ఆ ఇద్దరు అలా …చేశారు !!

Sharing is Caring...

Bharadwaja Rangavajhala…………………………………… 

యద్దనపూడి సులోచనారాణి అను నేను … 1939 ఏప్రిల్ రెండున బందరు దగ్గర కాజ అనే పల్లెటూర్లో ఐదుగురు అక్కలు ముగ్గురు అన్నల మధ్య పుట్టాను. అలా పుట్టి ఊరికే ఉండవచ్చు కదా అలా ఉండకుండా … కథలు రాయడం మొదలెట్టాను. అలా రాయడం మొదలెట్టి ఆంధ్రపత్రికకు పంపడం కూడా మొదలు పెట్టేశాను.

నిండా పద్దెనిమిది సంవత్సరాలు కూడా రాకుండానే 1957లో చిత్రనళీయం అనే టైటిల్ తో నా కథ ఆంధ్రపత్రికలో అచ్చైంది. అంతే …నా పేరు పెద్ద పెద్ద అక్షరాల్లో చూసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉండేది. దీంతొ నేను కథలు రాయడం అంటూ జరిగితే వాటిని ఆంధ్రపత్రికకే పంపాలని మా ఇంట్లో కట్టెలపొయ్యిమీద ఓత్ తీసుకున్నాను. దాన్ని చాలా కాలం పాటించాను కూడా.

అసలు నా కథలు పాపులర్ అవడం ఎందువల్ల అని నేను ఓ సారి చాలా సీరియస్ గా పరిశోధన చేశాను. చాలా తీవ్రమైన పరిశోధనానంతరం నాకు అర్ధమైందేమంటే ..బాపు అనే పేరుతో ఎవరో ఓ ఆర్టిస్టు నా కథలకు బొమ్మలు వేసేవాడు. ఆ బొమ్మలు చూసి కథెలా ఉన్నా చదివేసి వావ్ అని పాఠకులు అభిప్రాయ ప్రకటన చేసేస్తారనేలా ఉండేవా బొమ్మలు. చాటునైనా యధార్ధం చెప్పాలి … నేను చాలా బాగానే రాస్తానుగానీ … ఎందువల్లో అతని బొమ్మల వల్ల నా కథలు జనరంజకం అవుతున్నాయా అని ఓ సందేహానుమానం నన్ను నిలువునా దహించేది.

నా స్నేహితురాళ్లను అడిగాను. వారు అలా కాదు నువ్వు బాగా రాస్తావు కనుకే అతను అంతచక్కటి బొమ్మలు వేయగలుగుతున్నాడు లేకపోతే వేయగలిగేవాడు కానే కాదు అని ఖరాఖండిగా చెప్పారు. నేను కూడా నిజమే అనేసుకుని నా మానాన నేను కథలు రాసుకుంటూ ఉంటూండగా … నాకు పెళ్లైంది. అత్తారింటికి వెళ్లాను. కొత్త వాతావరణం అవడం వల్ల వెంటనే కథలు రాసి ఆంధ్రపత్రికకు పంపే సానుకూలం కలగలేదు.

దీంతో … నేను కథలు రాస్తాననే విషయాన్ని మర్చిపోవడంతో పాటు ఈ బాపూ అనే ఆర్టిస్టును కూడా మర్చిపోయాను. సరిగ్గా ఆ సమయంలో .. నా ఆడపడచు ఉన్నది ఉన్నట్టు ఉండకుండా … వదినా నువ్వు కథలు రాస్తావట కదా … అనేసింది. అబ్బా అనుకున్నా … సర్లే చెప్తే ఏం పోయిందని ఏదో ఊరికే అలా రాస్తాననుకో అనేశా … ఆంధ్రపత్రికలో అచ్చైన నీ కథలు నేనూ చదివా వదినా … మా ఇంటికీ ఆంధ్రపత్రిక వీక్లీ వస్తుంది కదా … అయితే .. నీ కథలకు బొమ్మలేసేవాడు … అదేం పేరబ్బా విచిత్రంగా ఉంటుందీ అని … తల గోక్కోవడం మొదలెట్టింది. 

నాకే చిరాకేసి … బాపూ అన్నా …ఆ అవునొదినా … నిజం అసలు ఆ బొమ్మల్చూసే నీ కథ చదివా … నీ కథకన్నా కూడా వదినా ఆ బొమ్మలు నాకలా గుర్తుండిపోయాయనుకో అనేసింది …అనుకున్నంతా అయ్యింది నా హృదయం బద్దలై పోయింది … దేవుడా అనుకున్నా … నాకు ఒక్కసారిగా ఏడుపొచ్చేసింది. ఇదెక్కడి గొడవరా భగమంతుడా … నా మానాన నేనేదో అలా కాజలో పడుండక నేనేల ఆంధ్రపత్రికకు కథలు రాయవలె? రాసితినిపో … ఆ పత్రిక వారు అతనెవరో బాపూ అనే అతనితో బొమ్మలేల వేయించవలె? వేయించితిరిపో … అవి నా కథను డామినేట్ చేసేవిగా ఏల ఉండవలె?

ఉండెను పో … అంత నిగూఢమైన విషయాన్ని నా ఆడపడచులాంటి పామరులు కూడా ఏల గుర్తించవలె? నన్ను నిలదీయవలె? నీ కథకన్నా ఆ బొమ్మలే బాగున్నవి అని ఏల నన్ను అవమానించవలె? హత విధి హత విధి అని మనసులో బావురుమని … ముఖం కడుక్కుని గంభీరంగా వచ్చేసి కూర్చున్నాను. తన మాటలు మా వారూ విన్నట్టున్నారు అలా నేరుగా అడిగేయొచ్చా అని చెల్లెలుతో అన్నట్టున్నారు.

అదో వెటకారం … నేరుగా అడిగేయొచ్చా అనడం అంటే .. చాటుగా అనేసుకోవచ్చని చెప్పడమే కదా .. ఇన్ని కథలు రాసిన నాకు ఆ పాటి అర్ధం కాదనుకున్నారే అని మళ్లీ ఏడుపొచ్చినా సంభాళించుకున్నాను. మా ఆడపడుచు దగ్గరగా వచ్చి సారీ వదినా అంది గుంభనగా … కానీ ఆ మాటంటూ తను నవ్విందేమో అని ఓ అనుమానం నాకు ఎప్పటికీ పోలేదు సుమీ …అయిపోయిందా అనుకుంటే ….ఆ బాపూ అనే కుర్రాడి పక్కన రమణ అనే మరో పోకిరీ ఉంటాడట.

అతన్నీ నేను నా కథలు అచ్చేసిన గ్రేట్ ఆంధ్రపత్రికలోనే చూశాను. చదివాను. నిజం చెప్పొద్దూ ఫ్యానును అయ్యేదాన్నేగానీ … నేను కాబోయే సూపర్ స్టార్ రైటర్ ని అనే స్వస్వరూప గ్యానం పుష్కలంగా ఉండడం చేత … ఫ్యానును కాదు కదా విసనకర్రను కూడా కాలేదు అని నాకు నేను సమాధాన పరచుకున్నాను. పరమ దుర్మార్గులైన వీళ్లిద్దరూ కల్సి ఈ సారి నా జీవితం మీద దాడి చేశారు. ఎక్కడో దూరంగా రైలెక్కితే రెండు లంకనాల తర్వాత చేరే మద్రాసులో ఉండేవాళ్లు కదా అనుకుంటే … బస్సెక్కితే నాలుగైదు గంటల్లో దింపేసే బెజవాడొచ్చేశారు.

రావడమేమిటి? జ్యోతి అనే ఓ మాసపత్రిక కూడా పెట్టేశారు. ఇదంతా నా మీద కుట్ర అని నాకు అర్ధమైపోయింది. ఎందుకంటే … వాళ్లు ఇద్దరూ కల్సి నాకు ఉత్తరం రాసేశారు. మేమూ ఇక్కడ మన బెజవాడలో … ఓ మాస పత్రిక జ్యోతి వెలిగించామూ … అందులో అచ్చేసుకోడానికి మీరు సీరియల్ రాయాలీ అనేది ఆ ఉత్తర సారాంశం. నాకు చిర్రెత్తుకొచ్చింది .. నేనేదో నా మానాన నేను కథలూ అదీ అప్పుడప్పుడూ … ఆంధ్రపత్రికు రాసుకుంటూంటే .. వచ్చి కావాలని నాకసలు తెలీని … రాయలేను అని నిర్ణయించేసుకున్న నవలను రాయమని సతాయిస్తారేమిటి చెప్మా అనుకున్నాను.

వెంటనే ఓ కార్టు తీసి సీరియళ్లు రాయడం మా ఇంటా వంటా లేదూ … రాయను పోండి అవతలకు అండీ గారూ అని రాసి పోస్టు బాక్సులో పడేశాను. రెండు రోజులు కూడా తిరక్కుండా మళ్లీ ఉత్తరం వచ్చింది . వాళ్లిద్దరి దగ్గర నుంచే … నా ఉత్తరం చదివి కూడా రాశారు. ఎంత గుండెలు తీసిన బంట్లో మీకు ఈ పాటికి అర్ధమైపోయి ఉంటుంది. ఆ ఉత్తరంలో ఏం రాశారో చెప్తే మీకు వాళ్ల దుర్మార్గం పూర్తిగా అర్ధమైపోతుంది. “సులోచనారాణిగారూ … నమస్తే …సీరియళ్లు రాయడం మా ఇంటా వంటా లేదన్నారు సరే … కథలు రాయడం అన్నా ఉందా అని ఎన్నడన్నా వెనక్కి తిరిగి చూసుకున్నారా?

సీరియల్ అనగా ఏమో మీకెవరూ ఇంతవరదాకా చెప్పి ఉండకపోవడం చేత .. మీరు రాయనూ రాయలేనూ అనేసు కుంటున్నారు గానీ … ఒక కథ మొదలు పెట్టి కాస్త మెడ నొప్పట్టో … జబ్బ సహకరించకనో … పెన్నులో ఇంకైపోవడం చేతనో … చటుక్కున ఆపేసి పుల్ స్టాప్ పెట్టేసి … ముగించేసి దాన్ని కథ అనుకుని ఇది రాయడం తేలికలే అనుకుంటున్నట్టున్నారు మీరు … అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు కాగితాలు జాగ్రత్తగా పరుపు కింద పెట్టేసి … ఏ హార్లిక్సో తాగి … కాస్త రిలాక్స్ అయి మళ్లీ కాగితాలు తీసి ఇంకాస్త రాసి మళ్లీ పరుపు కింద పెట్టేసి … అలా ఓ వారమో పదిరోజులో నాల్రోజులో చేసేసి పంపండి … మీరు సీరియల్ ఎందుకు రాయలేరో మీకు అర్ధమైపోతుంది ఆవటా” అని రాశారు.

అసలు కిటుకు చెప్తాముండండి … సీరియల్ అనగా కథే కాకపోతే … రైలు కింద పెట్టిన ఐదు పైసల నాణెం వలె కాస్త సాగ్గొట్టాలంతే … వారి వీళ్ల వెటకారాలో అని మనసులో అనేసుకున్నాగానీ … ఎక్కడో ట్రై చేస్తే పోయేదేముంది నాలుగు కాగితాలు తప్ప అనిపించడం చేత అలా చేయి నొప్పుట్టినప్పుడల్లా కాయితాలు పరుపు కింద పెట్టి హార్లిక్స్ కాకుండా బోర్నవిటా తాగి అలా ఓ పది పదిహేను రోజుల్నించీ నెల దాకా రాసి పోస్టువాడు నా వల్లకాదు అంటాడేమో అనే అనుమానం కలిగినప్పుడు ఆ బాపు రమణలకు పంపేశా.. తాంబూలాలిచ్చేశా తన్నుకు చావండి అన్నట్టు అన్నమాట … వాళ్లు … అనుకున్నట్టుగానే ఆ పెద్ద కథకి సెక్రటరీ అని పేరు పెట్టి సీరియల్ గా అచ్చేశారు.

అప్పుడు నాకు నా మనసు తెలిపింది … ఇంతేనటే సీరియల్ అంటే నేనెంతో అనుకొంటి అని అనుకొనినదాననై … కథలు రాయడాన్ని కాసేపు వాయిదా వేసి .. నవలలు రాయడం మీద ఫోకస్ పెట్టా … ఆ తర్వాత మీనా అనే నవల రెండు భాగాలు రాసవతల పడేశా … జీవన తరంగాలైతే చెప్పనలవికాదు. ఇలా పెద్ద కథలు రాసేస్తే వాటిని వాయిదాల ప్రకారం అచ్చేసుకోవడాన్నే సీరియళ్లు అంటారనే విషయం నాకు అప్పటికి అర్ధమైపోయిందన్నమాట … నిజానికి ఇంతలా పెద్ద పెద్ద కథలు నేను రాయడానికి కారణం దాశరథి అని మరో దుర్మార్గుడు.

చదువుకున్న అమ్మాయిలు అని ఓ నాగేశ్వర్రావు సినిమా … స్క్రిప్టు వర్క్ జరుగుతున్న రోజులవి … నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావుగారు. ఆ కథా రచయిత్రి శ్రీదేవిగారు కన్నుమూయడంతో ఆ నవలను సినిమాలోకి కుదించే పనికి నేనైతే బెటరని దాశరథిగారు చెప్పిన సలహా విని పిలిపించి ఆ పని అప్పగించారు. నేనా పని చేసేశా .. ఆ తర్వాత దుక్కిపాటి ఆయన నన్ను వదల్లేదు … నా నవల మీనా కొనేసి దాన్ని విజయనిర్మలకు అమ్మేసి ఆవిడతో దాన్ని సినిమా తీయించేదాకా నిద్రపోలేదు.

అలా నేను సినిమా స్క్రిప్టుల పనులు కూడా చూడడం వల్ల నవలలు అనే పెద్ద కథలు రాయడం పెద్ద కష్టం అనిపించలేదు. అలా నా చేత ఇన్ని దారుణాలు చేయించిన … నన్ను చిన్నప్పట్నించీ ఎంతో క్షోభ పెట్టిన వారిద్దరూ … నా నవలల్లో ఒక్కదాన్నంటే ఒక్కదాన్నైనా సినిమాగా తీయలేదు … అక్కడుండగా కుదర్లేదుగానీ ఇక్కడకొచ్చాకైనా అడిగేసి కడిగేద్దామంటే .. దొరకరే … అందుకే ఇలా ఫేసుబుక్కు గోడెక్కాల్సి వచ్చింది …

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!