Jivatma and Paramatma are not different……...
ఎన్నోతరాలుగా ఎంతోమంది జీవితానుభవాలను వింటున్నాం.. చూస్తూ వస్తున్నాం. జీవన్మరణంలో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తికి చిట్టచివరిగా అత్యంత ఇష్టులైన వారి చేత తులసి నీళ్ళు త్రాగించడమో, వారిని ప్రత్యక్షంగా చూపడమో లేదా వారికి సంబంధించిన ఏదేని నమ్మశక్యమైన వార్తను వినిపించడమో చేయడం… మనందరం చాలా సందర్భాలలో, చాలా మంది విషయంలో గమనించే ఉంటాం.
దీన్ని నేను ‘సెమీ’ భీష్మ మరణం అంటాను. తన తండ్రి శాంతనుడి ద్వారా ఇచ్ఛా మరణ ( తాను కోరినప్పుడు మాత్రమే మరణించే) వరం పొందిన భీష్ముడు కురుక్షేత్ర సంగ్రామంలో పదవ రోజున అర్జునుడి బాణాలకు నేలకొరిగినా, ఉత్తరాయణ శుభకాలం కోసం 58 రోజులు అంపశయ్య పై తన మరణం కోసం వేచి చూశాడు.
ఆత్మ పరిశుద్ధమైనదే, అలాగే అద్వితీయమైనది, ఎప్పటికీ నశించనది ( మోక్షప్రాప్తి జరిగినా, భగవంతుని నుండి విడివడినది తిరిగి భగవంతునిలోనే లీనమైనా..) కూడా. కానీ, ఆ ఆత్మ తాను ధరించిన శరీరంతో అమితంగా మమేకమైనప్పుడు, ఇహలోక బాంధవ్యాల నుండి అవిభాజ్యం కావడాన్ని తనకు తానుగా సంక్లిష్టం చేసుకున్నప్పుడు… ఆత్మకు ఈ జన్మ తాలూకు బంధాలు ప్రాణావశిష్టంగా తోచడం సబబేనేమో. అంటే … నిర్వికారంగా మనగలిగిన ఆత్మ కూడా జన్మ వాసనల నుండి విముక్తం కావడం అంత సులువైన విషయమేమీ కాదని నా అభిప్రాయం.
‘రెండు’ కాదు, ‘రెండు’ లేవు అనే అద్వైత (జీవాత్మ, పరమాత్మ రెండూ వేర్వేరు కావు) సిద్ధాంతాన్ని ఆచరణాత్మకంగా, అనుభవ రూపేణా స్పృశించడం తేలికైన విషయమేమీ కాదు. ఆ ఆలోచనను ఏర్పరుచుకోవడం లేదా దాని గురించి హేతుబద్ధంగా చర్చించడం సులభతరంగా తోచవచ్చేమో.
ఆత్మకు జీవాన్ని పరిత్యజించడం అనివార్యంగా సంభవించినప్పుడు, ఆ రకమైన స్పృహ దానికి కలిగినప్పుడు జరిగే ప్రక్రియ ముందుగా నిర్ణయింపబడిన విధివిధానాలను అనుసరించినా, జీవుడిని వదిలే పరంపరలో ఆత్మ యొక్క సంఘర్షణ, దాని అసలు సిసలైన అస్థిత్వాన్ని తెలుసుకొనే ప్రక్రియలో దాని స్వయం పరిత్యాగం వంటివి జీవుడిని భౌతికంగా వదిలివేయడానికి కొంత మేరకు ప్రతిబంధకం కాగలవని నా అభిప్రాయం. ఆ సమయంలో ఆ జీవుని శరీరం స్పందించనూ వచ్చు, లేక పోవచ్చు.
అంతిమంగా నా అంచనా ఏమంటే, జీవుడిని (శరీరాన్ని) ఎప్పుడు వదిలేయాలనేది ఆత్మ నిర్ణయించు కోగలదు. శరీరం సహకరించే స్థితిలో ఉన్నా కొందరు వృద్ధులు ఎలాంటి అనారోగ్య కారణాలు లేకుండానే మరణిస్తున్నారంటే, ఏ కారణం వల్లనైతేనేమి వారి ఆత్మ వారి శరీరాన్ని వదిలివేయడానికి నిర్ణయించు కున్నదన్నసంగతి మనమందరమూ గమనించిన విషయమే.
భీష్ముని స్థాయిలో అనుకున్న సమయాన్ని ఎంచుకొనే సౌలభ్యం మనకు లేకపోవచ్చు గానీ, శరీర బాంధవ్యాల మేరకు కొంత మేర… తాను మోస్తున్న శరీరాన్ని వర్జించే నిర్ణయాన్ని ఆత్మ తీసుకొనే అవకాశం అయితే మిక్కుటంగా ఉందని నా ప్రగాఢ విశ్వాసం.
——– ఓబుల్ రెడ్డి.పులి