ఆ రాత్రంతా లాకప్ లోనే ……ఎందుకలా ?

Sharing is Caring...

ప్రముఖ దర్శకుడు రామగోపాలవర్మ సినిమా రంగంలోకి రాకముందు కొన్నాళ్ళు హైదరాబాద్ లో వీడియో షాప్ నడిపారు. అప్పట్లో ప్రముఖ నిర్మాత ఏ. పూర్ణచంద్రరావు తన సినిమా పైరసీ అయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు అన్ని వీడియో షాపులపై రైడ్ చేశారు. రాంగోపాలవర్మ షాప్ పై పోలీసులు రైడ్ చేసి వందల కొద్దీ వీడియో క్యాసెట్లను సీజ్ చేశారు. వర్మ ను తీసుకెళ్లి పంజాగుట్ట స్టేషన్ లాకప్ లో పడేశారు.

ఆరోజుల్లో పైరసీ చేసిన క్యాసెట్లకు వేరే పేరు పెట్టేవారు. అన్ని క్యాసెట్లను వీసీపి లో వేసి చూస్తే కానీ ఏది పైరసీ క్యాసెట్టో తెలీదు. వర్మ షాపులోనే వందల క్యాసెట్లు ఉన్నాయి. అవన్నీ చెక్ చేసే వరకు లాకప్ లోనే ఉంచారు. దీంతో వర్మ ఒక రాత్రి అంతా లాకప్ లోనే ఉండాల్సి వచ్చింది. ఈ విషయం వర్మ కుటుంబ సభ్యులకు తెల్సి వాళ్ళు ఆందోళన పడ్డారు. ఎలాగోలా బయటకు తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే ఇన్ స్పెక్టర్ కి పనుండి ఎటో వెళ్లడంతో అతగాడిని పట్టుకోవడం వర్మ కజిన్స్ కి కుదరలేదు.

ఇక తప్పనిసరిగా వర్మ ఆ రాత్రంతా లాకప్ లోనే ఉన్నాడు. అర్ధరాత్రి వేళ ఒక పిక్ పాకెటర్ ను తీసుకొచ్చి అదే సెల్ లో పడేశారు.  అతగాడు వర్మను ఎగాదిగా చూసి ఓ మూల పడుకున్నాడు. వర్మ మాత్రం గోడకు చేరగిలబడి అలాగే నిద్రపోయాడు. మధ్య మధ్యలో పోలీసులు మాటలు వినిపించాయి. వాళ్ళు ఆ క్యాసెట్లు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారని వర్మకు అర్ధమైంది.

తెల్లవారాక ఇన్ స్పెక్టర్ వర్మను పిలిచి మాట్లాడాడు.“ఈ డబ్బున్నోళ్ళు ముఖ్యంగా ప్రొడ్యూసర్లు ఇన్కమ్ టాక్స్ వాళ్లకు దొంగ లెక్కలు చూపి లక్షలు నొక్కేస్తారు. అదే బతుకు తెరువు కోసం నీలాంటోళ్ళు చిన్న తప్పులు చేస్తే మటుకు తప్పు పడతారు”.. అన్నాడు. అతనికెక్కడో తమ లాంటి వాళ్ళ మీద సానుభూతి ఉన్నట్టు వర్మకు అర్ధమైంది. ఈ ఘటన మూలంగా పోలీసు వ్యవస్థ ఎలా పనిచేస్తున్నదో కొంత మేరకు వర్మకు అవగాహన కలిగింది.

తరవాత రోజుల్లో కూడా వర్మ వెళ్లి ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ ను కలుస్తుండేవాడు. అలా వెళుతూ ఆయనతో మాట్లాడుతూ నేరస్థుల ప్రవర్తనను ఎలాఉంటుందో గమనించేవాడు. ఆ పరిశీలన డైరెక్టర్ అయ్యాక వర్మకు బాగా ఉపయోగపడింది. కొసమెరుపు  ఏమిటంటే ……  పైరసీ పై పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిన నిర్మాత ఏ. పూర్ణచంద్రరావు  తెలుగులో హిట్ అయిన శివను వర్మ డైరెక్షన్ లోనే హిందీలో రీమేక్ చేశారు. ఈ సినిమా 1990 లో విడుదలైంది.

———— KNM 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!