విభజిత విద్వేషాల్నివెక్కిరించిన సినిమా !!

Sharing is Caring...

Ramana Kontikarla…..

దేశమంటే మట్టికాదోయ్ ..మనుషులోయ్ అన్నాడు మహాకవి గురజాడ. ఆ నినాదం తెలియని బ్రిటీష్ తెల్ల దొరొకడు వచ్చి ఏసీ రూముల్లో కూర్చుని విభజన గీత గీశాడు. గుండెల్ని రాయి చేశాడు. కొండంత ఎదిగిన బంధాల్ని పిండి చేశాడు. విభనజకు ఏంటి ప్రాతిపదిక? ఇది కదా లెక్క తేలాల్సింది!

భౌగోళికమైన విభజనలు చేసినప్పుడు… భావోద్వేగాల విభజన సాధ్యమా అన్న ప్రశ్న కదా ఆలోచింపజేయాల్సింది!అలాంటి విభజన గాయం ఎదుర్కొంటున్న సర్గోధా కథే.. మై వాపస్ ఆవూంగా! ఆ గాయాల్లోంచి పుట్టిన ఓ ప్రేమకథే ఈ భావోద్వేగ కావ్యం.

వయస్సు మీరినా.. భీష్ముడు అంపశయ్య ఎక్కినట్టుగా మరణశయ్యపై పడుకున్నా… మనసు మాత్రం సర్గోధా జ్ఞాపకాల్లోనూ, తన ప్రియురాలి యాదిలో విహరిస్తుంది. అలాంటి గరేవాల్ పాత్రలో వృద్ధుడిగా నసీరుద్దీన్ షా వంటి నటుడి పాత్ర బాగుందని చెప్పడమంటే చంద్రుడికో నూలుపోగు సమర్పించినట్టే. తన సినీ నటనా అపార అనుభవమంతా గరేవాల్ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టు జీవం పోశాడు.

చేతిపై రాసుకున్న నజమ్… కాలం చెరపలేని ప్రేమ ఇవి మనల్ని తట్టి లేపుతాయి. ఎంత మెటీరియలిస్టిక్ గా మనిషి తయారైపోయాడని ఆ విభజన జరిగిన తీరుపై చర్చకు తెరలేపుతుంది మై వాపస్ ఆవూంగా.

జీవితాంతం ఒకరిని అంతలా ప్రేమించే తాతను చూసి.. మనవడు దిల్జిత్ దోసాంజ్ ఆశ్చర్యపోతాడు. తానెన్నడూ చూడని ఆ భావోద్వేగాల్ని తాత చెబితే వింటూ దృశ్యమానం చేసుకుంటుంటే ఎక్కడో తడి అతడిని.. తాత కథ వెంట నడిపిస్తుంది.

1947 విభజనకు ముందు సర్గోధా, లాహోర్, రావల్పిండిలో ఏం జరిగిందో… ఓ ప్రేమకథను చారిత్రక హింస ఎలా బ్రేకప్ చేసిందో…  క్యాన్వాస్ పెకెక్కించిన నివాళి మై వాపస్ ఆవూంగా!

డిమెన్షియా అటాకైన వృద్ధులు మన ఇంటింటా ఎక్కడో ఓచోట దర్శనమిస్తూనే ఉంటారు. నేటి జెన్ జీ జనరేషనేమో ఎక్కడో విదేశాల్లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, రోబోటిక్ టెక్నాలజీ గురించి ఆలోచిస్తుంటారు. కానీ, ఇప్పటికీ 80 ఏళ్లకు పైబడ్డ నాటి వృద్ధ తరం మాత్రం పూర్వపు జ్ఞాపకాల్లో, వాసనల్లో మునిగి తేలడానికి.. నాటి బంధాలే కారణమని.. ఆ బంధాలు బలమైనవని చెబుతుంది మై వాపస్ ఆవూంగా!

గరేవాల్, అఫ్సానా ప్రేమకథను… కావ్యంలా తెరపై పర్చి… ఆ నాటకీయతకు జీవం పోశాడు. ఇంతియాజ్ కాకుండా ఇంకెవ్వరూ అలా తీయలేరనేది మాత్రం రుజువు చేశాడు. ఎక్కడా అనవసరమైన పోకడలు లేకుండా సాధారణంగా సాగుతున్నట్టనిపించే ఓ అసాధారణ సినిమా.

మర్చిపోయిన ఓ వృద్ధ ప్రేమకథలోకి అడుగుపెట్టే ఓ యువ ఎన్ఆర్ఐ మనవడి పాత్రలో దిల్జిత్ దోసాంజ్ ఆకట్టుకున్నాడు. మూలాలు, తన గుర్తింపు కోసం పరితపించే తాత అంతర్మథనాన్ని ఆయన చిన్న చిన్న చూపుల్లోనూ, స్పష్టంగా చెప్పలేని వాక్యాల్లోనూ, నైరాశ్యపు నిట్టూర్పుల్లోనూ వ్యక్తీకరించిన తీరు తడి ఉన్నవారెవరినైనా టచ్ చేసేది.

నసీరుద్దీన్ షా యువకుడిగా ఉన్న పాత్రలో కినుగా వేదాంగ్ రైనా అమాయకత్వం, దృఢసంకల్ప రెండింటినీ సమన్వయపర్చిన తీరు ఆకట్టుకుంది. శర్వరితో కిను ప్రేమ సన్నివేశాలు.. అమృతా ప్రీతమ్ వంటివారి కవిత్వంలోని బాధ, నిరీక్షణ, ప్రేమను గుర్తు చేసేవి.దిల్జిత్ తండ్రిగా రజత్ కూడా గంభీరమైన భావోద్వేగాలతో ఆన్ స్క్రీన్ ప్రెజెంటేషన్ సినిమాను ఫిల్ చేసేది.

ఇక ఏ. ఆర్. రెహమాన్ సంగీతం 90ల్లో ఉన్నట్టు లేదనే కంప్లైంట్ ఎలాగూ ఉండనే ఉంది. కానీ, ట్రెండ్ మారుతున్నట్టుగా ప్రయాణించడమే సరైందన్నది రెహమాన్ ప్రతీ ఇంటర్వ్యూలో చెప్పే మాట. వాటన్నింటినీ పక్కనబెడితే.. పంజాబీ, భారతీయ సంగీత సంప్రదాయాలకు బ్రిటీష్ రాజ్ కాలపు ఆర్కెస్ట్రైజేషన్ ను ఫ్యూజన్ చేశాడు.

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించే ఒక సమీక్ష ప్రత్యేకంగా రాసేంత అద్భుతమైన మైన్యూట్ పర్క్యూషన్స్ అలరిస్తాయి. కొన్నిచోట్ల భావోద్వేగాలకు ఇలాగుంటే బాగుండుననిపించొచ్చు. కానీ, ఒకరి సృజనను మరొకరు కొలవలేరు. అయితే, సంగీత దర్శకుడిగా రెహమాన్ ను.. ముఖ్యంగా నేపథ్యం సంగీతాన్ని అందించడంలో సృజనాత్మకంగా పతాక స్థాయిలో నిలబెట్టే చిత్రం మై వాపస్ ఆవూంగా!

ఇక సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్, క్యాస్టూమ్స్ వంటి ప్రతీ క్రాఫ్ట్ పైనా ప్రత్యేక శ్రద్ధతో ఒక అమరశిల్పి జక్కన శిల్పం చెక్కినట్టుగా చెక్కాడు ఇంతియాజ్ అలీ. 1947 నాటి సర్గోధా పట్టణాన్ని ఎంతో సహజంగా, జీవంతో ఉట్టిపడే విధంగా చూపించారు. సినిమాటోగ్రాఫర్ సిల్వెస్టర్ ఫోన్సెకా.. ప్రతీ ఫ్రేమ్ కు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఎందుకంటారన్నట్టుగా చూపించారు.

అయితే, రెండు కాలాలను ఏకకాలంలో మిళితం చేసి చూపించే క్రమంలో కొంత కన్ఫ్యూజన్… అందుకు తగ్గ నెమ్మదైన నడక కొంత భారంగా మారి.. ఈ సినిమాపై కొందరికి ఓ చిన్న ఫిర్యాదుకు కారణమవుతుంది.

అయినా నిద్రలేని రాత్రులు గడుపుతూ రూమీ కవిత్వం చదివినవారికి.. గాయం ఉన్న చోటే వెలుగు నీలోకి ప్రవేశిస్తుందనే విషయం బోధపరుస్తుంది. 1947 విభజన విషాదాలను చిత్రిక పట్టిన అమృతా ప్రీతమ్ పద్యాలతో.. మనసు తడి చేసుకున్నవారికి మై వాపస్ ఆవూంగా ఓ ప్రత్యేక అనుభూతిని మిగిల్చే సినిమా.

అరుదైన ప్రేమలు కాలాన్ని కూడా జయిస్తాయని నిరూపించిన కథ మై వాపస్ ఆవూంగా. సినిమా విడుదలైన మొదటి వారంలో థియేటర్లు ఖాళీగా ఉండి, కేవలం ₹12.25 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ప్రమోషన్లు పెద్దగా వర్కవుట్ అవ్వలేదు.

అయితే సినిమా చూసిన ప్రేక్షకులు థియేటర్లలో ఏడ్చామని, ఇదొక అద్భుతమైన కావ్యమని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ప్రారంభించారు. దాంతో రెండో వారం నుండి థియేటర్లకు జనాలు పోటెత్తారు.విడుదలైన ఒక నెల రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ₹93 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, త్వరలోనే ₹100 కోట్ల మైలురాయికి చేరువలో ఉంది

మౌలా లీలో నిన్న సాయంత్రం షో చాలా రోజుల తర్వాత చూసిన మై వాపస్ ఆవూంగా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ మంచి అనుభూతి!

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!