సెంటిమెంట్, కోర్టు రూమ్ డ్రామా ఎలా ఉందంటే?

Sharing is Caring...

Court Room Drama ………

‘ఇక్కా’ (Ikka).. ఇదొక కోర్ట్‌రూమ్ లీగల్ థ్రిల్లర్.. సన్నీ డియోల్, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. నెట్‌ఫ్లిక్స్ లో తెలుగు వెర్షన్  విడుదలైంది. ప్రముఖ నటుడు సన్నీ డియోల్ దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ లాయర్ కోటు తొడగడం, ‘దామిని’ సినిమా నాటి పవర్‌ఫుల్ కోర్టు డ్రామాను గుర్తుచేయడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. 

క్లుప్తంగా కథ ఏమిటంటే ?

అర్జున్ మెహ్రా అలియాస్ ఇక్కా (సన్నీ డియోల్) తన కెరీర్‌లో ఓటమి ఎరుగని, నిఖార్సైన విలువలు గల ఒక సీనియర్ డిఫెన్స్ లాయర్ ..ఒక యువతిపై జరిగిన దారుణమైన హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న ఒక అహంకారి, ధనవంతుడైన శౌర్యమాన్ గౌర్ (అక్షయ్ ఖన్నా) కేసును వాదించడానికి అర్జున్ మొదట నిరాకరిస్తాడు.

కానీ, క్యాన్సర్‌తో బాధపడుతున్న తన కూతురిని రక్షించుకోవడానికి, శౌర్యమాన్ కుటుంబం నుండి వచ్చే ఆర్థిక లేదా వైద్య సహాయం కోసం అర్జున్ లొంగిపోవాల్సి వస్తుంది. తాను తప్పు చేశాడని బలంగా నమ్మే వ్యక్తిని కాపాడటానికి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మధుర బెనర్జీ (తిల్లోతమ శోమే) తో అర్జున్ కోర్టులో ఎలాంటి న్యాయపోరాటం చేశాడు? చివరకు ఏ మలుపు తిరిగింది? అనేదే మిగిలిన కథ.

కథలో ట్విస్ట్లున్నాయి. అవే సినిమాకు బలం. తనదైన సీరియస్ లుక్, కోర్టు గదిలో పలికించే ఎమోషన్స్‌తో సన్నీ డియోల్ లాయర్ పాత్రకు పూర్తి న్యాయం చేశారు.ఒక నిజాయితీ గల లాయర్ తన కూతురి ప్రాణం కోసం, సమాజం అసహ్యించుకునే క్రిమినల్ తరఫున నిలబడాల్సి వచ్చినప్పుడు ఎదుర్కొనే నైతిక సంఘర్షణ ను హావభావాల్లో బాగా చూపారు. 

ప్రాసిక్యూటర్‌గా తిల్లోతమ శోమే, అర్జున్ భార్యగా దియా మీర్జా తమ పరిధి మేరకు చక్కగా నటించారు.సన్నీ డియోల్ కూతురు పాత్రలో బాలనటి డారియా బేడీ నటించారు.అనారోగ్యంతో బాధపడే చిన్నారిగా, తండ్రిని అమితంగా ప్రేమించే కూతురిగా డారియా బేడీ తన క్యూట్ లుక్స్, ఎమోషనల్ సీన్లలో చాలా సహజంగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.కథలో ఆమెది ఒక కీలక పాత్ర .

కథ బలంగా ఉన్నప్పటికీ, స్క్రీన్‌పైకి వచ్చేసరికి పాతకాలపు కన్నీటి సెంటిమెంట్లు, అతి నాటకీయత (Melodrama) వల్ల కథనం సాగతీతగా అనిపిస్తుంది. కోర్ట్‌రూమ్ థ్రిల్లర్లలో ఉండే గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేషన్ సీన్లు ఇందులో లోపించాయి. 

క్లైమాక్స్ ట్విస్ట్ కూడా ప్రేక్షకులను అంతగా ఆశ్చర్యపరచదు. విలన్‌గా అక్షయ్ ఖన్నా నటన కొన్ని చోట్ల పాత పాత్రలను గుర్తుచేస్తూ ఫ్లాట్‌గా సాగింది.కోర్టు సన్నివేశాలు సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. సన్నీ డియోల్, తిల్లోతమ శోమే లాయర్లుగా ఒకరినొకరు ఢీకొట్టే సీన్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

సన్నీ డియోల్ కోర్టు లో చెప్పే  డైలాగ్స్, వాదనలు మాస్ ఆడియన్స్‌కు బాగా నచ్చుతాయి.డిఫెన్స్ లాయర్ , పబ్లిక్ ప్రాసిక్యూటర్ మధ్య జరిగే మేధోపరమైన వాదోపవాదాలు, ఒకరిని మించి మరొకరు వేసే లీగల్ ప్లాన్లు కోర్టు సీన్లను చాలా రసవత్తరంగా మారుస్తాయి.

ఈ చిత్రానికి జిష్ణు భట్టాచార్జీ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు. సినిమా కథలో ఎక్కువ భాగం కోర్టు గది లోనే సాగుతుంది. లాయర్ల మధ్య జరిగే వాదోపవాదాలు, పాత్రల ముఖాల్లోని నైతిక సంఘర్షణను, సస్పెన్స్ మూడ్‌ను కెమెరా యాంగిల్స్ ద్వారా చాలా క్లాసీగా, సీరియస్‌గా చూపించడంలో జిష్ణు మంచి ప్రతిభ కనబరిచారు. 

సినిమాకు అత్యంత కీలకమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను జూలియస్ ప్యాకియమ్ అందించారు. ఇదొక కోర్టు రూమ్ డ్రామా కావడం వల్ల లాయర్ల మధ్య జరిగే మైండ్ గేమ్స్, క్లైమాక్స్ ట్విస్టుల సమయంలో జూలియస్ ఇచ్చిన నేపథ్య సంగీతం సీన్లను బాగా ఎలివేట్ చేసింది. అయితే, కొన్ని చోట్ల మెలోడ్రామా ఎక్కువగా ఉండటం వల్ల సంగీతం కొంత రొటీన్‌గా అనిపిస్తుంది.

కొన్ని అనవసరమైన సన్నివేశాలు కూడా ఉన్నాయి.. సినిమాను ఇంకొంచెం ట్రిమ్ చేసినట్లయితే బాగుండేది.  ఈ సినిమాకు సిద్ధార్థ్ పి. మల్హోత్రా దర్శకత్వం వహించారు.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!