“సోమునైనా కాకపోతిని..బాలయ్య చేతివాటం రుచి చూడగ”

Sharing is Caring...

రమణ కొంటికర్ల ……………………… 

రాయినైనా కాకపోతిని రామపాదం సోకగా అని అహల్య శాప విమోచన ఘట్టాన్ని తల్చుకుని గోరంతదీపంలో వాణిశ్రీ పాడుకునే గీతమందరికీ గుర్తుండే ఉంటుంది కదా..? అగో ఇప్పుడక్కడ ఆయన అభిమానులు కూడా అలాగే ఆయన చేత దెబ్బలు తినకపోయే భాగ్యం మాకు కల్గలేదే అంటే మాకు కల్గలేదే అని పాడుకుంటున్నారట! అదేనండి మన నవరస నటనా సార్వభౌమ నందమూరి బాలయ్య దెబ్బలకంత గిరాకీ మరి!!

తన సొంత నియోజకవర్గమైన హిందూపురంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో అక్కడ బాలయ్య సంచరిస్తున్నాడు. ఆ సంచారంలో భాగంగా ఓ కార్యకర్త ఇంట్లోకి వెళ్లాడు. అక్కడే సోము అనే ఓ కార్యకర్త.. వీడియోలు, ఫోటోలు తీయడం బాలయ్య కంట్లో పడింది. చూడు ఒకవైపే చూడు… రెండోవైపు చూడాలనుకోకు… మాడిపోతావ్ అని సినిమాలోనే డైలాగులతో చించేసే బాలయ్యను తన ఎదుటే నిల్చుని ఫోటోలు, వీడియోలు తీయడమంటే సాహసమేగదా మరి..?!! కానీ, ఫాఫం ఆ కుర్రసోముకు ఆ విషయ పరిజ్ఞానం అంతగా ఉండుండదు. అందుకే అసలు బాలయ్య దొరుకుడే ఎక్కువ అన్నట్టు మొత్తం ఎక్కడికక్కడ ఫోన్ లో బంధించేసే యత్నం చేస్తున్నాడు. కానీ… తానూహించని అనూహ్య సంఘనటనెదురై… సర్ఫ్ ఎక్సెల్ యాడ్ లో మట్టి మరకలతో నిండి పనికిరాదనుకున్న తెల్లంగీ మళ్లా తన పూర్వపు తెలుపుదనాన్ని సంతరించుకుంటే  అవాక్కైనట్టుగా.. ఒక్కసారి నిశ్ఛేష్ఠుడై అవాక్కయ్యాడు. తేరుకునే లోపు చెంప చెళ్లుమంది. కొట్టింది.. తాను అభిమానంతో.. ఎనలేని క్రేజ్ తో వీడియో తీస్తున్న ది గ్రేట్  నందమూరి బాలయ్య. మళ్లీ సార్ కావాలని చేయలేదనట్టుగా ఏదో వివరణ ఇచ్చుకున్నట్టుగా ఆ వీడియోలో సారాంశమైతే కనిపించినా.. ఏమన్నాడో తెలియదుగానీ… మరోసారి దగ్గరికి వెళ్లి మళ్లీ చెళ్లుమనిపించాడు.

అసలెందుకు బాలయ్యకు అంతగా చిర్రెత్తుకొచ్చింది. ఎండ దగడుకా… లేక అంతగా ఆ కుర్రాడింకేమైనా తప్పు చేశాడా..?  వద్దని చెబితే పోయేదానికి బాలయ్య అంత పనెందుకు చేసుడంటారా..?  అలా చేయకపోతే ఆయన బాలయ్యెందుకైతాడు..? గుక్క తిప్పుకోకుండా డైలాగులు చెప్పాలన్న ఆత్రుతతో పాట్లు పడి… వేదికలపైనున్న యాంకర్లనే అదిరపాటున పడేట్టు చేయగల నేర్పరాయన. ఎప్పుడెవరికేసి ఏది విసిరేస్తాడో ఊహలకందకుండా… తన ఫోన్ ను ఓ సినిమా తాలూకు ఫంక్షన్ లో అమాంతం రువ్వేసి తానేంటో చెప్పిన దూకుడాయనది. అంతకుముందు ఇదే హిందూపురంలో  కార్యకర్తలను చేయి చేసుకున్న ఘటనలూ దృగ్విదితమే. మరలాంటి బాలయ్య… ఇప్పుడు సోమును లాగి చెంప చెళ్లుమనిపిస్తే వింతేముంది చెప్పండి..?!! సహజమే కదా..?

అయితే అక్కడితో అది జరిగిందేదో జరిగింది… బాలయ్యంతే అనుకునేవాళ్లనకుంటారు.. ఎంత సినిమా హీరో అయితే మాత్రం, నందమూరి వంశీయుడైతే మాత్రం… ఇలా తననభిమానించినవారిపైనే చేయి చేసుకునే అలవాటేందేనుకునేవాళ్లూ కనిపిస్తారు..అదంతా సరే!  కానీ ఆ చెంపదెబ్బలు తిని… చెంపలమీద బాలయ్య సినిమాటిక్ పంచుల తరహాలో దెబ్బల అచ్చులు కూడా పోకముందే… ఆ సోము అనే క్యారెక్టర్ తో ఓ వీడియోను వైరల్ చేయడమే ఇప్పుడు మరింత సానుభూతితో కూడిన నిశ్ఛేష్ఠపరిచే ఆశ్చర్యార్థకం! ఇంతకీ సోమేమంటాడంటే… బాలయ్య బాబు తనను జస్ట్ టచ్ చేస్తేనే కొట్టినట్టు ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని.. బాలయ్య బాబు తనను కొట్టినా తనకేం బాధ లేదంటూ చెప్పుకొచ్చాడు ఆ వీడియోలో!  బాలయ్య చేయి పడటమే ఎంతో గొప్పట!! అందుకు తను గర్విస్తున్నాడట కూడా!!!

అందుకు చివరలో జై బాలయ్య.. జైజై తెలుగుదేశమంటూ ముగించాడు ఆ సోము. చెళ్లుమని చెంపదెబ్బలు తిన్న ఆ సోము.. ఆ వీడియోలో టీడీపీని.. మరీ ముఖ్యంగా బాలయ్య బాబును.. మా బాబంటూ సమర్థించుకువస్తూ చెప్పే సమయంలో.. వీడియోలో దిక్కులు చూస్తున్న తీరే.. అదో మ్యానిప్యులేటెడ్ అండ్ ఫ్యాబ్రికేటెడ్ వీడియో అని స్పష్టం చేస్తోంది. జరిగిన దాన్ని.. సోషల్ మీడియాలో మరోసారి రచ్చకెక్కిన బాలయ్య చెంపదెబ్బల వ్యవహారాన్ని సమర్థించుకునే క్రమంలో చేసిన ఆ వీడియో.. ప్లస్ కన్నా మరింత అభాసుపాలే చేసింది. ఏదైతేనేం..? చివరాఖరకు ఇప్పుడు సోమూ బాలయ్య చేత చెంపలు ఛళ్లుమనిపించుకున్న అదృష్ట అభిమానైతే.. సోమునైనా కాపోతిని బాలయ్య చేత దెబ్బలు తినగ అంటూ మిగిలిన అభిమానులు పాడుకునే సన్నివేశం తెలుగునాట ఓ హాట్ ఫన్నీ టాపిక్!

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!