పశ్చిమ బెంగాల్ లోని భవానీ పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక సెప్టెంబర్ 30 న జరగనుంది. ఓట్ల లెక్కింపు అక్టోబర్ 3 న జరుగుతుంది.ఈ ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్నారు. మమత ముఖ్యమంత్రిగా కొనసాగడానికి ఇది కీలకమైన ఎన్నిక. ఎమ్మెల్యే శోవందేబ్ ఛటర్జీ ఈ స్థానానికి రాజీనామా చేయడంతో మే 21 నుంచి ఈ సీటు ఖాళీగా ఉంది.
ఇక దీదీ మార్చిలో జరిగిన ఎన్నికల్లో నందిగ్రామ్ స్థానంలో 1,700 ఓట్ల తేడాతో ఓడిపోయారు. సువేందు అధికారి ఆ ఎన్నికల్లో గెలిచారు. పార్టీ గెలవడంతో దీదీ తిరిగి సీఎం అయ్యారు. 2011 లో మమతా బెనర్జీ మొదటిసారి బెంగాల్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆమె పార్లమెంటు సభ్యురాలు.అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కొన్ని నెలల తర్వాత భవానీపూర్ ఉప ఎన్నికలో పోటీ చేసి గెలిచారు. నాటి ఎన్నికలో దీదీ 54,213 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
ఆ తర్వాత 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 25301 ఓట్ల తేడాతో గెలిచారు. రెండో సారి ఎన్నికల్లో మెజారిటీ తగ్గింది. 2021 ఎన్నికల్లో ఇక్కడ బీజీపీ అభ్యర్థిగా పోటీచేసిన రుద్రాణిఘోష్ కి 44786 ఓట్లు వచ్చాయి. అయినా 28719 ఓట్ల ఆధిక్యతతో శోవందేబ్ ఛటర్జీ గెలిచారు. బీజేపీ ఈ సారి కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం ఆరు నెలల్లోపు ఎమ్మెల్యేగా లేని వారు సీఎం లేదా మంత్రి పదవుల్లో కొనసాగడానికి అవకాశం లేదు. దీంతో ఈ ఉప ఎన్నిక కీలకంగా మారింది. తృణమూల్ ఇప్పటికే ప్రచారం కూడా మొదలు పెట్టింది. బీజేపీ గట్టి అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది.
కాగా దీదీ సీఎం కాక ముందు 29 ఏళ్ళ వయసులో 1984లో జాదవపూర్ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి లోక సభ స్పీకర్ సోమనాథ ఛటర్జీని ఓడించారు. అప్పట్లో ఆ ఎన్నిక ఓ సంచలనం. ఆ తర్వాత 1989 లో అదే స్థానం నుంచి పోటీ చేసి మాలిని భట్టాచార్య చేతిలో 30900 ఓట్ల తేడాతో ఓడిపోయారు. బోఫోర్స్ కుంభకోణం, రాజీవ్ గాంధీ పై వచ్చిన వ్యతిరేకత దీదీ ఓటమి కి కారణాలు అయ్యాయి.91 లో కలకత్తా సౌత్ నుంచి మళ్ళీ విజయం సాధించారు.
96 లో కూడా గెలిచారు. 98 లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పెట్టాక మళ్ళీ అదే స్థానం నుంచి 2.24 లక్షల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు.దీదీ రాజకీయ జీవితంలో పార్లమెంట్ కే ఎక్కువ సార్లు పోటీ చేశారు.మమతా ఇప్పటి వరకు రెండుమార్లు ఎన్నికల్లో ఓడిపోయారు.మొదటిసారి గా 1989లో మాలిని భట్టాచార్య చేతిలో… రెండో సారి 2021 లో నందిగ్రామ్ లో.
———-KNM