Why Babu declared support for BJP………………………………….. కేంద్రం లోని బీజేపీ సర్కార్ కి అంశాల వారీగా మద్దతు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించి, మహానాడులో ఆ మేరకు తీర్మానం చేసింది. చంద్రబాబు అకస్మాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అర్ధంగాక పార్టీ శ్రేణులు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. 2019 ఎన్నికల్లో మోడీ ని బాబు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు.అప్పట్లో బాబు ఎవరి మాటలు నమ్మారో ఏమో మోడీ ఓడిపోవడం ఖాయమనుకున్నారు. మోడీ మీద యుద్ధం ప్రకటించారు. మోడీ గోబ్యాక్ అంటూ అమరావతిలో హోర్డింగ్స్ కూడా పెట్టించారు.ఇక అధినాయకుని బాటలోనే నాయకులు..కార్యకర్తలు నడిచారు.
బాబు తన యుద్ధాన్ని ఏపీ కే పరిమితం చేయకుండా ..యూపీఏ నేతలతో కలిసి అన్ని రాష్ట్రాలు తిరిగి ప్రచారం చేశారు. కాంగ్రెస్ తో చెట్టాపట్టాలేసుకుని ప్రెస్ మీట్లు పెట్టారు.బాబు అంత కష్టపడినా ఫలితాలు మరోలా వచ్చాయి. ఏపీ లో పార్టీ కూడా ఓటమి పాలైంది. దాంతో బాబు సైలెంట్ అయిపోయారు. ఏపీ లో పార్టీ ని నిలబెట్టుకోవడం పై దృష్టి కేంద్రీకరించారు. గత రెండేళ్లుగా బీజేపీ కి దూరంగానే ఉంటున్నారు. మోడీపై విమర్శలకు పూర్తిగా స్వస్తి పలికారు. ఏపీ బీజేపీ నేతలు తనను విమర్శించినా స్పందించకుండా ఉన్నారు. ఒక దశలో బీజేపీ తో తెగిపోయిన బంధాన్ని కలుపుకుందామని ప్రయత్నాలు చేసినప్పటికీ అవి వర్కవుట్ కాలేదు. బీజీపీ నేతలు కూడా అందుకు సుముఖంగా లేరు.
ఇపుడు కరోనా నివారణలో వైఫల్యాల దెబ్బకు మోడీ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మోడీ ఇమేజ్ మసకబారిన తరుణంలో సడన్ గా అంశాల వారీ మద్దతు అనడం లో అసలు మర్మమేమిటనే అంశంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. కాగా సంఘ్ పరివార్ మోడీ పాలనా తీరుపై అసంతృప్తిగా ఉందని … మోడీని దించి కేంద్ర మంత్రి నితిన్ ఘడ్కరీని ఆ స్థానంలో కూర్చోబెట్ట వచ్చనే ఫీలర్లు ప్రచారంలో ఉన్నాయి. ఈ క్రమంలోనే ముందు చూపుతో బాబు బీజేపీ కి మద్దతు ప్రకటించి ఉండోచ్చు అన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. నితిన్ గడ్కరీతో చంద్రబాబు కు మంచి సంబంధాలు ఉన్నాయన్న విషయం అందరికి తెలిసిందే. ఆ ఫీలర్ల విషయం అలా ఉంచితే …రాజకీయాల్లో ఏదైనా సాద్యమే.
అన్ని అనుకూలిస్తే చంద్రబాబు మళ్ళీ ఎన్డీయే లో చేరవచ్చు. అందులో తప్పు కూడా ఏమి లేదు. ఇదేమీ బాబుకి కొత్త కూడా కాదు. ఇదిలా ఉంటే టీడీపీ తీర్మానంపై ఏపీ బీజేపీ ఇంచార్జి సునీల్ దియోధర్ మాట్లాడుతూ చంద్రబాబు గతంలో మామకు వెన్నుపోటు పొడిచారని ,2019 లో మోడీ కి వెన్నుపోటు పొడిచారని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ తో కలవబోమని చెప్పారు. ఏపీ సీపీఐ నేత రామకృష్ణ మాట్లాడుతూ ఏపీ కి అన్యాయం చేసిన బీజీపీకి ఎలా మద్దతు ఇస్తారంటూ బాబును ప్రశ్నించారు. విభజన హామీలు అమలు చేయలేదు.. ప్రత్యేక హోదాపై మాట తప్పారు.. అలాంటి మోడీ సర్కార్ కి ఏ అంశాలపై వారీగా మద్దతు ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ విమర్శలపై బాబు ఎలా స్పందిస్తారో చూడాలి.
——————-KNM