ఎన్టీఆర్ మెచ్చిన నిరాడంబర చిత్రకారుడు !!

Sharing is Caring...

TAADI PRAKASH………………………………...

దొంగ కడుపున దొంగే పుడతాడా? అని కొందరు ఆశ్చర్యపోవచ్చు గానీ శిల్పి కడుపున శిల్పి పుట్టాడు. కుంచె పేరు ‘చిత్ర’. అసలు పేరు కొప్పోజు విఘ్నేశ్వరాచారి. తాత, తండ్రి కళాకారులు, మంచి శిల్పులు. వాళ్ళ వులిని పుణికిపుచ్చుకున్నాడీ యువకుడు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ, మందపాడు గ్రామంలో 33ఏళ్ళ క్రితం చిన్న వులి చేతబట్టుకొని పుట్టాడు. అక్కడి పొలాల్ని, పచ్చని చెట్లని, మబ్బుల్ని, మట్టిమనుషుల్ని ప్రేమించాడు.

కాగితాలు ముందేసుకుని బొమ్మలు వేయడం మొదలెట్టాడు. పిచ్చిగీతలు గమ్మత్తయిన బొమ్మలవడం పాలబుగ్గల విఘ్నేశ్వరాచారిని ఉక్కిరిబిక్కిరి చేసింది. వయసొచ్చింది. రంగులు కలిపి బొమ్మలేయడం నేర్చాడు. ఆ రంగుల మిశ్రమంలో మైమరిచిపోయి వేళాపాళా లేకుండా బొమ్మలేశాడు. తాగుడు కంటే దారుణమైన వ్యసనం చిత్రకళ అని తెలియడానికి ఎంతోకాలం పట్టలేదు.

పొద్దున్నే నిద్రలేస్తే చెట్లకొమ్మల మీంచి ఎగిరే పిట్టలు పలకరించేవి. గుంపులు గుంపులుగా గుండెను వూపేస్తూ మబ్బులు వెళ్ళిపోతుండేవి. చంకన కడవ పెట్టుకుని ‘పక్కింటి పడుచుపిల్ల’ నీళ్ళ కోసం చెరువుకెళుతుండేది. వీధిలో మట్టికొట్టుకుపోయిన పిల్లలు గోళీలు ఆడుతుండేవాళ్ళు. వాకిట్లో నించున్న పండు ముసిలాడు ఒక ముద్ద అన్నం కోసం అర్థిస్తుండేవాడు.

ఓహ్! ఎన్ని చిత్రాలు! ఎన్ని రంగులు! దేన్ని చూసినా బొమ్మ వేసెయ్యాలన్న ఆరాటం. ‘ఈ బొమ్మలు కూడు పెడతాయా’ అని అమ్మా, అమ్మమ్మల అనుమానం .. చూపులు గుచ్చుకుంటూనే ఉన్నాయి. అయినా కుంచె అంటే పంచప్రాణాలు. కళ్లు మూసినా రంగులే! కమ్మని కలలొచ్చినా బొమ్మలే!

పెద్ద పెయింటింగులు వెయ్యాలి. ఈ కుంచెతోనే ప్రపంచాన్ని జయించాలనే వెర్రి తపన ఎక్కడా నిలబడనివ్వలేదు.

బతుకు బండదని, ఛండాలమనీ అప్పుడే తెలిసొచ్చింది ఆచారికి. మంచి బొమ్మలు వేయాలన్నా మంచి కుంచెలు వుండాలనీ, వాటిని డబ్బులు పెట్టి కొనాలనీ జ్ఞానోదయమయ్యేసరికి నిరుపేద ఆకాశం కింద ఒంటరిగా నిల్చుండిపోయానని తెలిసి దుఃఖం పొంగుకొచ్చింది.అమ్మ, అమ్మమ్మల చూపుల్లోని ‘పిల్లాడి భవిష్యత్తు మీద బెంగ’ గుర్తొచ్చింది. ఏ పల్లె కళాకారుడైనా ఏం చేస్తాడు? ఒక చేత్తో కుంచె, మరో చేత్తో పొట్ట పట్టుకుని హైదరాబాద్ అనే హృదయం లేని నగరానికొచ్చాడు. రద్దీ! ఒకటే రద్దీ!

ఎవర్నీ ఎవరూ పట్టించుకోరు. ఎవరికీ ఎవరూ అక్కర్లేదు. ఇక్కడ మనుషులు మౌనంగా వుంటారు. డబ్బు మాట్లాడుతుంది. అవసరాలు పలకరిస్తాయి. ఆర్టిస్టుల అవసరం పత్రికలకెప్పుడూ వుంటుంది. మంచి ఆర్టిస్టుల అవసరం మరింత వుంటుంది. విఘ్నేశ్వరాచారి అనే తెలంగాణ విలేజ్ బోయ్ ‘చిత్ర’ అనే సిటీ ఆర్టిస్టు అయ్యాడు. రెండు మూడు పత్రికలు మారాడు.

పత్రికల్లో పన్చేస్తే జీతం రాళ్ళొస్తాయి గాని, స్వేచ్ఛగా రెక్కలు విప్పుకుని ఎగరడానికి కళాకారునికి సాధ్యంకాదని, ఉద్యోగం వెండి సంకెల అనీ వెంటనే తెలిసొచ్చింది. ఎడంకాలి చిటికెన వేలితో ఉద్యోగాన్ని సుతారంగా తన్నిపారేసి సొంత కళా ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. విజృంభించి బొమ్మలేశాడు. వారసత్వం నరాల్లో పలికి మంచి శిల్పాలూ చెక్కాడు. చిన్నపాటి పేరొచ్చింది. కళలో మెళకువలూ పట్టుబడ్డాయి.

పదిహేడు, పద్దెనిమిదేళ్ళ లేలేత మీసాల నాటికే కొమ్ములు తిరిగిన ఆర్టిస్టుల్ని మెప్పించాడు. ఈ యువ కళాకారుణ్ణి చూసి ముచ్చటపడిన కేతినేని రామారావు అమీర్ పేటలోని సత్యం థియేటర్ లో ప్లాస్టర్ ఆఫ్ పేరిస్ బొమ్మలు చేయమని పురమాయించారు. ‘చిత్ర’కి హుషారొచ్చింది. అందమైన తెల్లని బొమ్మలు మలిచాడు. కేతినేనికి సన్నిహితుడైన ఒక సినిమా నటుడు ఓరోజు ఆ థియేటర్ కి వచ్చాడు. ఆ అందమైన తెల్లని బొమ్మలు చూసి ముచ్చటపడ్డాడు. ఎవరు చేశారివి? అని ఆ సినీనటుడు అడిగి తెలుసుకున్నాడు. “ఇదిగో, ఈ కుర్రాడే” అని ‘చిత్ర’ని ఆ నటుడికి పరిచయం చేశారు.

ఇంతకీ ఆ సినిమా నటుడు ఎన్టీ రామారావు.‘చిత్ర’ భుజం తట్టి “మా స్టూడియోకి రండి” అని ఆప్యాయంగా ఆహ్వానించారు ఎన్టీఆర్. ‘చిత్ర’ భుజాలు పొంగాయి. ఎన్టీఆర్ చెప్పినట్టే చేశాడు. అనురాగ దేవత, వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర మొదలైన సినిమాలకు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ బొమ్మలు చేశాడు. సెట్టింగ్స్ వేశాడు. కళ కూడు పెట్టింది. గుర్తింపూ ఇచ్చింది. భుజం తట్టిన మేటి కళాకారుడు తారక రామారావు కన్నుమూశాడు.

 ‘చిత్ర’కారుడు ఏం చేయగలడు? ఎన్టీఆర్ శిల్పం తయారు చేశాడు. భలేగా వచ్చింది. పదిమందీ మెచ్చుకున్నారు. ఆ ఉత్తేజంతో మరిన్ని ఎన్టీఆర్ శిల్పాలు చేశాడు. సిమెంటు, రాయి, ప్లాస్టర్ ఆఫ్ పేరిస్, కంచుతోనూ ‘చిత్ర’ విగ్రహాలు చేయగలడు. చెక్కని కూడా చెక్కి మానవ రూపాలు తయారు చేస్తాడు.

కంచుతో విగ్రహం ఎలా చేస్తారు? అని అడిగితే, “ముందు మట్టితో విగ్రహం చేస్తాను. ఎంత మందం కంచుబొమ్మ కావాలో అంత మందాన బొమ్మకి మైనం పూస్తాను. దాన్ని ప్లాస్టర్ ఆఫ్ పేరిస్ సీల్ చేసేస్తాను. దానికి అక్కడక్కడా కన్నాలు పెట్టి విగ్రహాన్ని తలకిందులు చేసి కరిగించిన ఇత్తడి పోస్తాను. అప్పుడు క్రమంగా మైనం కరిగిపోయి ఇత్తడి అచ్చు వస్తుంది. దానికి తుది మెరుగులు దిద్దుతాను. విగ్రహం తయారవుతుంది”.. అని చెప్పాడు చిత్ర. ఎవరైనా ఆర్డర్ చేస్తే ఎన్టీఆర్ వి నిలువెత్తు విగ్రహాలు చేయగలను అన్నాడు.

‘చిత్ర’ వేసిన పెయింటింగులకు రెండుసార్లు రాష్ట్ర స్థాయి అవార్డులు వచ్చాయి. బాల కార్మికులపై వేసిన పెయింటింగ్ కోనసీను చిత్రకళా పరిషత్ వాళ్ళు రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి ఇచ్చి గౌరవించారు.
ఇంత పేరు పొంది, ఇన్ని మంచి పెయింటింగులు వేసి, శిల్పాలు చెక్కిన ఈ యువకుడికి చిటికెడు గర్వమూ లేదు. ఇప్పటికీ సిగ్గుపడుతూనే, ఇబ్బందిగానే మాట్లాడతాడు.

‘బ్రహ్మాండాన్ని బద్దలు కొట్టేస్తాను’ అని అస్సలు గప్పాలు కొట్టడు. ఏదో బొమ్మలు గీసుకునేవాణ్ణి అనేట్టు మాట్లాడతాడు.నిరాడంబరమైనవాడు. రాళ్ళనీ, సిమెంటునీ, కంచుని కూడా మనుషులుగా మలిచే ఈ బక్కని అమరశిల్పి జక్కన కళని మాత్రమే నమ్ముకున్న వెర్రి చిత్రకారుడు. దేనికీ ఆవేశపడడు. గందరగోళ పడిపోడు. కళా మర్మయోగిలా చిన్నగా నవ్వి ఊరుకుంటాడు.

 writer phone no.. 97045 41559

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!