అత్యంత ఎత్తులో ఉన్న గ్రామం అదేనా ?

Sharing is Caring...

A rare village……. 

ఆ గ్రామం ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉండి, రోడ్డు సౌకర్యం ఉన్న గ్రామాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. అద్భుతమైన టిబెటన్ శైలి మట్టి ఇళ్ళు, పురాతన బౌద్ధ ఆరామాలు,అరుదైన మంచు చిరుతలకు ఆ గ్రామం ప్రసిద్ధి.సముద్ర మట్టానికి సుమారు 14,000 అడుగుల ఎత్తులో ఉండే  గ్రామం అది. ఆ గ్రామం పేరే  కిబ్బర్.. హిమాలయాలకు దగ్గర్లో ఉన్న గ్రామం ఇది.

హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్, స్పితి (Lahaul and Spiti) జిల్లాలో ఈ కిబ్బర్ గ్రామం ఉంది. కిబ్బర్ పక్కనే ఉన్న హిక్కిం (Hikkim) గ్రామంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న పోస్ట్ ఆఫీస్ ఉంది. ఇక్కడికి దగ్గరలోనే  కిబ్బర్ వన్యప్రాణి అభయారణ్యం (Kibber Wildlife Sanctuary) ఉంది. అరుదైన మంచు చిరుతలను చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్లు ఇక్కడికి తరలివస్తుంటారు. టిబెటన్ గొర్రెలకు కూడా ఇది ప్రసిద్ధి .

ఇక్కడి ప్రజలు ఎక్కువగా టిబెటన్ బౌద్ధమతాన్ని అనుసరిస్తారు. ప్రసిద్ధమైన ‘కీ మొనాస్టరీ’ (Key Monastery) కిబ్బర్ గ్రామానికి చాలా దగ్గరలో ఉంటుంది. చిచామ్ వంతెన కూడా ఫేమస్.. ఇన్ని ప్రత్యేకతలు ఉండటం తో ఇటీవల కాలంలో పర్యాటకులు ఇక్కడికి ఎక్కువగా వస్తున్నారు. అత్యంత ఎత్తులో ఉండే కిబ్బర్ గ్రామంలో  టూరిస్ట్ గా ఒకటి రెండు రోజులు ఉండటం, అక్కడి ఆహారం రుచి చూడటం ఒక మధురమైన అనుభవం.  

కిబ్బర్ గ్రామంలో హోటళ్ల కంటే హోమ్‌స్టేలు ఎక్కువ… స్థానికుల ఇళ్లలోనే ఒక గదిని పర్యాటకులకు ఇస్తారు.ఇక్కడ ఇళ్ల గోడలు మట్టి, రాళ్లతో మందంగా ఉంటాయి. ఇవి బయట ఉన్న గడ్డకట్టే చలిని లోపలికి రాకుండా ఆపుతాయి. హోమ్‌స్టే లో దిగితే  మీరు ఒక టూరిస్ట్ లా  కాకుండా, ఆ కుటుంబంలో ఒకరిలా కలిసిపోవచ్చు. వారితో కలిసి వంటగదిలో కూర్చుని కబుర్లు చెప్పుకోవచ్చు.

గదిని వెచ్చగా ఉంచడానికి మధ్యలో కట్టెలతో పనిచేసే ఒక పొయ్యి ఉంటుంది, దానిని ‘బుఖారీ’ అంటారు. రాత్రిపూట దాని చుట్టూ కూర్చుని వేడి వేడి టీ తాగడం అద్భుతంగా ఉంటుంది. పర్వత ప్రాంతాల్లో దొరికే వనరులతోనే వారు రుచికరమైన ఆహారాన్ని తయారు చేస్తారు..యాక్ పాలు, వెన్నతో చేసే టీ ఇక్కడి ప్రత్యేకత.

ఇది చలిని తట్టుకోవడానికి, చర్మం పగలకుండా ఉండటానికి సహాయపడుతుంది. వేడి వేడి సూప్‌లో నూడుల్స్, స్థానిక కూరగాయలు వేసి చేస్తారు. ఇది ఒంటికి చాలా శక్తిని ఇస్తుంది. స్థానికంగా పండే కూరగాయలు లేదా మాంసంతో చేసే ఆవిరి కుడుములు బాగుంటాయి. గోధుమ పిండితో చేసే సాంప్రదాయ వంటకాలను సూప్లో వేసి ఉడికిస్తారు.

అతిధులకు లోకల్ బ్రెడ్ ఇస్తారు …ఇది చాలా మెత్తగా ఉండే ఆవిరి బ్రెడ్. దీనిని కూరలతో కలిపి తింటారు.
ఇక్కడి వాతావరణంలో చాలా తక్కువ ఆక్సిజన్ ఉంటుంది. కాబట్టి అక్కడికి వెళ్ళిన మొదటి రోజు ఏమీ చేయకుండా విశ్రాంతి తీసుకోవాలని  స్థానికులు సూచిస్తారు.

హిమాలయాల్లోని ఇటువంటి మారుమూల గ్రామాల్లో ప్రజలు ఇప్పటికీ ఆధునిక ప్రపంచానికి దూరంగా, పాతకాలపు పద్ధతుల్లోనే ప్రకృతికి దగ్గరగా జీవిస్తుంటారు.ఇక్కడి ప్రజల మనుగడకు వ్యవసాయం వెన్నెముక వంటిది. చలిని తట్టుకునే బార్లీ, బఠానీలు,గోధుమలను ప్రధానంగా పండిస్తారు.

గత కొన్నేళ్లుగా పచ్చ బఠానీలు ,బంగాళదుంపలను అమ్మడం ద్వారా మంచి ఆదాయం పొందుతున్నారు. కొండ వాలుల్లో మెట్ల సాగు (Terrace Farming) చేస్తూ, మంచు కరిగిన నీటిని సాగుకు ఉపయోగిస్తారు.యాక్ (Yak), గొర్రెలు, మేకలు, గుర్రాలను పెంచుతారు.

వీటి ద్వారా పాలు, వెన్న, మాంసం, ముఖ్యంగా గొర్రెల బొచ్చు (Wool) లభిస్తుంది. లడఖ్ వంటి ప్రాంతాల వారికి  గుర్రాలు, యాక్లను ఇచ్చిపుచ్చుకునే ‘వస్తు మార్పిడి’ (Barter system) కూడా నేటికీ అక్కడక్కడ కనిపిస్తుంది. 

ఇటీవలి కాలంలో పర్యాటకం అతిపెద్ద ఆదాయ వనరుగా మారింది. పర్యాటకులు స్థానిక ప్రజలతో కలిసి ఉండటానికి వీలుగా గ్రామంలో చాలా మంది తమ ఇళ్లను హోమ్‌స్టేలుగా మార్చారు. పర్వతారోహకులకు మార్గదర్శకులుగా (Guides) సామాగ్రిని మోసే వారుగా కూడా పనిచేస్తుంటారు.

శీతాకాలంలో బయట పనులు ఉండవు కాబట్టి, ఆ సమయంలో మహిళలు,  పురుషులు ఇంట్లోనే ఉండి నేత పనులు చేస్తారు.గొర్రె బొచ్చుతో స్వెటర్లు, టోపీలు, సాక్సులు,తివాచీలు నేసి పర్యాటకులకు అమ్ముతారు.

గ్రామానికి వెళ్లాలంటే హిమాచల్ ప్రదేశ్ లోని మనాలి చేరుకోవాలి.మనాలి → అటల్ టన్నెల్ → లోసార్ → కాజా → కిబ్బర్ (సుమారు 200 కి.మీ).ఈ మార్గం కేవలం మే నుండి అక్టోబర్ వరకు మాత్రమే తెరిచి ఉంటుంది.

 అదే సిమ్లా నుండి అయితే (అన్ని కాలాల్లో అందుబాటులో ఉండే మార్గం) సిమ్లా → రెకాంగ్ పియో → ట్యాబో → కాజా → కిబ్బర్ (సుమారు 420 కి.మీ).ఈ ప్రయాణానికి కనీసం 2 రోజులు పడుతుంది, కానీ ప్రకృతి దృశ్యాలు చాలా బాగుంటాయి.మనాలి,సిమ్లా నుండి బస్సులు టాక్సీలు అందుబాటులో ఉంటాయి.

 

 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!