Great history…..
గుజరాత్‌లోని సౌరాష్ట్ర ప్రాంతంలో ఉన్న సోమనాథ్ ఆలయం అత్యంత ప్రాచీనమైనది. కృతయుగం నాటిదిగా పురాణాలు చెబుతున్నాయి. చారిత్రక ఆధారాల ప్రకారం, 4వ శతాబ్దం లేదా అంతకంటే ముందు నుంచే ఈ క్షేత్రం ఉనికిలో ఉంది. ఎన్నో దండయాత్రల వల్ల ధ్వంసమై, మళ్లీ మళ్లీ నిర్మించబడిన ఈ ఆలయం “నిత్యమైన క్షేత్రం”గా ప్రసిద్ధి చెందింది.
ఈ ఆలయానికి సంబంధించిన పౌరాణిక కథ కూడా ప్రచారంలో ఉంది. బ్రహ్మ మానసపుత్రుడైన దక్షప్రజాపతి తన 27 మంది కుమార్తెలను (అశ్విని నుండి రేవతి వరకు) చంద్రునికి ఇచ్చి వివాహం చేశాడు చంద్రుడు భార్యలందరినీ సమానంగా చూడకుండా, కేవలం ‘రోహిణి’పైనే అమితమైన అనురాగాన్ని చూపిస్తూ మిగిలిన వారిని నిర్లక్ష్యం చేశాడు.
మిగిలిన 26 మంది కుమార్తెలు ఈ విషయమై తమ తండ్రికి మొరపెట్టుకోగా, దక్షుడు చంద్రుడిని మందలించాడు. అయినప్పటికీ చంద్రుని ప్రవర్తన మారకపోవడంతో ఆగ్రహించిన దక్షుడు, చంద్రుడికి “క్షయరోగగ్రస్తుడవు కమ్మని” (కాంతిని కోల్పోవాలని) శపించాడు.
శాపం వల్ల తేజస్సు కోల్పోయిన చంద్రుడు (సోముడు), బ్రహ్మదేవుని సూచన మేరకు గుజరాత్ సముద్ర తీరంలోని ప్రభాస తీర్థానికి వచ్చి శివుని కోసం ఘోర తపస్సు చేశాడు. చంద్రుని తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై, శాపాన్ని పూర్తిగా తొలగించలేకపోయినా, ప్రతినెలా 15 రోజులు కళలు తగ్గుతూ (కృష్ణపక్షం), మరో 15 రోజులు కళలు పెరుగుతూ (శుక్లపక్షం) ఉండేలా అనుగ్రహించాడు.
చంద్రుని (సోముని) అభ్యర్థన మేరకు శివుడు అక్కడ జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడు. అందువల్లనే ఈ క్షేత్రానికి ‘సోమనాథ్’ (చంద్రుని రక్షకుడైన శివుడు) అనే పేరు వచ్చింది.పురాణాల ప్రకారం, ఈ ఆలయాన్ని వివిధ కాలాల్లో విభిన్న పదార్థాలతో నిర్మించారు.
కృతయుగం లో చంద్రుడు (సోమరాజు) ఈ ఆలయాన్ని బంగారంతో నిర్మించాడు.త్రేతాయుగం లో రావణాసురుడు ఈ ఆలయాన్ని వెండితో పునర్మించాడు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు ఈ ఆలయాన్ని చందనపు చెక్కతో (కలపతో) నిర్మించాడు. కలియుగంలో భీమదేవుడు, ఇతర రాజులు దీనిని రాతితో నిర్మించారు.
చారిత్రక దండయాత్రలు – పునర్నిర్మాణాలు…
సోమనాథ్ ఆలయం అపారమైన సంపదకు నిలయంగా ఉండేది. దీనివల్ల విదేశీ ముస్లిం రాజుల కన్నుదీనిపై పడింది.1026 లో అఫ్ఘానిస్తాన్‌కు చెందిన మహ్మద్ గజనీ ఈ ఆలయంపై దాడి చేసి, ఇక్కడి సంపదను దోచుకుని, జ్యోతిర్లింగాన్ని ధ్వంసం చేశాడు. ఆ తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ, ఔరంగజేబు వంటి పాలకులు కూడా ఈ ఆలయాన్ని పలుమార్లు ధ్వంసం చేశారు.
ప్రతి దండయాత్ర తర్వాత హిందూ రాజులు (ప్రతీహారులు, చాళుక్యులు, యాదవులు) ఈ ఆలయాన్ని పునర్నిర్మిస్తూ వచ్చారు. 1783లో హోల్కర్ రాణి అహల్యాబాయి కూడా ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మించారు.
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, నాటి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో సరికొత్తగా, ప్రస్తుత ఆలయ నిర్మాణం ప్రారంభమైంది. 1951 మే 11న అప్పటి రాష్ట్రపతి డా. రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ఈ ఆలయం పునఃప్రారంభమైంది.
ఎన్నిసార్లు నాశనమైనా మళ్లీ భవ్యంగా వెలసిన సోమనాథ్ ఆలయం, హిందూ సమాజం అచంచలమైన విశ్వాసానికి , పట్టుదలకు నిలువెత్తు నిదర్శనం. 1026 లో ఈ ఆలయంపై జరిగిన మొదటి పెద్ద దాడికి (మహ్మద్ గజనీ దాడి) 1000 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ‘సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్’ ఇటీవల నిర్వహించారు. దీని జ్ఞాపకార్థం కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక స్మారక నాణేన్ని కూడా విడుదల చేసింది. 2026 మే 9 నుండి మే 13 వరకు 5 రోజుల పాటు “సోమనాథ్ అమృత్ మహోత్సవ్”అత్యంత వైభవంగా నిర్వహించారు.

