Sasikala in the news again……………………………….తమిళనాడు ఎన్నికలకు ముందు రాజకీయ సన్యాసం ప్రకటించిన జయలలిత నెచ్చెలి శశికళ మళ్ళీ పాలిటిక్స్ లోకి వచ్చేయత్నాల్లో ఉన్నారు. తెర వెనుక నుండి వ్యూహరచన చేస్తున్నారు. అన్నాడీఎంకే కార్యకర్తలతో ఫోన్ మాట్లాడుతూ “పార్టీని సరిచేద్దాం .. మళ్ళీ పార్టీలోకి వస్తా”నని చెబుతున్నారట. శశికళ ఒకరితో మాట్లాడినట్టు ఆడియో క్లిప్ కూడా బయటికొచ్చింది. దీంతో పళని స్వామి వర్గం అలెర్ట్ అయింది. శశికళ క్రియాశీలకమైతే పార్టీ ని చీలుస్తుందని భయపడుతున్నారు.
చిన్నమ్మ కావాలనే ఆడియో లీక్ చేయించారని అన్నాడీఎంకే వర్గాలు సందేహ పడుతున్నాయి. పార్టీ లో ఉన్న తన అనుచరులను ఆకర్షించే లక్ష్యంతోనే చిన్నమ్మ పావులు కదుపుతున్నారని అంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో అన్నా డీఎంకే 66 సీట్లలో గెలిచింది. గెలిచిన వారిలో కొందరు గతంలో శశికళకు మద్దతు పలికినవారే.వీరితో కూడా చిన్నమ్మ ఫోన్ ద్వారా మంతనాలు జరుపుతున్నారని పళని వర్గం అనుమానిస్తోంది. కొందరైతే రహస్యంగా శశికళను కలసి ఆశీస్సులు పొందినట్టు సమాచారం. శశికళ తమపార్టీ సభ్యురాలు కాదని .. ఆమెకు అన్నాడీఎంకే కి సంబంధం లేదని పార్టీ నేతలు బయటికి చెబుతున్నప్పటికీ చిన్నమ్మ తన పని తాను చేసుకుపోతోంది. పార్టీ పై ఎలాగైనా పట్టు సాధించాలనేది ఆమె తపన.
జయలలిత మరణించిన సమయంలో సీఎం గా ఉన్న పన్నీర్ సెల్వం ను బలవంతంగా బాధ్యతలనుంచి తప్పించి తాను సీఎం అవుదామని ప్రయత్నించింది.ఈ లోగానే అక్రమాస్తుల కేసులో జైలు కెళ్లారు. ఆ సమయంలో తన అనుచరుడైన పళని స్వామి ని సీఎం చేశారు. మేనల్లుడు దినకరన్ కు పార్టీ పగ్గాలు అప్పగించారు. చిన్నమ్మ జైలుకెళ్ళగానే పన్నీర్ సెల్వం ..పళని స్వామి కలసిపోయారు. దినకరన్ ను శశికళను పార్టీ నుంచే బహిష్కరించారు. ఈ పరిణామంతో చిన్నమ్మ షాక్ తిన్నది. దినకరన్ ను,పళని స్వామిని అడ్డం పెట్టుకుని జైలు నుంచే రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆమె కన్న కలలు కల్లలైనాయి.
అప్పటి నుంచి ఆ ఇద్దరిపై పగ పెంచుకుంది. ఎలాగైనా పార్టీ పై పట్టు సాధించి ఆ ఇద్దరినీ శంకరగిరి మాన్యాలు పట్టించాలని శశికళ వ్యూహం. పార్టీ చేతిలో ఉంటే కేసుల బారి నుంచి తప్పించుకునే అవకాశం లేకపోయినా సీబీఐ,ఇతర సంస్థల నుంచి ఒత్తడి కొంత తగ్గుతుంది.ఆ మధ్య చిన్నమ్మ ఆస్తులను సీజ్ చేశారు. ఆ కేసులు ఇంకా నడుస్తున్నాయి. అదలా ఉంటే ఈమె వైఖరితో విసిగిపోయిన దినకరన్ పెద్దగా చిన్నమ్మ ను పట్టించుకోవడం లేదు. ఇప్పటికిప్పుడు పార్టీ ని చీల్చినా శశికళ కు తక్షణమే ఒనగూరేదేమి లేదు. 67 సంవత్సరాల వయసులో ఉన్న శశికళ ఆరేళ్ళ దాకా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. అప్పటికి పరిస్థితులు ఎలాఉంటాయో ?ఇప్పటికే రాజకీయాల్లో ఢక్కామొక్కీలు తిన్న పన్నీర్ సెల్వం … పళని స్వామి లు చిన్నమ్మను చూసి భయపడి పోయే స్థాయి దాటి పోయారని విశ్లేషకులు అంటున్నారు.