నది చుట్టూ యాత్ర ..అదే నర్మదా పరిక్రమ !!

Sharing is Caring...

A spiritual journey…….

నర్మదా పరిక్రమ …ఇది పర్వతం చుట్టూ చేసే పరిక్రమ కాదు. నర్మదా నది చుట్టూ చేసే పరిక్రమ. నర్మద పుట్టిన అమరకంటక్ నుండి సముద్రం వరకు, మళ్ళీ వెనక్కి నది చుట్టూ చేసే సుదీర్ఘమైన యాత్ర ఇది. దూరం సుమారు 3,000 కి.మీ. పైనే ఉంటుంది. నర్మదా పరిక్రమ అనేది కేవలం ఒక యాత్ర మాత్రమే కాదు, అది ఒక గొప్ప ఆధ్యాత్మిక ప్రయాణం.

నర్మదా నది పుట్టిన అమరకంటక్ (మధ్యప్రదేశ్) నుండి ప్రారంభించి, నది వెంట నడుస్తూ గుజరాత్‌లోని భరూచ్ వద్ద నది సముద్రంలో కలిసే వరకు వెళ్లి, మళ్ళీ నది అవతలి గట్టు నుండి తిరిగి అమరకంటక్ చేరుకోవడాన్ని నర్మదా పరిక్రమ అంటారు.

పరిక్రమ చేసేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ నర్మదా నదిని దాటకూడదు. అంటే నదికి కుడి వైపున వెళ్లేటప్పుడు సముద్రం వరకు వెళ్లి, అక్కడ పడవలో సముద్రం మీదుగా నది అవతలి వైపుకు చేరుకుని మళ్ళీ ఎడమ వైపు నుండి తిరిగి రావాలి.

నిజమైన పరిక్రమను కాలినడకన పూర్తి చేయాలి. దీనికి సుమారు 3 నెలల 13 రోజులు పడుతుందని పెద్దలు చెబుతారు.ప్రస్తుతం వాహనాల ద్వారా 15-20 రోజుల్లో పూర్తి చేస్తున్నారు.యాత్రలో ఉన్నంత కాలం కఠినమైన బ్రహ్మచర్యం పాటించాలి, నేల మీద పడుకోవాలి, మద్యం/మాంసానికి దూరంగా ఉండాలి.

పురాణాల ప్రకారం, నర్మదా నది పరమశివుని చెమట బిందువు నుండి ఉద్భవించింది. అందుకే గంగలో స్నానం చేస్తే పుణ్యం వస్తుందని, కానీ నర్మదను దర్శిస్తేనే పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం.ఈ పరిక్రమ చేసేవారిని ‘పరిక్రమవాసి’ అంటారు.

దారి పొడవునా ఉండే గ్రామస్తులు వీరికి భోజనం, వసతి కల్పించడాన్ని తమ అదృష్టంగా భావిస్తారు. యాత్రికులు తమ వెంట ఏమీ తీసుకెళ్లరు, అంతా ఆ ‘నర్మదా మాత’ చూసుకుంటుందని నమ్ముతారు.

ముఖ్య ఘట్టాలు …..
అమరకంటక్: యాత్ర ఇక్కడే మొదలై … ఇక్కడే ముగుస్తుంది.
ఓంకారేశ్వర్  ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇక్కడ నర్మదానది ‘ఓం’ ఆకారంలో ప్రవహిస్తుంది.
భేడాఘాట్: అందమైన పాలరాతి కొండల మధ్య నది ప్రవహించే దృశ్యం.
మహేశ్వర్: చారిత్రక కట్టడాలు అహల్యాబాయి కోట ఉన్న ప్రదేశం.

ఈ యాత్ర పూర్తయ్యాక, భక్తులు అమరకంటక్‌లో నర్మదా మాతకు మొక్కులు చెల్లించి తమ యాత్రను ముగిస్తారు. నర్మదా పరిక్రమ కోసం ప్రైవేట్ వాహనాలు, ట్రావెల్ ఏజెన్సీల ద్వారా ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. కాలినడకన కాకుండా వాహనాల్లో చేసేవారి కోసం ప్రత్యేకంగా ప్రైవేట్ టూర్ ఆపరేటర్లు యాత్రను నిర్వహిస్తుంటారు.

ప్రైవేట్ టూర్ ప్యాకేజీలు ….చాలా ట్రావెల్ ఏజెన్సీలు ‘ఆల్ ఇన్‌క్లూసివ్’ (భోజనం, వసతి, ప్రయాణం) ప్యాకేజీలను అందిస్తాయి. సాధారణంగా 15 నుండి 18 రోజులపాటు పడుతుంది ..ఒక్కో వ్యక్తికి ₹25,000 నుండి ₹45,000 వరకు ఉంటుంది.  బస చేయడానికి ఆశ్రమాలు లేదా హోటళ్లను ముందే బుక్ చేస్తారు.

బస్సు యాత్రలు ……మధ్యప్రదేశ్ టూరిజం లేదా ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు గ్రూప్ టూర్లను నిర్వహిస్తారు.
ఛార్జీలు ఒక్కో వ్యక్తికి సుమారు ₹15,000 నుండి ₹22,000 వరకు ఉంటుంది. ఇది అత్యంత చౌకైన మార్గం.
అక్టోబర్ నుండి మార్చి వరకు రద్దీ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఛార్జీలు కొంచెం ఎక్కువగా ఉండవచ్చు.

వాహనంలో వెళ్లేటప్పుడు కూడా కొన్ని చోట్ల నదికి దూరంగా నడవాల్సి రావచ్చు లేదా పడవ ప్రయాణం చేయాల్సి ఉంటుంది (సముద్ర సంగమం వద్ద). ఆ పడవ ఛార్జీలు (సుమారు ₹500 – ₹1000) ప్యాకేజీలో ఉన్నాయో లేదో ముందే చూసుకోవాలి. 

గుజరాత్‌లోని భరూచ్ సమీపంలో నర్మదా నది సముద్రంలో కలిసే చోట (విమిలేశ్వర్) ఒడ్డు ముగుస్తుంది. ఇక్కడ నది వెడల్పు చాలా ఎక్కువగా ఉంటుంది. శాస్త్రోక్తమైన పరిక్రమ చేసేవారు ఇక్కడ పడవ ఎక్కి సముద్రం మీదుగా అవతలి ఒడ్డుకు (రత్నపూర్ లేదా మిథి తలై) చేరుకుంటారు. బస్సు ద్వారా వెళ్లే యాత్రికులు తమ బస్సుతో సహా వెళ్లాలంటే, సమీపంలోని గోల్డెన్ బ్రిడ్జ్ లేదా కొత్త నర్మదా బ్రిడ్జ్ మీదుగా అవతలి ఒడ్డుకు చేరుకుంటారు.    

నర్మదా పరిక్రమ చేయడానికి శీతాకాలం (అక్టోబర్ నుండి మార్చి వరకు) అత్యంత అనుకూలమైన సమయం.
వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎండ తీవ్రత తక్కువగా ఉండటం వల్ల ప్రయాణం అలసట లేకుండా సాగుతుంది. ముఖ్యంగా కార్తీక మాసం నుండి మహాశివరాత్రి వరకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.ఓంకారేశ్వర్ చేరుకుంటే అక్కడ నుంచి నర్మదా పరిక్రమ ప్రారంభించవచ్చు .

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!