ఒకే పేరుతో ఇద్దరు ప్రముఖులు ..ఆఇద్దరూ పద్మశ్రీలు పొందిన వారే !!

Sharing is Caring...

Both are Padamshri recipients…

ఆ ఇద్దరిది ఒకే పేరు.. ఆ ఇద్దరు వేర్వేరు రంగాల్లో ధ్రువతారలై వెలిగారు.ఒకరు ప్రయోగశాలలో రసాయనాలతో విప్లవం సృష్టించి చర్మ పరిశోధన రంగాన్ని శాసించగా, మరొకరు ఆపరేషన్ థియేటర్‌లో బాలల శస్త్రచికిత్స రంగంలో అద్భుతాలు చేశారు.

ఒకరు పల్లెటూరి తోళ్ల వృత్తికి అంతర్జాతీయ స్థాయి గౌరవాన్ని, ఆధునికతను జోడించి శాస్త్రవేత్తగా ఎదిగితే; మరొకరు మారుమూల గ్రామాల నుండి వచ్చిన అతుక్కున్న కవలలకు పునర్జన్మ ప్రసాదించి వైద్య విజ్ఞానానికి కొత్త నిర్వచనం ఇచ్చారు.

ఆ ఇద్దరు ఎవరో కాదు ఒకరు  యలవర్తి నాయుడమ్మ.. మరొకరు  యార్లగడ్డ నాయుడమ్మ…. వీరిలో  యలవర్తి నాయుడమ్మ పరిశ్రమకు ప్రాణం” పోస్తే, యార్లగడ్డ నాయుడమ్మ  “ప్రాణాలకు ఊపిరి” పోశారు. ఇద్దరూ తమ రంగాల్లో “పద్మ పురస్కారాలు ” సాధించారు. 

యలవర్తి నాయుడమ్మ ఒక సామాన్య రైతు బిడ్డ.. కష్టపడి అసాధారణ మేధావిగా ఎదిగారు. 1922లో గుంటూరు జిల్లాలోని యలవర్రు గ్రామంలో, ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. చిన్నతనంలోనే తండ్రి మరణించారు, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా, తల్లి రమణమ్మ ఆయనను చదువులో వెన్నుతట్టి ప్రోత్సహించారు.

 ప్రాథమిక విద్యను తన సొంత గ్రామంలోనే పూర్తి చేశారు. ఆ తర్వాత గుంటూరులోని హిందూ కాలేజీలో చదువుకున్నారు. అపుడే  ఆయనలో విజ్ఞాన శాస్త్రంపై అమితమైన ఆసక్తి కలిగింది.వారణాసిలోని బనారస్ హిందూ విశ్వవిద్యాలయం  లో ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ అభ్యసించి, అందులో టాపర్‌గా నిలిచారు.

ఆ కాలంలోనే తన ప్రతిభతో మద్రాస్ ప్రభుత్వం నుండి స్కాలర్‌షిప్ పొంది, చర్మ పరిశోధనలో ఉన్నత విద్య కోసం ఇంగ్లాండ్, అమెరికాలోని లీ హై  యూనివర్సిటీకి వెళ్లారు. అక్కడ పీహెచ్‌డీ పూర్తి చేసారు. ఎన్నో విదేశీ అవకాశాలు వచ్చినా …  కాదని స్వదేశానికి తిరిగి వచ్చి సేవ చేయాలని నిర్ణయించుకున్నారు.

చిన్నతనంలో తోళ్ల వృత్తి చేసే వారి పట్ల ఉన్న సామాజిక వివక్షను చూసి చలించిన ఆయన, ఆ వృత్తికి శాస్త్రీయతను, గౌరవాన్ని తీసుకురావాలనే లక్ష్యంతోనే చర్మ పరిశోధన రంగాన్ని ఎంచుకున్నారు.చర్మ పరిశోధన  రంగంలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి విశిష్ట గుర్తింపు తెచ్చారు.

అప్పట్లో కేవలం ముడి తోళ్లను విదేశాలకు ఎగుమతి చేసే దశ నుండి, భారత్‌లోనే అధునాతన పద్ధతులతో నాణ్యమైన చర్మ ఉత్పత్తులను తయారు చేసే స్థాయికి పరిశ్రమను తీసుకెళ్లారు. తోళ్ల శుద్ధి ప్రక్రియలో వచ్చే భరించలేని దుర్వాసనను తొలగించే సాంకేతికతను అభివృద్ధి చేశారు. దీనివల్ల ఈ వృత్తిపై ఉన్న సామాజిక చులకన భావం తగ్గి, అది గౌరవప్రదమైన పరిశ్రమగా మారింది.

ఈ రంగంలో మహిళలు,వెనుకబడిన వర్గాలకు ఉపాధి పెరిగేలా ప్రోత్సహించారు. ఇవాళ  ఈ పరిశ్రమలో 30% పైగా మహిళలు ఉండటానికి ఆయన వేసిన పునాదులే కారణం. ఐక్యరాజ్యసమితి వంటి సంస్థలకు సలహాదారుగా వ్యవహరిస్తూ సూడాన్, నైజీరియా, టర్కీ వంటి పలు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చర్మ పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడ్డారు.

ఆయన సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం 1971లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఆయన గౌరవార్థం ప్రతి ఏటా సైన్స్ అండ్ టెక్నాలజీలో విశేష కృషి చేసిన వారికి డాక్టర్ వై. నాయుడమ్మ మెమోరియల్ అవార్డు ప్రదానం చేస్తారు.

ఇక డాక్టర్ యార్లగడ్డ నాయుడమ్మ 1947, జూన్ 1న ప్రకాశం జిల్లాలోని కారంచేడు గ్రామంలో యార్లగడ్డ సుబ్బారావు, రంగమ్మ దంపతులకు జన్మించారు.. వారిది   వ్యవసాయ కుటుంబం. ఆ రోజుల్లో గ్రామాల్లో అక్షరాస్యత తక్కువ..అప్పటి అత్తెసరు వైద్య సదుపాయాలు,పేదల ఇబ్బందులను కళ్లారా చూసిన ఆయన, ఎలాగైనా వైద్యుడై సేవ చేయాలనే పట్టుదలతో ఉండేవారు.

గుంటూరులోని ఆంధ్ర లయోలా కాలేజీలో ప్రీ-యూనివర్శిటీ కోర్సు పూర్తి చేశారు. ఆ తర్వాత తన కలని నిజం చేసుకుంటూ గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్  సీటు సాధించి 1970లో పట్టా పొందారు. తర్వాత ఎం.ఎస్.  M.Ch – పీడియాట్రిక్ సర్జరీ పట్టాలను పొందారు.ఉన్నత చదువుల తర్వాత విదేశాలకు లేదా కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లే అవకాశం ఉన్నా, తన సొంత ప్రాంతమైన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి లోనే చేరి సామాన్యులకు సేవ చేశారు.

ఈ క్రమంలోనే డాక్టర్ యార్లగడ్డ నాయుడమ్మ బాలల శస్త్రచికిత్స రంగంలో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందారు. పుట్టుకతో అతుక్కుని పుట్టిన  కవలలను వేరు చేసే అత్యంత సంక్లిష్టమైన శస్త్రచికిత్సల్లో ఆయన ప్రపంచ రికార్డు సృష్టించారు.తల, ఛాతి-పొట్ట, పెల్విస్ వంటి మూడు వేర్వేరు శరీర భాగాల్లో అతుక్కున్న మూడు జంటల కవలలను విజయవంతంగా వేరు చేసిన ఏకైక భారతీయ సర్జన్‌గా నిలిచారు.

1995లో ‘డబుల్ మౌత్’ అనే అత్యంత అరుదైన పుట్టుకతో వచ్చే లోపాన్ని సరిదిద్దే శస్త్రచికిత్సను భారతదేశంలోనే మొదటిసారిగా విజయవంతంగా నిర్వహించారు.గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో  పీడియాట్రిక్ సర్జరీ విభాగాధిపతిగా వేలాది మంది పేద చిన్నారులకు అత్యాధునిక వైద్య సేవలు అందించారు.

వైద్య రంగంలో ఆయన చేసిన విశిష్ట కృషికి గాను 2016లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.నాయుడమ్మపేరు భార్య భారతి. ఈమె కూడా భర్తకు అండగా నిలిచారు.వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.ఒకరు డాక్టర్ సుమన్..ఈయన తండ్రి బాటలోనే నడుస్తూ ఆర్థోపెడిక్ సర్జన్‌గా సేవలు అందిస్తున్నారు. మరొకరు సందీప్ …  ఈయన సాఫ్ట్‌వేర్ రంగంలో స్థిరపడ్డారు.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!