి ఎన్జీవో ఇకపై తప్పనిసరిగా కేంద్ర హోమ్ శాఖ సూచించే ఢిల్లీ లోని స్టేటుబ్యాంక్  అఫ్  ఇండియా శాఖలో ఖాతా తెరవాలి. విరాళాలను ఆ ఖాతాలోనే జమ చేయాలి. 
దాని నుంచే నగదును సంస్థకు చెందిన ఇతర ఖాతాలకు బదిలీ చేసుకోవాలి. ఇప్పటివరకు ఎఫ్ సి ఆర్ ఏ కు దరఖాస్తు చేసుకున్న 22. 447 ఎన్జీవోలు ఢిల్లీ లో ఖాతా తెరవక తప్పదు. 
ఆధార్ కార్డు తప్పని సరి సుప్రీం పదేపదే చెబుతుంటే కేంద్రం మాత్రం ఎన్జీవోల ప్రతినిధులు ఆధార్ సమర్పించాలని కొత్త చట్టంలో స్పష్టం చేశారు. 
కాగా కేంద్రం పరిధిలో ఖాతాలుంటే లావాదేవీలు జరపడం కష్టమని కొన్ని సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కొందరు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇలా ఒకే బ్యాంకులో ఖాతాలుంటే ఆ బ్యాంకు కి బోలెడు లాభం. రుణాలు పెద్ద ఎత్తున ఇవ్వొచ్చు . తద్వారా వడ్డీ ఆర్జించవచ్చు. ఇక కేంద్రానికైతే  ఏ ఎన్జీవో కి ఎంత విదేశీ విరాళం వస్తుందో సులభంగా తెలుసుకునే అవకాశం కలుగుతుంది. 
దేశవ్యాప్తంగా ఇప్పటికి  21,915 ఎన్జీవోలు సంస్థలు 2018-19 ఆర్ధిక సంవత్సరానికి  వార్షిక ఐటీ రిటర్న్స్ దాఖలు చేశాయి .  
ఇదిలా ఉంటే  గతంలో యూపీఏ సర్కారు కూడా 2010లో ఈ చట్టానికి సవరణలు చేసి ఎన్జీవోలను కట్టడి చేసింది. 2012 లో తమిళనాడులోని కూడంకుళం అణువిద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా అక్కడి ప్రజల ప్రాణ భద్రత కోసం ఉద్యమించిన ఎన్జీవోలపై చర్యలకు దిగింది. ఎన్డీయే సర్కారు కూడా కొన్ని ఎన్జీవోలపై విరుచుకు పడింది. మళ్ళీ ఇపుడు మరో ప్రయత్నానికి ఎన్డీయే సర్కారు పూనుకుంది. ఉద్యమాలు చేసే సంస్థలపై సర్కారు ఆగ్రహంతో ఉంది. కొన్ని సంస్థల్లో సీఎంవోలకు లక్షల్లో జీతాలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు ఐఏఎస్ అధికారులు ఉద్యోగాలకు సెలవు పెట్టి ఎన్జీవోలకు సలహాదారులుగా, సీఈవో లు గా కూడా చేస్తున్నారు. 
ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే  కేంద్రం ఈ కొత్త చట్టాన్ని తెచ్చింది. మొత్తం మీద కొందరి నిర్వాకాలకు అందరూ బలి అవుతున్నారు.
కొత్త చట్టం మేరకు ప్రభుత్వ అధికారులు , జడ్జీలు , వర్శిటీ ఉద్యోగులు , ఎంపీలు , మంత్రులు తదితరులు విదేశీ విరాళాలు పొందడానికి వీల్లేదు.  విరాళాలు పొందే సంస్థలు ఆ సొమ్మును సబ్ గ్రాంట్ కింద వేరే సంస్థలకు మళ్లించరాదు. ఆ సంస్థకు అర్హతలున్నప్పటికీ నిధులు బదిలీ చేయకూడదు. ఈ నిబంధనల వల్ల నెట్ వర్క్ ప్రోగ్రామ్స్ చేయడం కష్టం. ఎవరికి వారు పని చేసుకోవాలి. ఈ నిబంధనలు పాటిస్తూ ఎన్జీవోలు పనిచేయడం కష్టమే. 
———- KNMURTHY 
PHOTO COURTESY …. ASSIGNMENT POINT

 

Sharing is Caring...
Support Tharjani

Comments (2)

  1. యూ.వి.రత్నం September 25, 2020
  2. గుత్తా హరిసర్వోత్తమ నాయుడు September 27, 2020
error: Content is protected !!