Action Thriller …….
‘వైల్డ్ డాగ్’ (Wild Dog) 2021 నాటి సినిమా ఇది. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా లో అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటించారు. అహీషోర్ సోలమన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కథ కూడా ఆయనే రాసుకున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది.
ఉగ్రవాదులు ప్లాన్ చేసిన 2007 హైదరాబాద్ గోకుల్ చాట్ బాంబు పేలుళ్లు, 2010 పూణే బేకరీ పేలుళ్లు ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. దేశ భద్రతకు ముప్పుగా మారిన ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద ముఠా నాయకుడు ఖాలీద్ భత్కల్ను పట్టుకోవడానికి ఎన్ఐఏ (NIA) ఏజెంట్ విజయ్ వర్మ తన బృందంతో కలిసి నేపాల్‌లో ఒక అత్యంత రహస్యమైన, ప్రమాదకరమైన ఆపరేషన్‌ను ఎలా నిర్వహించాడనేదే ఈ సినిమా కథ.
సినిమా అంతా నాగార్జున వన్ మాన్ షో గా నడుస్తుంది. విజయ్ వర్మ పాత్రలో నాగార్జున ఒదిగిపోయాడు. ఆయన టీమ్ లోని నటులు కూడా బాగా చేశారు. విలన్ ఖాలిద్ గా నటించిన బిలాల్ హొస్సేన్ తన క్రూరమైన హావభావాలు,నటనతో ప్రేక్షకులను మెప్పించారు.మిగిలిన పాత్రధారులు కూడా బాగా నటించారు.
ఎలాంటి వాణిజ్యపరమైన హంగులు, అనవసరమైన లవ్ స్టోరీలు, రొటీన్ కామెడీ లేకుండా కేవలం కథపైనే దృష్టి పెట్టి ఈ సినిమాను యాక్షన్ థ్రిల్లర్‌గా మలిచారు. నాగార్జున యాక్షన్ సీన్స్, మిలటరీ ఆపరేషన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి.
సినిమా ప్రారంభంలో హైదరాబాద్‌లోని గోకుల్ చాట్ బాంబు పేలుడు జరిగిన ప్రదేశాన్ని నాగార్జున పరిశీలించే సీన్ చాలా ఎమోషనల్‌గా, సీరియస్‌గా సాగుతుంది. ఇది ప్రేక్షకులను కథలోకి తీసుకువెళుతుంది.బాంబు పేలుళ్లకు కారణమైన నిందితుడిని నాగార్జున తన స్టైల్లో విచారించే సీన్ థ్రిల్లింగ్‌గా ఉంటుంది. విజయ్ వర్మకు “వైల్డ్ డాగ్” అనే పేరు ఎందుకు వచ్చిందో ఈ సీన్ చూపిస్తుంది.
క్లయిమాక్స్ లో ఉగ్రవాద సూత్రధారి ఖాలీద్‌ను పట్టుకుని ఎన్ఐఏ బృందం ఎవరికీ తెలియకుండా నేపాల్ సరిహద్దు దాటే ఉత్కంఠభరితమైన సన్నివేశాలు సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. ‘రా’ (RAW) ఏజెంట్ ఆర్య పండిట్‌గా సయామీ ఖేర్ ఎంట్రీ ఇచ్చి, ఉగ్రవాదులతో చేసే యాక్షన్ ఫైట్ సీన్ ప్రేక్షకులకు నచ్చుతుంది.
నేపాల్ అడవుల్లో కొండల మధ్య ఉగ్రవాదులకు, నాగార్జున టీమ్‌కు మధ్య జరిగే సుదీర్ఘమైన గన్ ఫైట్,చేజింగ్ సీన్ సినిమాలోనే అత్యంత ఉత్తేజకరమైన ఘట్టం. ఈ సన్నివేశాలను బాగా చిత్రీకరించారు.పెళ్లి కార్యక్రమంలో ఖాలీద్ ను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించే సీన్లు బాగా వచ్చాయి. సినిమా మొదట్లో కొంత స్లో గా ఉన్నప్పటికీ టీం నేపాల్ వెళ్ళినప్పటినుంచి కథలో వేగం,ఉత్కంఠ పెరుగుతుంది.
నాగార్జున క్యారెక్టర్‌కు థమన్ డిజైన్ చేసిన థీమ్ మ్యూజిక్” ఎలివేషన్ సీన్స్‌లో అభిమానులకు రోమాంచితమైన అనుభూతిని ఇస్తుంది. ముఖ్యంగా నేపాల్ బోర్డర్ దాటే సీన్స్, అడవిలో జరిగే చేజింగ్ సీన్స్‌లో థమన్ ఇచ్చిన స్లో అండ్ ఇంటెన్స్ మ్యూజిక్ సీన్లలోని ఉత్కంఠను నెక్స్ట్ లెవెల్‌కు ఎలివేట్ చేసింది.
ఈ చిత్రానికి షానీల్ దేవ్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. సినిమా డాక్యుమెంటరీ స్టైల్లో కాకుండా, చాలా సహజంగా, రియలిస్టిక్‌గా కనిపించేలా లైటింగ్, కలర్ ప్యాలెట్‌ను ఉపయోగించారు. నేపాల్ కొండలు, అడవులు, ఇరుకైన సందుల్లో జరిగే గన్ ఫైట్స్ ని అద్భుతంగా చిత్రీకరించారు.
‘వైల్డ్ డాగ్’ చిత్రానికి అహీషోర్ సోలమన్ కథ, స్క్రీన్‌ప్లే అందించి దర్శకత్వం వహించారు.దర్శకుడిగా ఇది ఆయనకు మొదటి సినిమా అయినప్పటికీ అలా అనిపించదు.సాధారణంగా టాలీవుడ్ యాక్షన్ సినిమాల్లో ఉండే మాస్ మసాలా ఎలిమెంట్స్ ను పక్కన పెట్టి, హాలీవుడ్ స్టైల్లో కేవలం మిషన్-ఓరియెంటెడ్ కథనం పైనే దర్శకుడు దృష్టి పెట్టారు.
నిజ జీవిత సంఘటనలను ఎంతో రీసెర్చ్ చేసి స్క్రీన్‌పైకి తెచ్చిన విధానానికి విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. సినిమాను కేవలం సెట్లలోనే ముగించేయకుండా, కథకు అవసరమైన రియలిజం కోసం కులు-మనాలి, నేపాల్ సరిహద్దు వంటి ప్రమాదకరమైన కొండ ప్రాంతాలలో షూటింగ్ జరిపి తన ప్రతిభను చాటుకున్నారు. ఆసక్తి గలవారు ఈ సినిమాను చూడవచ్చు.

