Forbidden City……………………
పై ఫొటోలో కనిపిస్తున్నది ప్రపంచంలోనే అతిపెద్ద రాజభవన సముదాయం. చైనా రాజధాని బీజింగ్‌లో దాదాపు 178 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఈ సముదాయాన్ని నిర్మించారు. ఈ రాజభవన సముదాయాన్ని ‘ఫర్‌బిడెన్ సిటీ’గా పిలుస్తారు.ఒకప్పుడు ఇది నిషేధిత నగరం .. ఇపుడు అందరూ వెళ్లి చూసి రావచ్చు.
చైనా ను పాలించిన మింగ్ వంశీయులు చేపట్టిన ఈ భవన నిర్మాణం 1406 లో మొదలై 1420లో పూర్తయింది. హోంగ్‌వు చక్రవర్తి కుమారుడు ఝుడి యోంగ్లో చక్రవర్తి అయినపుడు అతను రాజధానిని నాన్జింగ్ నుండి బీజింగ్‌కు మార్చాడు. బీజింగ్‌లో ఈ నిర్మాణం చేపట్టాడు.
కొన్ని వేలమంది కార్మికులు ఈ నిర్మాణంలో పాల్గొన్నారు. సమీప అడవుల్లోని కలపను తీసుకొచ్చి నిర్మాణంలో ఉపయోగించారు. అలాగే గనుల్లో నుంచి పాలరాయి తెప్పించారు. ప్రధాన భవనాలలో బంగారు ఇటుకలు కూడా వాడారట. తర్వాత కాలంలో షున్ రాజవంశీయులు, ఆ తర్వాత క్వింగ్ వంశీయులు ఈ భవనాలను ఆక్రమించుకున్నారు.
1860 లో ఆంగ్లో-ఫ్రెంచ్ దళాలు ఈ ఫర్బిడెన్ సిటీని స్వాధీనం చేసుకున్నాయి. దాదాపు ఐదు శతాబ్దాల పాటు ఈ రాజభవన సముదాయం చైనా చక్రవర్తులకు నివాస ప్రదేశంగా వర్ధిల్లింది. చక్రవర్తుల కుటుంబీకులకు, నపుంసకులకు మినహా మరెవరికి రాజభవనాల్లోకి ప్రవేశం లేదు. ఎవరైనా ప్రవేశిస్తే ఉరి తీసేవారట. అందుకే దీనికి నిషేధిత నగరమని పిలిచేవారు.
కమ్యూనిస్టు పాలన మొదలయ్యాక ఇది మ్యూజియంగా మారింది. కంచుకోటలా కనిపించే ఈ సువిశాల సముదాయంలో 980 భవంతులు, 8,886 గదులు ఉన్నాయి. యునెస్కో ఈ రాజభవనాన్ని 1987లోనే ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. ఈ రాజభవనాలలో ప్రత్యేకమైన కళాఖండాలను అమర్చారు. సంరక్షించబడిన చెక్క నిర్మాణాలు ఫర్బిడెన్ సిటీ అంతటా అందంగా కనిపిస్తాయి.
దాదాపు ప్రతి భవనం లోపల చిత్రించిన పురాతన కుడ్యచిత్రాలు ఉన్నాయి. ఈ సిటీ లో మూడు మంచి ఫోటో టేకింగ్ స్పాట్‌లు ఉన్నాయి.. అక్కడ మాత్రమే ఫోటోలు తీసుకొనిస్తారు. రోజువారీ సందర్శకుల సంఖ్య 40,000కి పరిమితం చేశారు. ఆన్లైన్ లో టిక్కెట్లు లభ్యమవుతాయి. భవనం వద్ద కూడా కూడా అమ్ముతారు..ఈ అద్భుత నిర్మాణాన్ని ఏటా సుమారు 15 లక్షల మంది పర్యాటకులు సందర్శిస్తుంటారు. 2019లో 19 మిలియన్లకు పైగా సందర్శకులను ఈ భవనాన్ని తిలకించారు.