Long, slow-paced story………
‘పేట్రియాట్’ (Patriot) చిత్రం మమ్ముట్టి, మోహన్‌లాల్ దాదాపు 18 ఏళ్ల తర్వాత కలిసి నటించిన భారీ మలయాళ స్పై యాక్షన్ థ్రిల్లర్. మహేష్ నారాయణన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మొన్నటి మే లో విడుదలైంది. డిజిటల్ నిఘా (పెరిస్కోప్ స్పైవేర్), సైన్స్, దేశభక్తి నేపథ్యంలో సినిమా రూపొందింది.
కథ ఏమిటంటే ?
ప్రభుత్వ సంస్థ డిఫెన్స్ రీసెర్చ్ వర్క్ (DRW) లో పనిచేసే సీనియర్ అధికారి డాక్టర్ డేనియల్ జేమ్స్ (మమ్ముట్టి) చుట్టూ కథ తిరుగుతుంది. దేశంలోని సొంత ప్రజలపై నిఘా పెట్టడానికి తయారుచేసిన ‘పెరిస్కోప్’ అనే పవర్ఫుల్ స్పైవేర్ యాప్, సామాన్య ప్రజల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుంది? ఇందులో చిక్కుకున్న డేనియల్ జేమ్స్ ఈ కుట్రను ఎలా ఛేదించాడనేది ప్రధాన కథాంశం.
సినిమా మొత్తం మమ్ముట్టి చుట్టూ నడుస్తుంది. డేనియల్ జేమ్స్ పాత్రలో ఆయన ఇంటెన్సిటీ చాలా బాగుంది. కరెక్జ్ గా ఆపాత్రకు సూట్ అయ్యారు.వ్యవస్థలోని లోపాలను, డిజిటల్ స్పైవేర్ కుట్రలను ప్రపంచానికి చాటిచెప్పడానికి ఒక ‘వ్లాగర్’ (Vlogger) గా మారుతాడు.
సాధారణంగా లౌడ్ యాక్టింగ్ చేసే పాత్రలకు భిన్నంగా, ఒక సామాజిక స్పృహ ఉన్న పౌరుడిగా డిజిటల్ మీడియా ద్వారా ఆయన మాట్లాడే “హ్యూమన్ ఫార్మ్” డైలాగ్ సీన్ మమ్ముట్టి నటనలోని వైవిధ్యాన్ని చూపిస్తుంది.
విమానం లోపలి ఫైట్ సీన్ సినిమాకే మేజర్ హైలైట్లలో ఒకటి. మమ్ముట్టి చాలా రియలిస్టిక్‌గా, ఇంటెన్స్ బాడీ లాంగ్వేజ్‌తో నటించారు.యాక్షన్ ప్రియులకు ఈ సీన్ బాగా నచ్చుతుంది. మమ్ముట్టి రెండవ భార్యగా జరిన్ షిహాబ్ , విడిపోయిన భార్యగా నయన తార పాత్రల పరిధిలో బాగానే చేశారు. మైకేల్ పాత్రలో కుంచాకో బోబన్ కూడా బాగా నటించారు.
మోహన్‌లాల్ రిటైర్డ్ సైనికుడిగా, డేనియల్ స్నేహితుడిగా (కల్నల్ రహీమ్ నాయక్) అతిథి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించారు.ఇద్దరు ఒరేయ్ అని పిలుచుకుంటారు. పాత్ర చిన్నదైనా బాగా మలిచారు. మోహన్‌లాల్ ఎంట్రీ సీన్, మమ్ముట్టి ని కాపాడే యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే అతిపెద్ద హైలైట్లలో ఒకటి. ఆయన చూపించిన స్క్రీన్ ప్రెజెన్స్, స్టంట్ పర్ఫార్మెన్స్ అభిమానులను అలరిస్తుంది.
మమ్ముట్టి, మోహన్‌లాల్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన ప్రతి సన్నివేశం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. వీరిద్దరి మధ్య ఉండే ఆర్మీ బ్యాక్‌డ్రాప్ బాండింగ్, ఎమోషనల్ సీన్స్ చాలా హుందాగా సాగుతాయి. కార్లో ప్రయాణిస్తూనే శత్రువులను హతమార్చే సన్నివేశాలు,హాస్పిటల్ లో బాధితురాలిని రక్షించే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. దేశభక్తి, స్నేహం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని ఆర్మీ ఆఫీసర్‌గా మోహన్‌లాల్ తన సీరియస్ లుక్స్, ముఖ కవళికలతో అద్భుతమైన నటనను కనబరిచారు.
ఫహాద్ తన మార్క్ విలనిజం , సైకో తరహా హావభావాలతో పాత్రకు న్యాయం చేశారు. సినిమాలో మమ్ముట్టి ఫహాద్ ఫాజిల్ మధ్య వచ్చే కాంబినేషన్ సీన్స్ ఈ పొలిటికల్ సైబర్-థ్రిల్లర్‌కు ప్రధాన బలం అని చెప్పుకోవచ్చు.
సాంకేతికత సహాయంతో మమ్ముట్టిని ట్రాక్ చేయడానికి ఫహాద్ చేసే ప్రయత్నాలు, డిజిటల్ ట్రాప్‌ల నుంచి మమ్ముట్టి తెలివిగా తప్పించుకునే సీన్స్ సీట్ ఎడ్జ్ థ్రిల్‌ను ఇస్తాయి. టెక్నాలజీ తెలిసిన విలన్‌గా ఫహాద్ బాడీ లాంగ్వేజ్, ఆల్టర్నేటివ్ పద్ధతుల్లో అతని వ్యూహాలను తిప్పికొట్టే సీనియర్ సిటిజన్‌గా మమ్ముట్టి స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంటాయి.
మనుష్ నందన్ సినిమాటోగ్రఫీ, విజువల్స్ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి. సుషిన్ శ్యామ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కథకు తగ్గట్టుగా హైలైట్ అయింది.
సినిమా నిడివి దాదాపు 3 గంటల వరకు ఉంటుంది. చాలా చోట్ల కథనం నెమ్మదిగా సాగుతుంది. నిడివి తగ్గిస్తే బాగుండేది. కథ సీరియస్ టెక్నికల్ అంశాలతో సాగడం వల్ల, సాధారణ ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వడం కాస్త కష్టం. అభిమానులు కోరుకునే కమర్షియల్ హంగులు ఇందులో కనిపించవు. ఫైట్స్,ఛేజింగ్ సన్నివేశాలను బాగా చిత్రీకరించారు.
ఇది కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్ కాదు, ప్యూర్ డ్రామా, థ్రిల్లర్ ఇష్టపడేవారికి నచ్చే చిత్రం. స్టార్‌డమ్ కంటే కంటెంట్‌కు ప్రాధాన్యత ఇచ్చే దర్శకుడు మహేష్ నారాయణన్, సాంకేతిక అంశాలతో ఆలోచింపజేసే చిత్రాన్ని అందించారు.
కమర్షియల్, మాస్ ఎలిమెంట్స్ లేకపోవడం,సుదీర్ఘ నిడివి, నెమ్మదైన కథనం, క్లిష్టమైన టెక్నికల్ సబ్జెక్ట్, ఎమోషన్ లోపించడం వంటి అంశాలు సినిమాను పరాజయం పాలు జేసాయి. కథ కంటే స్టార్‌డమ్‌ను ఆశించి థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులకు సినిమా మెప్పించ లేకపోయింది.ప్రస్తుతం ఈ సినిమా తెలుగు వెర్షన్ zee 5 లో అందుబాటులో ఉంది. ఓపికగా చూడాలి.

