త్రినాధ్ రావు గరగ ………….
జైలర్ సినిమా హిట్ అయ్యాక మళ్ళీ సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్, అనిరుద్ కాంబినేషన్ అనగానే జైలర్ 2 సినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇటువంటి నేపథ్యంలో టైగర్ ముత్తువేల్ పాండియన్ తన హవాను కొనసాగించాడా అంటే కచ్చితంగా అవుననే చెప్పాలి.. ఈ విషయంలో రజనీ మానియాతో పాటు దర్శకుడి బ్రిలియన్స్ మనకి అడుగడుగునా కనపడుతుంది.
నిజానికి ఈ నెల్సన్ తన ప్రతి సినిమాలో అతని రైటింగ్, బ్రిలియన్స్ మనకు అబ్జర్వ్ చేస్తే కనబడతాయి.. నయనతార కో కో కోకిల, శివ కార్తికేయన్ డాక్టర్, విజయ్ దళపతితో వచ్చిన బీస్ట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని నెల్సన్ చూరగొన్నాడు. మామూలుగా రజినీకాంత్ ఎంట్రీ అనగానే దద్దరిల్లిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఓ బ్యాంగ్, బిల్డప్ వీటన్నిటిని ఊహించటం చాలా సహజం.
రజనీకాంత్ సినిమాల్లో అన్ని సినిమాల్లో దాదాపు ఇలాంటి కొలతలే ఉంటాయి. కానీ ఈ సినిమాలో రజనీని నెల్సన్ చూపించిన విధానం పూర్తిగా డిఫరెంట్ గా ఉంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో.. రజని స్టైల్ మేనరిజం మచ్చుకైనా మనకు కనపడవు కానీ ఆయన మార్క్ మాత్రం మనం మనకు అడుగడుగునా కనబడుతుంది.
జైలర్ 2 సినిమాలో మొదటి భాగం అంత బాగా వర్క్ అవుట్ అవ్వటానికి దర్శకుడి కష్టం మనకు స్క్రీన్ మీద కనబడుతుంది.మున్సిపల్ వాటర్ కి సంబంధించిన ఎపిసోడ్ .. ఇంటర్వెల్ బ్యాంగ్ కి సంబంధించిన యాక్షన్ ఎపిసోడ్ .. ప్రీ క్లైమాక్స్ లోని ఎమోషన్ .. లేడీస్ టీమ్ యాక్షన్ ఎపిసోడ్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతాయి. వీటికి తోడు ‘పూర్ణ’ స్పెషల్ సాంగ్ .. కొరియోగ్రఫీ పరంగా ఎక్కువ మార్కులు కొట్టేస్తుంది.
ఇక ద్వితీయార్ధానికి వచ్చేటప్పటికి నెల్సన్ మార్క్ కాస్త మిస్ అయింది..సెకండ్ హాఫ్ లో మనం వేరే సినిమా చూస్తున్నామా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. భారీ క్యాస్టింగ్ మిథున్ చక్రవర్తి, విద్యాబాలన్, ఎస్ఎస్ సూర్య, సూరజ్ వింజరమూడు, నోరా ఫతేహి సాంగ్.. ఇవన్నీ కూడా ఉన్నా కూడా ఏదో వెలితిగానే ఉంది. తర్వాత కథ సర్దుకున్నా.. ఫస్ట్ హాఫ్ లో కనపడిన ఆ జోష్ సెకండాఫ్ లో కనపడదు.
పైగా వేరే హీరోలు వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు..76 ఏళ్ల వయసులో కూడా రజనీ లో ఏమాత్రం గ్రేస్ తగ్గలేదని ఈ సినిమా చూస్తే అర్థమౌతుంది. ఇప్పటికీ అదే నడక.. అదే స్టైల్..రజనీ గ్రేస్ ఏ మాత్రం తగ్గకుండా.. ఆయన ఇమేజ్ ఎక్కడా తగ్గకుండా..అభిమానులు తలైవా నుంచి ఎలాంటి నటన కోరుకుంటారో అలాంటి నటనను ఆయన నుంచి రాబట్టుకోవడంలో దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ విజయం సాధించారు.
ఆయన దర్శకత్వ శైలిలో డార్క్ హ్యూమర్, అక్కడక్కడా మన శ్రీనువైట్ల క్యారెక్టరైజేషన్లు బాగున్నాయి.. సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తీక్ కన్నన్ పనితనం రజనీకాంత్ ను మనం చూసే ప్రతి ఫ్రేమ్‌లో మనల్ని ఆకట్టుకుంటుంది. ఇక ఎన్నో సినిమాలను తన చేత్తో నిలబెట్టిన అనిరుద్ రవిచంద్రన్ గురించి కొత్తగా చెప్పేదేముంది.నిర్మాణ విలువల పరంగా వంకబెట్టవలసిన పని లేదు.. కన్నన్ ఎడిటింగ్ పర్వాలేదు.
ఒక్క మాటలో చెప్పాలంటే రజనీకాంత్ మాస్ మేనియా మనల్ని అక్కడక్కడ ఆకట్టుకుంటుంది.. థియేటర్ లో ఈ సినిమాను కుటుంబంతో కలిసి చూడొచ్చు.
Tharjani ……..
సినిమా ఫస్ట్ హాఫ్‌లో తన గతాన్ని దాచిపెట్టి సాదాసీదాగా ఉండే ముత్తువేల్, క్లిష్ట పరిస్థితిలో (తన పరిచయస్తుడు , అతని గర్భవతి అయిన కూతురు ప్రమాదంలో ఉన్నప్పుడు) ఒక్కసారిగా విశ్వరూపం చూపిస్తాడు. సాధారణ వ్యక్తి నుండి భయంకరమైన ‘టైగర్’ ముత్తువేల్ పాండియన్‌గా ఆయన మారే ఆ ఎడిటింగ్ మాంటేజ్, ఎలివేషన్ సీన్ థియేటర్లలో ప్రేక్షకులతో ఈలలు వేయిస్తుంది. అలాగే సూరజ్ డెన్ లో సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయి.
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ (నరసింహ) పాత్రకు ఈ సీక్వెల్లో మరింత ప్రాధాన్యత లభించింది. కల్పక్ ఫ్యామిలీ తన కుటుంబాన్ని కిడ్నాప్ చేసి, తనను గాయపరిచినందుకు ప్రతికారంగా ఆయన చేసే విధ్వంసం, స్క్రీన్ ప్లేలో హై-వోల్టేజ్ యాక్షన్‌ను యాడ్ చేసింది.
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ఈ సినిమాలో గ్యాంగ్‌లార్డ్ ‘రాడీ’ (Roddy) పాత్రలో మెరిశారు. ముత్తువేల్ పాండియన్ జైలు నుండి తప్పించుకోవడానికి సహాయం చేయడం, ఆ తర్వాత అతని కుటుంబాన్ని కాపాడే క్రమంలో వచ్చే హృతిక్ యాక్షన్ సీక్వెన్స్ మాస్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తుంది. హృతిక్ స్టైలిష్ లుక్, రజనీకాంత్‌తో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకే హైలైట్‌గా నిలిచాయి.
మలయాళ స్టార్ మోహన్‌లాల్ తన పాత పాత్రలోనే మరోసారి పవర్ఫుల్ అప్పీరెన్స్ ఇచ్చారు. రజనీకాంత్, మోహన్‌లాల్ స్క్రీన్‌ను షేర్ చేసుకునే ప్రతి ఫ్రేమ్ అనిరుధ్ మ్యాజికల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో థియేటర్లలో పీక్ మూమెంట్స్గా నిలిచాయి.
విలన్ సూర్య ముత్తువేల్ స్వయంగా కొడుకుని చంపాడని ఆయన కుటుంబ సభ్యులకు చెప్పే సన్నివేశాలను బాగా చిత్రీకరించారు. రమ్యకృష్ణ తన పాత్ర పరిథిలో బాగానే చేసింది. సినిమాలో యాక్షన్ సీన్స్ ఎన్నో ఉన్నాయి ..కానీ రజనీ ఎక్కడా ఒక్క ఫైట్ చేయడు ..ఆయన తన స్టయిల్లో నిలబడో ,కూర్చొనో ఉంటాడు ..మిగతా వారు కొట్టుకు చస్తారు ..నెల్సన్ మార్క్ కథనం అది.
మొదటి భాగంలో వినాయకన్ పోషించిన ‘వర్మ’ పాత్ర చూపించినంత ఇంపాక్ట్, ఈ సీక్వెల్‌లోని విలన్ల (ఎస్.జె. సూర్య, మిథున్ చక్రవర్తి, సూరజ్ వెంజారమూడు) నుండి రాలేదని చెప్పుకోవచ్చు. విలన్ ట్రాక్ అంత బలంగా సాగలేదు. ఉన్నంతలో సూరజ్,సూర్యలు బాగానే చేశారు. లేడీ విలన్ గా విద్యాబాలన్ మెప్పించారు.

