ఆ ఎనిమిదో ఖండం కథేమిటి ?

Sharing is Caring...

New continent …………………

ఇప్పటి వరకు మనకు ఏడు ఖండాలున్నాయని తెలుసు .. ఆవిధంగానే చదువుకున్నాం. కానీ ఇప్పుడూ ఎనిమిదో ఖండం వెలుగులోకి వచ్చింది. ఇది దాదాపు 365 ఏళ్లుగా కనపడకుండా దాక్కుని ఉందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఈ కొత్త ఖండాన్ని భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు, భూకంప శాస్త్రవేత్తలు ఇటీవలే గుర్తించారు.

ఈ ఖండానికి  సంబంధించిన ఆసక్తికర విషయాలను టెక్టోనిక్స్‌ జర్నల్‌లో వెల్లడించారు. ఈ కొత్త ఖండం  దాదాపు 94 శాతం నీటి అడుగున ఉందట. దీని పేరు ‘జిలాండియా’ లేదా ‘టె రియు-ఎ-మౌయి’. ప్రస్తుతం శాస్తవేత్తలు ఈ కొత్త ఖండంతో కలిపి సరికొత్త మ్యాప్‌ను సిద్ధం చేశారు.

ఈ ‘జిలాండియా’ అనే ఎనిమిదవ ఖండం దాదాపు 1.89 మిలియన్‌ చదరపు మైళ్ల అంటే 4.9 మిలియన్‌ చదరపు కి.మీ విస్తీర్ణం లో విశాలంగా ఉందట. ఇది మడగాస్కర్‌ కంటే ఆరు రెట్లు ఎక్కువ అని శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఈ ఖండాన్ని వెలికితీసేందుకు చాలా సమయం పడుతుందని చెబుతున్నారు. ఈ ఖండాన్ని అధ్యయనం చేయడం చాలా క్లిష్టతరమైన విషయం. ఇది న్యూజిలాండ్‌ పశ్చిమతీరంలో క్యాంప్‌బెల్‌ పీఠభూమి సమీపంలో ఉంది.ఈఖండం 94% భాగం పసిఫిక్ మహాసముద్రం నీటిలోనే మునిగి ఉంది. కేవలం న్యూజిలాండ్, న్యూ కాలెడోనియా దీవులు మాత్రమే దీని పైన కనిపిస్తున్నాయి.

శాస్త్రవేత్తలు సముద్రగర్భ రాతి నమూనాలు, ఉపగ్రహ గురుత్వాకర్షణ డేటా (Satellite Gravity Maps), సీబెడ్ సోనార్ మ్యాపింగ్ సహాయంతో జిలాండియా ఖండం సరిహద్దులను సముద్రం అడుగుభాగం వరకు 100% పూర్తిగా మ్యాప్ చేశారు. సముద్రం కింద దాగున్న ఒక పూర్తి ఖండాన్ని ఇలా అంచుల వరకు మ్యాప్ చేయడం భూగోళశాస్త్ర చరిత్రలో ఇదే మొదటిసారి.

పరిశోధనల్లో భాగంగా జిలాండియా ఉత్తర భాగం (North Zealandia) నుండి సేకరించిన బసాల్ట్ లావా రాళ్లను విశ్లేషించగా ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. సుమారు 100 నుండి 60 మిలియన్ సంవత్సరాల క్రితం, ఈ ఖండం ‘గోండ్వానా’ మహాఖండం నుండి విడిపోతున్న సమయంలో ఇక్కడ భారీ ఎత్తున అగ్నిపర్వతాలు బద్దలయ్యాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

న్యూజిలాండ్ పరిమాణంలో ఉన్న ఒక పెద్ద అగ్నిపర్వత ప్రాంతాన్ని వారు గుర్తించారు…జిలాండియా అంతటా దాదాపు 4,000 కిలోమీటర్ల పొడవైన గ్రానైట్ రాళ్ల వెన్నెముక (Median Batholith) విస్తరించి ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ గ్రానైట్, స్ఫటిక శిలలు సాధారణంగా సముద్ర గర్భంలో ఉండవు, కేవలం ఖండాల పైనే ఉంటాయి..

సముద్రం అడుగున దాదాపు 2,500 మీటర్ల లోతున డ్రిల్లింగ్ చేసి సేకరించిన ఆధారాల ప్రకారం, జిలాండియా ఎప్పుడూ నీటిలోనే లేదు. కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం ఇది భూమిపైనే ఉండేదని, అక్కడ నదులు, దట్టమైన అడవులు,  ప్రాచీన వృక్షజాలం, జీవరాశులు ఉండేవని వాటి తాలూకు శిలాజాలు స్పష్టం చేస్తున్నాయి.

ప్రస్తుతం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌కు చెందిన జీఎన్ఎస్ సైన్స్ (GNS Science) శాస్త్రవేత్తలు ఈ ఖండం అసలు ఎందుకు ? ఎలా సముద్రంలో మునిగిపోయింది? అనే రహస్యాన్ని, అలాగే పసిఫిక్ ‘రింగ్ ఆఫ్ ఫైర్’ (Ring of Fire) భూకంప మండలాల ప్రభావాలను అర్థం చేసుకోవడానికి నిరంతరం పరిశోధనలు జరుపుతున్నారు. 

ఈ ప్రాంతంలో అయస్కాంత క్రమరాహిత్యాలను  కూడా గుర్తించాల్సి ఉంది. ఇది సుమారు 550 మిలియన్‌ సంవత్సరాల క్రితమే ఏర్పడిందని, ముఖ్యంగా దక్షిణ అర్థగోళం లోని మొత్తం భూమిని కలిపిందని అంటున్నారు శాస్త్రవేత్తలు.జిలాండియా ఏర్పడటానికి,గోండ్వానా నుండి విడిపోవడానికి దారితీసిన ప్రక్రియలను వివరించడానికి కొత్త పరిశోధనలు సహాయపడతాయి, ఇది భూమి టెక్టోనిక్ చరిత్రను అర్థం చేసుకోవడానికి దోహదపడుతుంది. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!