Spy action movie …….
“ఏజెంట్ విక్రమ్ 007” .. 1986లో కమల్ హాసన్ కథానాయకుడిగా రూపొందిన క్లాసిక్ స్పై యాక్షన్ థ్రిల్లర్ . ఈ సినిమా తమిళ పేరు ‘విక్రమ్’ …తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఏజెంట్ విక్రమ్ 007..ఈ సినిమాకు రాజశేఖర్ దర్శకత్వం వహించారు. ప్రసిద్ధ రచయిత సుజాత రాసిన కథతో, అప్పట్లోనే జేమ్స్ బాండ్ తరహా హై-టెక్ పరికరాలు, కంప్యూటర్ల బ్యాక్‌డ్రాప్‌తో సరికొత్తగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అప్పట్లో ఈ చిత్రం ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది.
కథ ఏమిటంటే ?
భారత సైన్యానికి చెందిన ‘అగ్నిపుత్ర’ అనే ఒక శక్తివంతమైన న్యూక్లియర్ మిస్సైల్ (అణు క్షిపణి) ని సుధీర్రాజా (సత్యరాజ్) అనే అంతర్జాతీయ తీవ్రవాది దొంగిలిస్తాడు. ఆ మిస్సైల్ ఎక్కడుందో కనుగొని, దేశాన్ని రక్షించే బాధ్యతను ప్రభుత్వం టాప్ అండర్ కవర్ ఏజెంట్ అయిన కమాండర్ అరుణ్ కుమార్ విక్రమ్ (కమల్ హాసన్) కి అప్పగిస్తుంది. విక్రమ్ ప్రీతితో కలిసి ఈ రహస్య మిషన్‌ను ఎలా పూర్తి చేశాడనేదే సినిమా కథ.
సినిమా అంతా కమల్ హాసన్ వన్-మ్యాన్ షో గా నడుస్తుంది.అండర్ కవర్ ఏజెంట్‌గా కమల్ హాసన్ నటన, ఆయన స్టైల్, యాక్షన్ సీక్వెన్సులు సినిమాకు ప్రధాన ఆకర్షణ. జేమ్స్ బాండ్ తరహా సూట్లు, గన్లతో ఆయన లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. 1986 కాలంలోనే కంప్యూటర్లు, రాకెట్ లాంచర్లు, అధునాతన గ్యాడ్జెట్లను సినిమాలో చూపించడం ఒక సంచలనం.
బాలీవుడ్ ప్రముఖ నటి డింపుల్ కపాడియా ఈ సినిమాలో సలామియా దేశపు యువరాణి పాత్రను పోషించారు. కథలో కమల్ హాసన్ మిషన్‌కు ఈమె పాత్ర ఎంతో కీలకంగా మారుతుంది. నటి అంబిక ‘విక్రమ్ భార్య’ పాత్రలో కనిపిస్తారు. సినిమా ప్రారంభంలో విలన్ల చేతిలో ఈమె పాత్ర దారుణంగా హత్యకు గురవుతుంది, ఇది కథలో విక్రమ్ రివెంజ్ తీసుకోవడానికి ప్రధాన కారణం అవుతుంది.
‘ప్రీతి’ అనే కంప్యూటర్ ఎక్స్పర్ట్, విక్రమ్ అసిస్టెంట్ పాత్రను మలయాళ నటి లిజ్జీ పోషించారు.దొంగిలించబడిన న్యూక్లియర్ మిస్సైల్‌ను ట్రాక్ చేయడంలో విక్రమ్‌కు ఈమె సాంకేతికంగా సహాయం చేస్తుంది. పాత్రల పరిధి మేరకు ముగ్గురు బాగానే నటించారు. సత్యరాజ్ గ్లోబల్ టెర్రరిస్ట్‌గా చాలా స్టైలిష్‌గా, క్రూరంగా కనిపిస్తారు. అమ్జద్ ఖాన్ రాజుగా మెప్పించారు.
ఒక పక్కా స్పై థ్రిల్లర్‌గా సాగాల్సిన కథలో… నాటి కాలపు ప్రేక్షకుల కోసం కామెడీ ట్రాకులు, ఎక్కువ మంది గ్లామర్ హీరోయిన్లతో సాంగ్స్ పెట్టడం వల్ల సినిమా వేగం కాస్త తగ్గినట్లు అనిపిస్తుంది.కథలో అక్కడక్కడా లాజికల్ లోపాలు ఉన్నాయి.కథా పరంగా కమల్ హాసన్ మిస్సైల్‌ను వెతకడానికి ‘సలామియా’ అనే ఎడారి ప్రాంతానికి వెళ్తాడు.
అక్కడ విలన్ (సత్యరాజ్) అనుచరులతో ఎడారి బ్యాక్‌డ్రాప్‌లో, కోటల మధ్య జరిగే చేజింగ్, యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు పెద్ద అసెట్. ఇక్కడే కమల్ హాసన్ తన నిజమైన స్టంట్ నైపుణ్యాలను ప్రదర్శిస్తారు.
సినిమా అంతా సీరియస్ స్పై డ్రామాగా సాగుతున్నప్పుడు, అనువాదకుడిగా నటుడు జనకరాజ్ చేసే కామెడీ సీన్లు నవ్వులు పూయిస్తాయి. సలామియా రాజు (అమ్జద్ ఖాన్) మాట్లాడే ఊహాజనిత భాషను జనకరాజ్ తనదైన శైలిలో అనువదించే ప్రతి సన్నివేశం హిలేరియస్‌గా ఉంటుంది.
అప్పటివరకు భారతీయ సినిమాలో ఎక్కువగా సెంటిమెంట్, యాక్షన్, లేదా మామూలు రివెంజ్ డ్రామాలు వస్తున్న తరుణంలో… ఈ సినిమాను పూర్తి హాలీవుడ్ జేమ్స్ బాండ్ (007) స్టైల్లో ప్లాన్ చేశారు. స్టైలిష్ సూట్లు, హై-టెక్ అండర్ కవర్ గ్యాడ్జెట్లు (పెన్నుల్లో కెమెరాలు వంటివి), గన్స్, రేసీ యాక్షన్ సీక్వెన్స్‌లతో మేకింగ్ పరంగా సరికొత్త రూపునిచ్చారు.
ఈ చిత్రం అప్పట్లోనే 1 కోటి రూపాయల భారీ బడ్జెట్‌ను దాటిన మొదటి కోలీవుడ్ సినిమాగా రికార్డు సృష్టించింది. భారీ సెట్లు, ఎడారి దేశం బ్యాక్‌డ్రాప్, క్లైమాక్స్‌లో క్షిపణులతో కూడిన సీక్వెన్స్ కోసం ఎక్కడా రాజీ పడకుండా విజువల్స్ రిచ్‌గా ఉండేలా షూట్ చేశారు.
దర్శకుడు రాజశేఖర్, సంగీత దర్శకుడు ఇళయరాజా కలిసి ఈ సినిమాతో ఒక సాంకేతిక విప్లవాన్ని తెచ్చారు. కంప్యూటర్ (రాప్/ఎలక్ట్రానిక్ ప్రోగ్రామింగ్) ద్వారా పాటలను, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను రికార్డ్ చేసిన మొట్టమొదటి భారతీయ సినిమా ఇదే. ఇందులోని ‘విక్రమ్ విక్రమ్’ అనే టైటిల్ ట్రాక్ నేటికీ ఒక ఐకానిక్ మ్యూజిక్ .
1980ల నాటి మేకింగ్ ప్రమాణాల ప్రకారం చూస్తే ‘ఏజెంట్ విక్రమ్ 007’ ఒక కల్ట్ క్లాసిక్ స్పై చిత్రం. లోకేష్ కనగరాజ్ 2022లో కమల్ హాసన్‌తో తీసిన బ్లక్‌బస్టర్ ‘విక్రమ్’ సినిమాకు మూలాలు, ఈ పాత విక్రమ్ సినిమాలోనే ఉన్నాయి. పాత తరం యాక్షన్, స్పై సినిమాలను ఇష్టపడే వారికి ఇది ఇప్పటికీ వినోదాన్ని అందిస్తుంది. సినిమా పూర్తి డబ్బింగ్ వెర్షన్ ETV Cinema YouTube Channel లో ఉచితంగా స్ట్రీమింగ్ అవుతోంది.

