ఆదాయ పన్నులేని దేశం !!

Sharing is Caring...

This is a small country….

మొనాకో (Monaco)… ఇదొక చిన్న దేశం..పశ్చిమ ఐరోపాలోని ఫ్రెంచ్ రివేరా తీరంలో ఉన్న అత్యంత సంపన్నమైన స్వతంత్ర నగర-రాజ్యం. వాటికన్ సిటీ తర్వాత ఇది ప్రపంచంలోనే రెండవ అతిచిన్న దేశం. అలాగే ప్రపంచంలోనే అత్యధిక జనసాంద్రత కలిగిన దేశంగా గుర్తింపు పొందింది. ఇది మూడు వైపులా ఫ్రాన్స్ దేశంతో, ఒక వైపు మధ్యధరా సముద్రంతో సరిహద్దులను పంచుకుంటుంది.

ఈ చిన్నదేశ మొత్తం వైశాల్యం కేవలం 2.02 చదరపు కిలోమీటర్లు మాత్రమే. ఇంత చిన్న స్థలంలో దాదాపు 38,000 కంటే ఎక్కువ మంది నివసిస్తున్నారు. స్థలం కొరత కారణంగా, ఈ దేశం సముద్రాన్ని పూడ్చి తమ భూభాగాన్ని పెంచుకుంటోంది. 

మొనాకోలో నివసించే నివాసితులపై ఎలాంటి వ్యక్తిగత ఆదాయ పన్ను విధించరు.ఇక్కడి పన్ను నిబంధనల వల్ల ప్రపంచంలోని అత్యంత సంపన్నులు, వ్యాపారవేత్తలు ఇక్కడ స్థిరపడతారు. ఇక్కడి జనాభాలో ప్రతి ముగ్గురిలో ఒకరు మిలియనీర్ కావడం విశేషం.

ఇక్కడి మోంటే కార్లో కేసినో (Monte Carlo Casino) ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది.  విలాసవంతమైన జీవనశైలికి ఇది కేరాఫ్ అడ్రస్. ఒక నియమం ప్రకారం, మొనాకో పౌరులకు (మొనెగాస్క్ జాతీయులు) ఈ కేసినోలలో ఆడేందుకు లేదా ప్రవేశించేందుకు అనుమతి లేదు. ఇది కేవలం విదేశీ పర్యాటకుల కోసం మాత్రమే. 

ఫార్ములా వన్ (F1) రేసింగ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన మొనాకో గ్రాండ్ ప్రిక్స్ రేస్ ప్రతి ఏటా ఇక్కడి నగర వీధుల్లోనే జరుగుతుంది.ఇక్కడి రోడ్లపై ప్రపంచంలోని అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లు, సముద్ర తీరంలో కళ్లుచెదిరే విలాసవంతమైన యాట్‌లు (Yachts) నిరంతరం దర్శనమిస్తాయి. 

దేశం చాలా చిన్నది కావడం వల్ల ఇక్కడ విమానాశ్రయం లేదు. పర్యాటకులు పక్కనే ఉన్న ఫ్రాన్స్ దేశంలోని ‘నీస్’ (Nice) ఎయిర్‌పోర్ట్ ద్వారా ఇక్కడికి చేరుకుంటారు. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన ప్రదేశాలలో మొనాకో ఒకటి. ఇక్కడ ప్రతి చదరపు అడుగు పర్యవేక్షణలో ఉంటుంది. నేరాల రేటు దాదాపు శూన్యం.

మొనాకోలో రాజ్యాంగబద్ధమైన వంశపారంపర్య రాచరికం ఉంది. 13వ శతాబ్దం (1297) నుండి ‘గ్రిమాల్డి’ (Grimaldi) రాజకుటుంబం ఈ దేశాన్ని పాలిస్తోంది. ప్రస్తుతం ప్రిన్స్ ఆల్బర్ట్ II ఇక్కడి దేశాధినేతగా ఉన్నారు. ఫ్రాన్స్ ప్రభావం వల్ల ఇక్కడి అధికారిక భాష ఫ్రెంచ్.

ఇక్కడ విలాసవంతమైన ఓడలు అనేవి కేవలం రవాణా సాధనాలు కావు, అవి సముద్రంపై తేలియాడే 7-స్టార్ ఫైవ్ స్టార్ హోటళ్లు లేదా రాజభవనాలు. ముఖ్యంగా మొనాకో వంటి ధనిక దేశాల తీరాలలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి.

ఒకటి కోటీశ్వరుల సొంత సూపర్ యాట్‌లు (Private Yachts), రెండు పర్యాటకుల కోసం నడిచే లగ్జరీ క్రూయిజ్ షిప్‌లు (Luxury Cruise Ships). వీటిలో దాదాపు అన్ని పెద్ద యాట్‌లలో ఒకటి లేదా రెండు హెలికాప్టర్ ల్యాండింగ్ ప్యాడ్‌లు, ఇన్ఫినిటీ స్విమ్మింగ్ పూల్స్, జకుజీలు (Jacuzzis) ఉంటాయి.

ఓడ లోపలే అత్యాధునిక థియేటర్లు, జిమ్‌లు, లగ్జరీ స్పా మసాజ్ సెంటర్లు , బ్యూటీ సెలూన్లు అందుబాటులో ఉంటాయి.కొన్ని షిప్‌లలో సముద్రం లోపలికి వెళ్లి చూడటానికి చిన్న సైజు సబ్‌మెరైన్లు (జలంతర్గాములు), స్పీడ్ బోట్లు, జెట్ స్కీలు కూడా లోపల దాచి ఉంచుతారు.

ఇక్కడికి ప్రతి సంవత్సరం దాదాపు 3.5 లక్షల నుండి 5 లక్షల మందికి పైగా అంతర్జాతీయ పర్యాటకులు వస్తుంటారు. పర్యాటక రంగం ఆ దేశానికి అతిపెద్ద ఆదాయ వనరుగా ఉంది.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!