Parikrama……
‘మానస సరోవర పరిక్రమ’ ఇది కేవలం మానస సరోవరం చుట్టూ చేసే ప్రదక్షిణ. కైలాష్ పరిక్రమ కు ముందుగా చేసే పరిక్రమ. మానస సరోవర పరిక్రమ’ ఇపుడు అందరూ బస్సులోనే చేస్తున్నారు. అత్యంత పవిత్రమైన, ఆధ్యాత్మిక, సాహసోపేతమైన ప్రయాణాలలో ఒకటి.
టిబెట్‌లోని హిమాలయ పర్వత శ్రేణులలో సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఉన్న ఈ సరస్సుచుట్టూ కాలినడకన లేదా వాహనాల ద్వారా ప్రదక్షిణ చేయడాన్నే పరిక్రమ అంటారు. హిందూ, బౌద్ధ, జైన, బోన్ మతాల అనుచరులు ఈ యాత్రను ఎంతో పవిత్రంగా భావిస్తారు.
మానస సరోవరం అనేది స్వచ్ఛమైన నీటితో కూడిన ఒక పవిత్రమైన సరస్సు. పురాణాల ప్రకారం, బ్రహ్మ దేవుని మనస్సు నుండి ఈ సరస్సు ఉద్భవించింది.మానస సరోవరం చుట్టూ పూర్తి పరిక్రమ దూరం సుమారు 102 నుండి 105 కిలోమీటర్లు ఉంటుంది.
సాధారణంగా యాత్రికులు ఈ సరస్సు చుట్టూ ప్రత్యేక వాహనాల (Eco-Buses) ద్వారా ప్రదక్షిణ పూర్తి చేస్తారు. వాహనంలో ఈ పరిక్రమ పూర్తి చేయడానికి దాదాపు 3 నుండి 4 గంటల సమయం పడుతుంది. ఈ సరస్సు సముద్ర మట్టానికి దాదాపు 4,590 మీటర్లు ఎత్తులో ఉంది . ఇక్కడి చల్లని నీటిలో పవిత్ర స్నానం చేయడం లేదా ఆ నీటిని తలపై చల్లుకోవడం వల్ల జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.
మే -సెప్టెంబర్ మధ్య కాలంలో వాతావరణం కాస్త అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా బౌద్ధ పూర్ణిమ నుండి దీపావళి లోపు ఈ యాత్రకు అనుమతి ఇస్తారు. ఎత్తైన ప్రాంతాల వల్ల వచ్చే అనారోగ్యం రాకుండా ఉండటానికి యాత్రకు కనీసం 2-3 నెలల ముందు నుండే రన్నింగ్, బ్రీతింగ్ వ్యాయామాలు చేయాలి.
మానస సరోవరం చైనా ఆధీనంలోని టిబెట్ ప్రాంతంలో ఉంది. దీని కోసం భారత విదేశాంగ శాఖ (MEA) లేదా గుర్తింపు పొందిన ప్రైవేట్ టూర్ ఆపరేటర్ల ద్వారా చైనా వీసా, ప్రత్యేక టిబెట్ ట్రావెల్ పర్మిట్లు పొందాలి.
హిందూ పురాణాల ప్రకారం, ప్రతిరోజూ తెల్లవారుజామున రాత్రి 2:30 గంటల నుండి 3:45 గంటల మధ్య బ్రహ్మ ముహూర్తంలో ఆకాశం నుండి దేవతలు, సప్తఋషులు కిందకు దిగి వస్తారు. వారు మానస సరోవరంలోని పవిత్ర జలాల్లో స్నానం చేస్తారని నమ్ముతారు.
ఆ సమయంలో ఆకాశం నుండి ప్రకాశవంతమైన కాంతి పుంజాలు లేదా నక్షత్రాలు లాంటి దివ్య జ్యోతులు సరస్సు వైపు వేగంగా దూసుకురావడాన్ని చాలా మంది యాత్రికులు స్వయంగా చూశామని చెబుతుంటారు.
రాత్రి వేళల్లో సరస్సు ఒడ్డున టెంట్లు వేసుకుని పడుకునే భక్తులకు, నీటిలో ఎవరో నడుస్తున్నట్లు, నీళ్లు చల్లుకుంటున్నట్లు, గజ్జెలు, ఆభరణాల శబ్దాలు వినిపిస్తాయని యాత్రికులు విశ్వసిస్తారు.
కైలాస పర్వతాన్ని శివుని నివాస స్థానంగా భావిస్తారు కాబట్టి, ఆ ప్రాంతం అంతా అత్యంత శక్తివంతమైన పాజిటివ్ ఎనర్జీతోనిండి ఉంటుంది. రాత్రి వేళల్లో మానస సరోవరం వద్ద ధ్యానం లేదా మంత్ర జపం చేయడం వల్ల మానసిక ప్రశాంతత, దైవిక అనుభూతి కలుగుతుందని భక్తులు నమ్ముతారు
మానస సరోవరం వద్ద రాత్రి బస చేయడం ఒక అద్వితీయ ఆధ్యాత్మిక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. రాత్రి వేళల్లో ఈ ప్రాంతంలో ఉండే నిశ్శబ్దం, ఆకాశంలో నక్షత్రాల వెలుగులు భక్తులను సరికొత్త లోకంలోకి తీసుకెళ్తాయి.
మానస సరోవరం కి సమీపంలో ఉన్న ‘హోరే’ గ్రామంలో యాత్రికుల కోసం గెస్ట్‌హౌస్‌లు, డార్మిటరీలు అందుబాటులో ఉన్నాయి ఇక్కడ కేవలం ప్రాథమిక వసతులు (మంచం, దుప్పట్లు) మాత్రమే లభిస్తాయి, లగ్జరీ హోటళ్లు ఉండవు.రాత్రి వేళల్లో ఇక్కడ ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీలు లేదా అంతకంటే తక్కువకు పడిపోతాయి. కాబట్టి విపరీతమైన చలి ఉంటుంది.
బ్రహ్మ ముహూర్తంలో (రాత్రి 2:30 నుండి 3:45 మధ్య) సరస్సును చూడటానికి వెళ్లేవారు ఒంటరిగా వెళ్ళకూడదు. చలి తీవ్రత , ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. గైడ్ లేదా గ్రూప్ సభ్యులతో కలిసి వెళ్ళడం సురక్షితం.
చైనా అధికారుల తాజా నిబంధనల ప్రకారం, కాలుష్యం కాకుండా చూడటానికి మానస సరోవర సరస్సు నీటిలోకి దిగి నేరుగా స్నానం చేయడాన్ని నిషేధించారు. భక్తులు ఆ పవిత్ర జలాలను పాత్రలలోకి తీసుకుని ఒడ్డున తలపై చల్లుకోవచ్చు.
కైలాష్ మానస సరోవర్ యాత్రలో భాగంగా మానస సరోవరాన్ని ముందుగా దర్శిస్తారు.. కైలాష్ పరిక్రమ కు వెళ్లలేని యాత్రీకులు దార్చేన్ బేస్ క్యాంప్ లో ఉండవచ్చు. పరిక్రమ కు వెళ్లిన వారు తిరిగి వచ్చినపుడు వారితో కల్సి వెనక్కిరావచ్చు.
pl. Read it also …………. కైలాష్ పరిక్రమ అక్కడ నుంచే మొదలవుతుందా ?

