తుర్లపాటి పరేష్ …………………………….
కలర్ ఫోటో … నిజానికి ఈ సినిమా పేరు బ్లాక్ అండ్ వైట్ అని పెడితే సరిపోయేదేమో.. ప్రేమను కధాంశంగా తీసుకుని గతంలో అనేక సిన్మాలు వచ్చాయి .అయితే ఒక్కొక్క సిన్మాలో ఒక్కో సబ్జెక్టు బేస్ గా తీసుకుని కధనాలు నడిపించారు . కొన్ని సిన్మాల్లో కులాన్ని తీసుకుంటే, మరికొన్నిట్లో మతాన్ని తీసుకుని ప్రేమ స్టోరీలు అల్లటం గతంలో మనం చూసినవే..దర్శకులు కొన్ని ప్రేమ కధలను విషాదాంతంతో ముగిస్తే .. మరికొన్నిసుఖాంతాలతో ముగించారు. వాటిల్లో చాలా సిన్మాలు సూపర్ హిట్ కూడా అయినాయి.
అయితే ఈ ‘కలర్ ఫోటో’ కాన్సెప్ట్ కొత్తది. సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ సిన్మా చూస్తే ఏమంటారో తెలీదు కానీ స్థూలంగా కలర్ ఫోటో సిన్మాలో హీరో కలరే సబ్జెక్టు ! ప్రేమ కథా చిత్రాల్లో రొటీన్ గా ఉండే కులాల కుంపట్లు, మతాల మంటలు ఇందులో హీరో హీరోయిన్ ల ప్రేమకు పెద్ద అడ్డంకి కాలేదు. కానీ హీరో కలర్ అడ్డొచ్చింది ! అతని రంగే అతని ప్రేమ పాలిట శాపం అయ్యింది .
ఆఖరికి ఆ రంగు వల్లే అతని కధ విషాదాంతం అయ్యింది !నల్లగా ఉండే హీరో తెల్లగా ఉండే హీరోయిన్ ను ప్రేమిస్తాడు ..వీరి ప్రేమ హీరోయిన్ అన్న ఎస్ ఐ అయిన సునీల్ కు ఇష్టం ఉండదు ..అందుకు కారణం కూడా హీరో కలరే ..దాంతో వీరి ప్రేమను విఫలం చెయ్యటానికి హీరోయిన్ అన్న హీరో కాలు విరగ్గొట్టటంతో అతను అవిటివాడు అవుతాడు !
ప్రేమను సాధించుకోలేక..వృద్ధుడైన తండ్రికి భారం కాలేక సూసైడ్ చేసుకోవాలని అనుకుంటాడు. అందుకు హీరోయిన్ కూడా వంత పాడటంతో బీచ్ ఒడ్డుకు వెళ్లి పాయిజన్ తీసుకుంటాడు. ఫలితంగా హీరో చచ్చిపోతాడు ..హీరోయిన్ ను అతని అన్న కాపాడుకుని బతికిస్తాడు. హీరోయిన్ ఇంకో వ్యక్తిని పెళ్లి చేసుకుని హీరోపై తన ప్రేమను కంటిన్యూ చేస్తుంది. హీరోయిన్ ను పెళ్లి చేసుకున్న వ్యక్తి అతి మంచివాడు కాబట్టి వాళ్ల ప్రేమను అర్ధం చేసుకుని సపోర్ట్ చేస్తాడు ..ఇదీ స్థూలంగా కధ !
దర్శకుడు కొత్తగా కలర్ కాన్సెప్ట్ ను అయితే తీసుకున్నాడు కానీ సిన్మాలో దాన్ని సరిగా ఎలివేట్ చెయ్యలేకపోయాడనిపిస్తుంది ! తెల్లారి కష్టపడి పాలమ్ముకుని పగలు ఇంజనీరింగ్ చదవటం ఒక్కటే హీరో క్వాలిఫికేషన్ ..అంతకు మించి హీరోయిన్ అతన్ని ప్రేమించేందుకు సరైన కారణాలు చూపలేకపోయాడు దర్శకుడు !
ఇక పాత్రల పరంగా చూస్తే హీరో సుహాస్ చక్కటి నటనా ప్రతిభను కనపరిచాడు .తన మైనస్ పాయింట్ నలుపు కధాపరంగా ఉపయోగపడకపోయినా సిన్మాపరంగా అతనికి పెద్ద అస్సెట్ అయ్యింది. హీరో లక్షణాలు లేని సాధారణ ప్రేమికుడిగా చాలా ఈజ్ తో నటించాడు .క్లైమాక్స్ సన్నివేశాల్లో కూడా అతని డైలాగ్ డెలివరీ బాగుంది .
హీరోయిన్ పాత్ర లో నటనకు పెద్ద స్కోప్ ఏమీ కనపడలేదు ..హాస్య నటుడు,హీరో సునీల్ ను విలన్ షేడ్ లో కొత్తగా చూపించటానికి దర్శకుడు చాలా కష్టపడి ఉంటాడు !బ్లాక్ స్కిన్ అనేది మనిషికి మైనస్ పాయింట్ గా డైరెక్టర్ ఎస్టాబ్లిష్ చెయ్యటం చాలామందికి నచ్చకపోవొచ్చు ..ఎందుకంటె నల్ల తోలు ఉన్నవాళ్లలో కూడా గొప్పవాళ్ళు చాలామంది నిజ జీవితంలో మనకు కనపడతారు.
ఇక సిన్మాలో ఫొటోగ్రఫీ ..సంగీతం బాగుంది చివరగా సిన్మాలో కధాంశం పట్ల దర్శకుడు మరింత కసరత్తు చేసుంటే ఇంకాస్త బాగుండేది ! సిన్మా ఆహా ఓ టి టి లో చూడొచ్చు