Daughter of Mohanlal …
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కుమార్తె విస్మయ మోహన్ లాల్ (Vismaya Mohanlal) నటిగా వెండి తెరకు పరిచయం అవుతున్నారు.విస్మయ కేవలం ఒక ‘స్టార్ కిడ్’ గానే కాకుండా రచయిత్రిగా, మార్షల్ ఆర్టిస్ట్‌గా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా, తాజాగా ఒక నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు.
విస్మయ హీరోయిన్గా నటించిన మొదటి చిత్రం తుడక్కమ్ (Thudakkam). మలయాళంలో ‘తుడక్కమ్’ అంటే “ప్రారంభం” అని అర్థం. ఈ సినిమా ఆగస్టు 7, 2026 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
స్టార్ కిడ్స్ సాధారణంగా లవ్ స్టోరీలు లేదా గ్లామర్ పాత్రలతో ఎంట్రీ ఇస్తారు, కానీ విస్మయ మాత్రం ఇంటెన్స్ ఎమోషన్స్, మిస్టరీ అంశాలున్న ఫీమేల్ సెంట్రిక్ యాక్షన్/క్రైమ్ థ్రిల్లర్ కథను ఎంచుకున్నారు. ఇందులో ఆమె ‘మీను’ అనే పాత్రలో నటిస్తున్నారు.
‘2018’ వంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాన్ని అందించిన జూడ్ ఆంథోనీ జోసెఫ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోనీ పెరుంబావూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్ కి మంచి ఆదరణ లభిస్తోంది. మోహన్ లాల్ సినిమా చివరిలో కనిపిస్తారు.
ఇక విస్మయకు చిన్నప్పటి నుండి సాహిత్యం, కవిత్వం,పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం. ఆమె రాసిన కవితలు, స్వయంగా గీసిన చిత్రాల (Artworks) సమాహారంతో కూడిన ‘గ్రెయిన్స్ ఆఫ్ స్టార్‌డస్ట్’ (Grains of Stardust) అనే పుస్తకాన్ని 2021లో ప్రచురించారు. ఈ పుస్తకాన్ని బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ సైతం చదివి, విస్మయ ప్రతిభను సోషల్ మీడియా ద్వారా అభినందించారు.
విస్మయ ఒక ప్రొఫెషనల్ మార్షల్ ఆర్టిస్ట్. ఆమె థాయిలాండ్ వెళ్లి అక్కడ ‘ముయే థాయ్’ అనే కఠినమైన యుద్ధ విద్యలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఆమెకు ఫిట్నెస్ పట్ల చాలా శ్రద్ధ ఉంది.
2016లో ‘గ్రహణం’ షార్ట్ ఫిల్మ్ దర్శకురాలిగా మారారు. నటిగా మారడానికి ఆమె తన తండ్రి మోహన్ లాల్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 3D ఫాంటసీ చిత్రం ‘బరోజ్’ (Barroz) కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు.
ఇటీవల విస్మయ దేశంలోని విద్యార్థుల ఆందోళనలకు (NEET పేపర్ లీక్ వివాదంపై) మద్దతుగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టడం వల్ల కొంతవరకు ఆన్లైన్ ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నారు.అయితే దీనిపై ఆమె ధైర్యంగా స్పందిస్తూ.. “ఒక ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నలు అడిగే హక్కు, భావాలను పంచుకునే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉంటుంది. రాజకీయాల కంటే మానవత్వం ముఖ్యం. నేను అన్న మాటలకు కట్టుబడి ఉంటాను” అని తన పరిణతిని చాటుకున్నారు.
విస్మయ తిరువనంతపురంలో పుట్టింది. మణిపాల్ యూనివర్సిటీ నుంచి మాస్ కమ్యూనికేషన్లో డిగ్రీ చేశారు.
ఆమె అన్నయ్య ప్రణవ్ మోహన్ లాల్ కూడా మలయాళంలో ‘హృదయం’, ‘వర్షంగళ్క్కు శేషం’ వంటి చిత్రాలలో నటించి క్రేజీ హీరోగా రాణిస్తున్నారు.

