Bharadwaja Rangavajhala………………….
ప్రముఖ దర్శకుడు తాతినేని రామారావు కృష్ణా జిల్లా కపిలేశ్వరపురం నుంచీ ఫిలిం ఇండస్ట్రీకి వెళ్లారు. తాతినేని రామారావుకి ఆశ్రయం కల్పించింది పునాదిపాడుకు చెందిన అనుమోలు వెంకట సుబ్బారావు.ఇల్లరికం సినిమా టైముకి తాతినేని ప్రకాశరావుగారి దగ్గర చేరిన రామారావు గారు .. అటు తర్వాత ప్రత్యగాత్మతో కొనసాగారు.
పిఎపి బ్యానర్ లో ఆ రోజుల్లో డైరెక్టర్లు అయిన వారందరూ దాదాపు కృష్ణాజిల్లా కమ్మయువకులే ..మళ్లీ కులం ప్రస్తావన తెస్తావురా బార్బేరియస్ అని తిడితే తిట్టినప్పటికీ చాటునైనా యదార్ధం చెప్పాలి కదా … పిఎపి సుబ్బారావు గారి మొదటి సినిమా డైరెక్ట్ చేసింది ఎల్వీ ప్రసాద్ మాత్రం ఎగ్జంమ్షను.. ఆయన పగోజిల్లా కమ్మ అన్నమాట . అయితే ఆయనకీ కృష్ణా జిల్లాతో చాలా చుట్టరికం ఉండేదనుకోండి ..
ముఖ్యంగా ఉయ్యూరు ప్రాంతంతో … అది పక్కన పెడితే .. పిఎపి బ్యానర్ లోనే డైరెక్టర్ అయిన తాతినేని రామారావు గారి తొలి సినిమా ‘నవరాత్రి’. అక్కినేని హీరో. ఇది తమిళం నుంచీ రీమేకు. ‘ఆలుమగలు’ ఆ బ్యానర్ లో ఆయనిచ్చిన పెద్ద హిట్టు.చిగురేసే మొగ్గేసే సొగసంతా పూతపూచే లాంటి హిట్ సాంగ్స్ ఉన్నాయా సినిమాలో.. ప్రత్యగాత్మ , తాతినేని రామారావు ఆల్డర్ నేటివ్ గా డైరెక్ట్ చేసేవారు.
తర్వాత బయట బ్యానర్లలో … ‘మంచి మిత్రులు’ అనే కృష్ణ, శోభన్ బాబుల సినిమా తీశారు. రామా నాయుడు బ్యానర్ లో ‘జీవన తరంగాలు’ డైరెక్ట్ చేశారు. ఎన్టీఆర్ తో తాతినేని రామారావు పన్జేసిన తొలి సినిమా ‘యమగోల’. అక్కినేని కాంపౌండ్ డైరెక్టర్ గా పేరుంది అప్పటికి తాతినేని రామారావుకి. భలేరంగడు, బ్రహ్మచారి, దొరబాబు లాంటి అక్కినేని మాస్ సినిమాలు తీశారాయన.
‘యమగోల’ కు తాతినేని రామారావు డైరెక్టర్ అన్నప్పుడు అన్నగారు కొంత సందేహంలో ఉన్నారు. అందుకే … కె.వి రావును అసిస్టెంట్ గా పెట్టమని కండీషన్ పెట్టారు. అలాగే రైటర్ ప్రతిరోజూ సెట్ లో ఉండాలనేది మరో కండీషను.
తాతినేని ‘యమగోల’ సినిమాను రసవత్తరం గానే తెరకెక్కించారు. సినిమా సూపర్ హిట్ అయింది.. నరసరాజు నాటి రాజకీయాల పై విమర్శనాస్త్రాలు, వ్యంగ్యాస్త్రాలు సంధించారు. డైలాగులు బాగా పేలాయి. జనం చప్పట్లు చరిచారు.నరకలోక సన్నివేశాలు అందరిని ఆకట్టుకున్నాయి.
అప్పట్లో ‘యమగోల’ ఈ సినిమా 28 కేంద్రాలలోనూ వందరోజులు ఆడింది. భీమవరంలో జూబ్లీ ఉత్సవాలు జరుపుకుంది. మరో ఐదు కేంద్రాలలోనూ రజతోత్సవం చేసుకుంది. హైదరాబాద్, విజయవాడ కేంద్రాలలో దాదాపు 40 వారాలు ప్రదర్శితమయింది. ఆ సినిమా విజయం సాధించిన తర్వాత ఎన్టీఆర్ ‘ఆటగాడు’ సినిమాకు డైరెక్షన్ చేశారు.
అట్లూరి పూర్ణచంద్రరావు తీసే సినిమాలకు ఎక్కువగా పన్జేసేవారు. అలాగే శోభన్ బాబుతో సినిమాలు తీసిన హరికృష్ణ కూడా టీ కృష్ణతో ట్రావెల్ మొదలెట్టడానికన్నా ముందు తాతినేని రామారావుతోనే ప్రయాణించారు. పూర్ణచంద్రరావు నేతృత్వంలోనే తెలుగు సినిమాలను హిందీలోకి రీమేక్ చేయడం అనే కార్యక్రమం చేపట్టి బొంబాయి డైరెక్టర్ అయ్యారాయన.
తాతినేని రామారావుతో పాటు బాపయ్యగారు కూడా ముంబై వెళ్లారు. తాతినేని ప్రకాశరావు గారు తెలుగుదేశంలో చేరి వెన్నుపోటప్పుడు నాదెండ్ల వైపు టర్న్ అయినప్పుడు ఆయన కొడుకు టిఎల్వీ ప్రసాద్ కు ఇక్కడ సినిమాలు మాయమైపోయాయి.
అప్పుడు అతను కూడా తాతినేని రామారావు గైడెన్స్ లోనే ముంబై షిఫ్ట్ అయ్యాడు.అలా బాలీవుడ్ లో జండా ఎగరేసిన తాతినేని రామారావు ఎనభై నాలుగో ఏట చెన్నైలో కన్నుమూశారు.