హీరో లను టార్గెట్ చేయడం ఆ పార్టీ కి అలవాటేనట !

Sharing is Caring...

Controversy ………………………………

స్టార్ హీరో సూర్య నటించిన సినిమా జై భీమ్ పై ఒక వైపు  ప్రశంసల వర్షం కురుస్తుంటే మరోవైపు వివాదాలు చుట్టు ముడుతున్నాయి.వన్నియార్ కమ్యూనిటీని హీరో సూర్య కించపరిచాడని పీఎంకే పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆరోపణలతో ఆగకుండా జై భీమ్ చిత్ర దర్శకుడు, నిర్మాత పై చర్యలు తీసుకోవాలని కోరుతూ పీఎంకే మైలాడుతురై జిల్లా కార్యదర్శి పన్నీర్ సెల్వం అక్కడి పోలీస్ సూపరింటెండెంట్‌కు వినతి పత్రం అందజేశారు.

అక్కడితో కూడా ఆగకుండా ఏకంగా సూర్యను కొట్టిన వారికీ  రూ.1 లక్ష బహుమతిగా ఇస్తామని ప్రకటించి సంచలనం సృష్టించారు. లోకల్ థియేటర్ లో సినిమా ఆడకుండా నిరసనకు దిగారు. ఇక వన్నియార్ సంఘం అయితే జై భీమ్ నిర్మాత.. హీరో సూర్య రూ.5 కోట్ల నష్ట పరిహారం చెల్లించాలని లీగల్ నోటీసులు జారీ చేసింది. ఏవ్యక్తి కైనా నోటీసులు ఇవ్వడం మామూలే. నిరసనలో ఒక భాగమే అనుకోవచ్చు. కానీ దాడులు చేయమనడం … అందుకు రివార్డ్ ప్రకటించడం   సబబు కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కేంద్ర మాజీ మంత్రి, పీఎంకే  నేత అన్బుమణి ఈ వివాదంపై సూర్యకు ఓ లేఖ రాశారు. అందుకు సూర్య కూడా స్పందించారు. తనకు  ఈ సినిమా ద్వారా ఏ వర్గాన్ని కించపరిచే ఉద్దేశం లేదు. దళితులపై జరుగుతున్న ఘటనలను మాత్రమే ఖండిస్తున్నామని స్పష్టం చేశారు.

ఇక పీఎంకే పార్టీకి నటులను టార్గెట్ చేయడం కొత్త కాదు అని తమిళ పత్రికలు రాస్తున్నాయి. రజనీకాంత్  “బాబా ” సినిమాలో సిగరెట్ వెరైటీ గా తాగారని .. ధూమపానాన్ని “గ్లామరైజ్” చేశారని అప్పట్లో ఆ పార్టీ విమర్శలు చేసింది. ఆగస్ట్ 2002లో జరిగిన ఒక బహిరంగ సభలో పార్టీ నాయకులు  హీరో రజనీకాంత్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో థియేటర్లపై దాడులు చేస్తారని సినిమా డిస్ట్రిబ్యూటర్లు భయపడ్డారు.

ప్రతీకారంగా రజనీకాంత్ 2004లో పీఎంకే పార్టీ పోటీ చేసిన మొత్తం ఆరు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఓడించాలని అభిమానులకు పిలుపు నిచ్చారని అంటారు.ఫలితంగా నాటి ఎన్నికల్లో పీఎంకే పార్టీ ఓడిపోయింది. 2015లో మారి సినిమాలో రజనీ కాంత్ అల్లుడు హీరో ధనుష్ పొగతాగే సన్నివేశాల్లో నటించాడని పీఎంకే విమర్శించింది. సినిమాలలో పొగతాగే సన్నివేశాలను పెట్టకూడదని కోరింది.  ధూమపానం.. నిషేధం తమ పోరాటంలో భాగమని అప్పట్లో పార్టీ ప్రకటించింది.

ఇక బాబా..మారి సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకోలేదు. జై భీమ్ అందుకు భిన్నంగా ప్రశంసలు పొందుతోంది. జై భీమ్ టీమ్‌కి లీగల్ నోటీసు జారీ  చేసిన వెంటనే, నెటిజన్లు సూర్యకు మద్దతుగా ట్విట్టర్‌లో పోస్టులు పెడుతున్నారు. పెద్ద ఎత్తున సూర్యకు సపోర్ట్ లభిస్తోంది.

ఇదిలాఉంటే రియల్ సినతల్లి అయిన పార్వతమ్మపేరిట సూర్య 10 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్‌ చేశారు. ఈ డిపాజిట్ మీద వడ్డీని ప్రతి నెలా పార్వతి అమ్మాళ్‌కి అందజేస్తారు. ఆమె మరణానంతరం ఆ మొత్తాన్ని ఆమె పిల్లలకు అందేలా ఏర్పాట్లు చేశారు. దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ పార్వతమ్మ కు ఇల్లు కట్టిస్తామని ప్రకటించారు.ఇక వివాదం దానికదే సద్దుమణుగుతుందా ? మరేదైనా మలుపు తిరుగుతోందో కొద్దీ రోజులుపోతే కానీ తేలదు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!