ఇది 1965 లవ్ స్టోరీ !

Sharing is Caring...

ఆ ఇద్దరివి వేర్వేరు దేశాలు, వేర్వేరు నేపథ్యాలు, వేర్వేరు సంస్కృతులు. ఆ ఇద్దరూ ఎవరో కాదు. ఒకరు రాజీవ్ .. మరొకరు సోనియా. వారిద్దరిది అందరి లాంటి ప్రేమ కథే. కానీ ఎక్కువ మందికి తెలియని ప్రేమకథ. విధి ఆ ఇద్దరిని కలిపింది .. తర్వాత విడదీసింది.

అవి రాజీవ్ చదువుకుంటున్న రోజులు. ఒకరోజు కేంబ్రిడ్జ్‌లోని గ్రీకు రెస్టారెంట్‌లో కూర్చున్న ఎడ్విగ్ అంటొనియా అల్బినా మైనో  అనే అందమైన ఇటాలియన్ అమ్మాయిని చూసి వెంటనే రాజీవ్ ప్రేమలో పడిపోయాడు. ఆమే సోనియా. తర్వాత కాలంలో ఆమె పేరు సోనియాగా మారింది. 

తొలిచూపులోనే ఆమె అతగాడికి బాగా నచ్చింది.సోనియా ఇటలీలోని విసెంజా సమీపంలోని  ఒక చిన్న గ్రామంలో రోమన్ కాథలిక్ కుటుంబంలో పుట్టి పెరిగారు.  స్థానిక పాఠశాలల్లో తన ప్రాధమిక విద్యను పూర్తి చేసిన తరువాత, ఆమె ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జ్‌కు వివిధ భాషలు నేర్చుకునేందుకు వెళ్లారు. రాజీవ్ గాంధీ ఆ రెస్టారెంట్ యజమాని చార్లెస్ ఆంటోని తో మాట్లాడి ఆమె గురించి ఆరా తీసాడు.

రోజూ ఆమె కూర్చునే టేబుల్ లోనే ఒక సీటు రిజర్వ్ చేయమన్నాడు. అందుకు  రెస్టారెంట్ యజమాని చాలా సొమ్ము కోరాడు.అలా తన ఎదురుగా కూర్చొని పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత ఒకరోజు న్యాప్ కిన్ పై ఒక కవిత రాసి దానితో పాటు  ఒక ఫైన్ బ్రాండ్ వైన్ బాటిల్ గిఫ్ట్ గా చార్లెస్ ద్వారా సోనియాకు పంపాడు.ఆమె సంతోషంగా గిఫ్ట్ స్వీకరించింది. అలా ఆ ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది.

ఒకరి గురించి మరొకరు తెలుసుకున్నారు. రాజీవ్ గురించి తెలుసుకుని సోనియా మొదట్లో భయపడింది. ఇండియా ప్రధానిమంత్రి తనయుడితో తన ప్రేమ ఫలిస్తుందా అని కలవర పడింది. అంత భయపడాల్సిన అవసరం లేదని రాజీవ్ నచ్చచెప్పారు. సోనియా తో  చాలా సూటిగా.. ఓపెన్ గా రాజీవ్ మాటాడేవారు. ఎప్పుడూ ఏమీ దాచలేదు.

ఆమె కూడా రాజీవ్ ను  అర్థం చేసుకుంది. అప్పటినుంచి ఇద్దరూ ఎక్కువగా బయటికి వెళ్లడం మొదలు పెట్టారు. సత్యజిత్ రే ” పథేర్ పాంచాలి” వారు కలిసి చూసిన మొదటి చిత్రం. రాజీవ్ కేంబ్రిడ్జ్‌లో సామాన్యుడిలా ఉండేవారు. తానో పెద్ద నాయకురాలైన ఇందిరా గాంధీ కుమారుడని చెప్పుకునేవారు కాదు.1965 లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ట్రినిటీ కాలేజీలో రాజీవ్ గాంధీ ఇంజనీరింగ్  కోర్సు చదివారు. కోర్సు పూర్తి చేయకుండానే వదిలేశారు. పరీక్షలు రాయలేదు,పట్టా తీసుకోలేదు. 

రాజీవ్ తన తల్లికి సోనియాను ప్రేమిస్తున్న విషయం తెలియజేస్తూ ఒక లేఖ రాశారు. ఇందిర ఆ లేఖ చూసి .. తన మేనత్త విజయలక్ష్మి పండిట్ తో రాజీవ్  ప్రేమ గురించి చర్చించారు. ‘వెళ్లి చూసి రా .. కాబోయే కోడల్ని ‘ అనే ఆమె సలహా ఇచ్చారు. ఇందిర ఒక ఎగ్జిబిషన్ చూసేందుకు1965 లో లండన్ వెళ్లారు. అక్కడే రాజీవ్ తన తల్లికి సోనియాను పరిచయం చేశారు. ఇందిర కు కూడా సోనియా నచ్చింది.

ఈడు జోడు బాగుంది అనుకున్నారు. పెళ్ళికి ఇందిర  గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే పెళ్ళికి ముందే సోనియా ఇండియా వచ్చి, అక్కడి ఆచార వ్యవహారాలను తెలుసుకోవాలని చెప్పారు. ఇందిరా గాంధీ ఈ పెళ్ళికి  వెంటనే అంగీకరించినప్పటికీ, సోనియా తండ్రి  స్టెఫానో మైనో తన కుమార్తె నిర్ణయం గురించి కొంచెం ఆందోళన పడ్డారు.

తన కుమార్తెను దూరంగా ఉన్న ఇండియాకు పంపించడానికి భయపడ్డాడు. అతనికి రాజీవ్ అంటే చాలా ఇష్టం, కానీ తన కుమార్తె రాజకీయ కుటుంబంలో వ్యక్తిని వివాహం చేసుకోవడం పట్ల పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ తన తండ్రిని సోనియా ఒప్పించారు. అందుకే దేశం కానీ దేశం..  ప్రేమించినవాడి కోసం అందరిని వదిలి వచ్చారు.

రాజీవ్ తన ఇంజనీరింగ్  డిగ్రీ పూర్తి చేయకుండానే 1967 లో భారతదేశానికి తిరిగి వచ్చాడు.  సోనియా 1968 లో ఇండియా వచ్చారు. ఇక ఇందిర  తేజీ (అమితాబ్ తల్లి) మంచి స్నేహితులు. కష్టసుఖాల్లో ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండేవారు. అలాగే రాజీవ్ గాంధీ, అమితాబ్ లు బాల్యమిత్రులు.  ఒకరంటే మరొకరికి ప్రాణం.

1968, జనవరి 13న ఢిల్లీ పాలమ్ ఎయిర్ పోర్ట్ లో సోనియా విమానం దిగినపుడు .. చలి గజగజ వణికిస్తున్నప్పటికీ ఆమె కోసం వేచి చూసి అమితాబ్ స్వయంగా ఇంటికి తీసుకువెళ్లారు. అప్పటినుంచి ఫిబ్రవరి 25 న పెళ్లి అయ్యేవరకు సోనియా బచ్చన్ల ఇంట్లోనే ఉన్నారు.

భారత్ వచ్చిన సోనియాను హోటల్ లో ఉంచడం ప్రధాని ఇందిరకు సుతరామూ ఇష్టం లేదు. దీంతో సోనియాని బచ్చన్ల ఇంట్లో ఉంచి భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు నేర్పించమని తేజీని కోరారు. తేజీ సోనియాకు భారతీయ సంస్కృతీ .. సాంప్రదాయాల గురించి వివరించి .. కట్టు బొట్టు కూడా నేర్పించారు.

సోనియా కూడా ఓ సందర్భంలో కన్నతల్లి, తల్లిలా చూసుకున్న అత్తగారి తర్వాత మూడో అమ్మ తేజీ బచ్చన్ అని చెప్పారు. అమిత్ (అమితాబ్), బంటీ (అజితాబ్) తన తోబుట్టువుల్లాంటి వారన్నారు.  ఆవిధంగా ఆరోజుల్లో ఆ ప్రేమికులు ఇద్దరు కన్నవారిని ఒప్పించి ఢిల్లీ లో హిందూ సాంప్రదాయప్రకారం పెళ్లి చేసుకున్నారు. ఇక ఆ తర్వాత కథ అందరికి తెల్సిందే. 

—————KNMURTHY

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!