Subramanyam Dogiparthi ……………………………..
ఓ సూపర్ హిట్ సినిమాకు ఇరవై అయిదేళ్ళ తర్వాత సీక్వెల్ తీయాలనే ఆలోచన రావటమే సంచలనం.హేట్సాఫ్ టు దాసరి.దానికి తగ్గట్టుగా ప్రధాన పాత్రధారులు జీవించి ఉండటం. ఇదీ గొప్ప విషయమే.దేవదాసు సినిమాలో ఎక్కువ మందికి దేవదాసు , పార్వతిల పాత్రలు నచ్చుతాయి.
నాకు ఆ రెండు పాత్రల కన్నా ఎక్కువ నచ్చే పాత్ర,నేను గౌరవించే పాత్ర చంద్రముఖిదే. ఒక వేశ్య ఒక అభాగ్యునికి నిస్వార్థంగా సేవచేయటం, ఆరాధించటం చాలా గొప్ప విషయం.ఈ పాత్రను సృష్టించిన శరత్ కూడా అభినందనీయుడే .
దేవదాసు సినిమాలో దేవదాసు చంద్రముఖితో అనే ఓ డైలాగే ఈ దేవదాసు మళ్ళీ పుట్టాడు సినిమాకు ప్రధాన కారణం. ‘మరో జన్మ అంటూ ఉంటే ఆ జన్మలో నిన్ను విడిచి ఉండను అమ్మీ’ డైలాగే ఈ సినిమాకు మూలం. పూర్వ జన్మ స్మృతులతో సినిమాలు అన్ని భాషల్లో కుప్పలు కుప్పలు గా వచ్చాయి. మన తెలుగుతో సహా. కానీ సీక్వెల్ గా , ఆ పాత్రల్లో నటించిన పాత్ర అదే పాత్రలో జీవించి ఉండటం, ఆ నటి కూడా జీవించి ఉండటం సాధారణంగా సాధ్యం కాదు .
ఈ సినిమాలో నృత్యాలను దృశ్యకావ్యాలుగా తీసారు దాసరి. వాణిశ్రీ దసరాబుల్లోడు , ప్రేమనగర్ వంటి బ్లాక్ బస్టర్లలో డాన్సులు చాలానే చేసింది. చెల్లెలి కాపురం,భక్త కన్నప్ప సినిమాల తర్వాత శాస్త్రీయ నృత్యాలను అద్భుతంగా నర్తించింది. మళ్ళా ఈ సినిమాలోనే. గత జన్మ విషయాలు ఆమెను వెంటాడే సన్నివేశాలలో ఆమె నటన సుపర్బ్ .
మరో నటి జయప్రద.ఆమెకు అందమైన నృత్యాలు రెండు ఉన్నాయి . ఒకటి ఎంకి నాయుడు బావ గెటప్ లో .. మరొకటి అమరప్రేమ అనే టైటిలుతో నడిచే నృత్యనాటకం. ఈ నృత్యనాటకంలో అక్కినేనిని చాలా మెచ్చుకోవాలి. 53 ఏళ్ల వయసులో శాస్త్రీయ పధ్ధతిలో , అందులో జయప్రదతో నర్తించడం సాధారణ విషయం కాదు.
కమల్ హసన్ , చిరంజీవిలు నర్తించినా… వాళ్ళు అలాంటి శాస్త్రీయ నృత్యాలు యువకులుగా ఉన్నప్పుడు చేశారు. ఇలా 1978 లో వచ్చిన ఈ దేవదాసు మళ్ళీ పుట్టాడులో అక్కినేని , వాణిశ్రీ , జయప్రదల పాత్రలు , వారి నటన , నృత్యాలు తప్పక ఆస్వాదించవలసినవే .
ఇక మహానటి సావిత్రి చెప్పేదేముంది !! ఇతర ప్రధాన పాత్రల్లో గుమ్మడి , ప్రభాకరరెడ్డి , కాంతారావు , రాజనాల , షావుకారు జానకి , అల్లు రామలింగయ్యలు నటించారు. మోహన్ బాబు మోహన్ బాబు అనే పేరు ఉన్న పాత్రలోనే నటించారు.
యస్ రాజేశ్వరరావు సంగీత దర్శకత్వంలో పాటలు శ్రావ్యంగా ఉంటాయి. కొన్ని బయట కూడా హిట్టయ్యాయి.నృత్యాలకు దర్శకత్వం వహించిన పసుమర్తి కృష్ణమూర్తి , చిన్ని సంపత్ లను అభినందించాలి.
ఓపలేకున్నాను చందురూడా , నడివీధిలో దీపం ఒకటి సుడిగాలికి ఊగుతున్నది , ఎవరికి ఎవరు చివరికి ఎవరు , ఓ ప్రణయ జీవనీ , దోసిట సిరిసిరి మల్లెలతో, అనురాగమే ఒక ఆలయం ఆ భావనకే మన జీవితం పాటలు అన్నీ బాగుంటాయి .
క్లైమాక్సులో యస్ పి బాలసుబ్రమణ్యం పాడిన వేటూరి వారి పాట దిక్కులు కలిసే సమయం ఇది పాట క్లైమాక్సుని బాగా పండించింది. ఎంతగా అంటే క్లైమాక్సుకు ముందు , పార్వతి పాత్ర ఎంటరయ్యే ముందు స్లో అయిన సినిమాను పరుగెత్తించి , ప్రేక్షకులను తృప్తిగా థియేటర్ నుంచి బయటకు పంపుతుంది .
ఎక్కడ ఏం తక్కువైందో ఏమో కానీ .. ANR , వాణిశ్రీ , జయప్రద , దాసరిల సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదేమో అని అనిపిస్తుంది . Yet , a good movie . Visual feast . సినిమా యూట్యూబులో ఉంది . చూడని రసహృదయులు తప్పక చూడండి . ఇద్దరు హీరోయిన్లు చక్కగా నటించారు.