రజనీ అలా ఎందుకన్నారు ?

Sharing is Caring...

Key comments ……

ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ 70వ జన్మదిన వేడుకల్లో సూపర్ స్టార్ రజనీ కాంత్ మాట్లాడుతూ “స్టార్‌డమ్ వస్తుంది పోతుంది.. కానీ గురువుల ఆధ్యాత్మిక స్థానం శాశ్వతం” అనే వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రజనీ కాంత్ భావోద్వేగపూరిత అనుభవాలను పంచుకున్నారు.

రజనీ కాంత్ సూపర్‌స్టార్ కాబట్టి, ఎక్కడికి వెళ్లినా జనం ఆయనను గుర్తుపట్టి, ఫొటోలు, ఆటోగ్రాఫ్‌ల కోసం చుట్టూ గుమిగూడుతారు.కానీ గతంలో రవిశంకర్ ఆశ్రమం లో అందుకు భిన్నంగా జరిగింది.అది రజనీ మనసు పై చెరగని ముద్ర వేసింది.

ఒక రోజు గురుదేవ్ రవిశంకర్ వేలాది మంది భక్తులకు ‘దర్శనం’ ఇవ్వడానికి వెళ్తూ, రజనీకాంత్‌ను కూడా తనతో రమ్మన్నారు. అప్పుడు రజనీకాంత్ “గురుదేవ్, నేను మీతో వస్తే జనాలు నన్ను చూసి ఎగబడతారు, దానివల్ల మీకు అంతరాయం (Disturbance) కలుగుతుంది” అని చెప్పారు. దానికి గురుదేవ్ నవ్వి “పర్లేదు రా” అన్నారు.

రజనీకాంత్ గురువు గారితో కలిసి భక్తుల ముందుకు వెళ్లినప్పుడు, అక్కడ ఉన్న ఒక్కరంటే ఒక్కరు కూడా రజనీకాంత్ వైపు చూడలేదు. రజనీకాంత్ స్వయంగా చేతులు ఊపినా ఎవరూ పట్టించుకోలేదు. అక్కడున్న వేలాది మంది కళ్లు కేవలం గురుదేవ్‌పైనే ఉన్నాయి. ఆ విషయాన్నే రజనీ వివరిస్తూ తన మనసులో మాట పంచుకున్నారు. 

“నేను ఎన్నో మీటింగ్‌లకు వెళ్లాను కానీ, ఆ ఒక్క సంఘటన నా అహంకారాన్నిపూర్తిగా ముక్కలు చేసింది” అని రజనీకాంత్ నవ్వుతూ ఒప్పుకున్నారు. రజనీకాంత్ ఈ మాట ఎందుకు అన్నారంటే? ఈ అనుభవం తర్వాతే రజనీకాంత్‌కు సినిమా స్టార్‌డమ్‌కు, ఆధ్యాత్మిక శక్తికి (Spirituality) మధ్య ఉన్న తేడా అర్థమైంది.

మనం సంపాదించే పేరు, ప్రఖ్యాతులు, సినిమా స్టార్‌డమ్ అనేవి ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. అవి కేవలం ఒక పరిమిత కాలం మాత్రమే ఉంటాయి. గురువులు, మహర్షులు పొందే ఆధ్యాత్మిక స్థానం అత్యున్నతమైనది.

మనిషి మరణించిన తర్వాత కూడా ఆ ఆధ్యాత్మిక స్థానం అలాగే శాశ్వతంగా ఉండిపోతుంది, ఇంకా చెప్పాలంటే కాలంతో పాటు పెరుగుతుంది. సరిగ్గా ఈ ఫీలింగ్స్ నే రజనీ వ్యక్తపరిచారు. అంత పెద్ద  స్టార్ అయి ఉండి కూడా, తనను జనం గుర్తుపట్టలేదనే నిజాన్నిఎంతో నిజాయితీగా, నవ్వుతూ అందరి ముందు అంగీకరించారు.

గురువు స్థానం ముందు తన సినీ సామ్రాజ్యం ఎంత చిన్నదో గ్రహించిన రజనీకాంత్, ఆ మీటింగ్‌లో గురుదేవ్ పట్ల అచంచలమైన భక్తిని, కృతజ్ఞతను కనబరిచారు.
 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!