Kangana Ranaut Controversy……………………………………………
నటి కంగనా కు ఇచ్చిన పద్మశ్రీ అవార్డును వెనక్కి తీసుకోమనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. కాంగ్రెస్,శివసేన పార్టీలు కంగనా వ్యాఖ్యలపై విరుచుకుపడుతున్నాయి. కంగనా రనౌత్ ఏది పడితే అది మాట్లాడి కోరి వివాదాలు తెచ్చుకుంటున్నారు. చూస్తుంటే వచ్చిన పద్మశ్రీ ని కాలదన్నుకునేలా ఉన్నారు.గతంలో పద్మశ్రీ ని వెనక్కి తీసుకున్న ఉదాహరణలు కూడా ఉన్నాయి. అయితే కంగనా విషయంలో అలా జరగకపోవచ్చు
అసలు కంగనా తెలిసి మాట్లాడాతారో .. తెలీక మాట్లాడతారో కానీ ఎపుడూ వార్తల్లో నిలవాలన్న కోరిక మనసులో బలంగా ఉన్నట్టుంది. ఇండియాకు స్వాతంత్య్రం 2014 లో వచ్చిందని మాట్లాడి కొత్త వివాదానికి తెరలేపారు. కంగనా వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ దుమారం రేపుతున్నాయి.కొందరు బిజేపి నేతలు కూడా ఆమె అవగాహనా రాహిత్యంపై చెణుకులు విసురుతున్నారు.
ఒక ఈవెంట్ లో పాల్గొన్న కంగనా ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ “ఇండియాకు 1947లో వచ్చింది స్వాతంత్ర్యం కాదు. అది కేవలం భిక్ష. మనకు నిజమైన స్వాతంత్ర్యం 2014లో వచ్చింది” అని వ్యాఖ్యానించారు. కంగనా మాట్లాడిన మాటలకు అర్ధం ఏమిటో నిజంగా ఆమెకు తెలుసా లేదా అనే సందేహాలు కూడా వ్యక్తమౌతున్నాయి.
పద్మశ్రీ అవార్డు అందుకున్న మూడు రోజులకే కంగనా వివాదంలో చిక్కుకున్నారు. తనను అవార్డుకు ఎంపిక చేసినందుకు మోడి ప్రభుత్వం పట్ల కృతజ్ఞత చూపాలనుకున్నారో ఏమో కానీ మోడి నేతృత్వంలో బిజేపి అధికారంలోకి వచ్చిన 2014 లో మాత్రమే భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని కంగనా ప్రకటించేశారు. దీంతో బీజేపీ ఎంపీ నుంచి అందరూ నేతలు కంగనానే తప్పు పడుతున్నారు.
స్వాతంత్ర్యం కోసం దాదాపు 200 సంవత్సరాల పాటు పోరాడిన చరిత్ర ఉన్నది. కోట్లాది మంది చేసిన పోరాటాలు ఉన్నాయి. లక్షల మంది వీరులు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన త్యాగం ఉన్నది. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ లాంటి మరెందరో యువకులు వీరోచితంగా తమ ప్రాణాలను ఊరికొయ్యలకు వేలాడదీసిన ఉదాహరణలున్నాయి. ఎందరో రక్త తర్పణం చేసిన కథల వెనుక నాటి వీరుల కసి, పట్టుదల,త్యాగశీలత ఉన్నాయి. జలియన్ వాలాబాగ్ మారణకాండకు ప్రతీకారంగా జనరల్ డయ్యర్ ని కాల్చి చంపిన సర్దార్ ఉద్ధం సింగ్ లాంటి వీరులున్నారు. ఈ చరిత్రను విస్మరిస్తే ఎలా ?
ఇవన్నీమర్చిపోయి 2014 లో స్వాతంత్ర్యం వచ్చింది అన్నట్టు కంగనా మాట్లాడటం సరైనది కాదనే విమర్సలు వినపడుతున్నాయి. విమర్శలు వచ్చాక కూడా కంగనా వెనక్కి తగ్గకుండా ఏవేవో ప్రశ్నలు వేసి వాటికి సమాధానం చెబితే అవార్డు వాపస్ ఇస్తానని వాదిస్తోంది. ఇంతకంటే అడ్డగోలు వాదన మరొకటి ఉంటుందా ?
దేశంలోని పౌరులందరికీ వారివారి వ్యక్తిగత అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వ్యక్తం చేసే హక్కు రాజ్యాంగమే ఇచ్చింది. దాన్ని కాదనే హక్కు ఎవరికీ లేదు.కంగనా అభిప్రాయం వ్యక్తిగతం కావచ్చు.కానీ అడ్డగోలు వాదనలను తెరపైకి తెచ్చి అభాసుపాలు కావడం ఎందుకు ? బ్రిటీష్ వారి నుంచి దేశానికి విముక్తి కల్పించడంలో కేవలం కాంగ్రెస్ పాత్ర మాత్రమే లేదు. అనేక సంస్థలు,వ్యక్తులు వారి వారి సొంత విధానాల్లో పోరాడారు.
కానీ వారి త్యాగాలు,బలిదానాలకు చరిత్రలో సముచిత స్థానం,గౌరవం దక్కలేదు. వక్రీకరణ జరిగింది. అది అన్యాయమే.వారి ఉద్యమం త్యాగాలకు సముచిత గౌరవం ఇవ్వవలసిందే. అలాగని చెప్పి కాంగ్రెస్ నాయకుల త్యాగాలను చిన్న బుచ్చడం,కించపరచడం,హేళన చేయడం ఎలా సమర్థనీయం.ఒకరి గౌరవాన్ని గుర్తు చేయడానికి మరొకరిని అవమానించాలా? ఎవరు నమ్మిన పద్ధతిలో వారు పోరాటం చేశారు. అందరి పోరాట ఫలితంగా 1947 లో బ్రిటిష్ వారు దేశం విడిచి వెళ్లిపోయారు.దానినే మనం స్వాతంత్ర్యం అంటున్నాం. బీజేపీ మీద ప్రేమతో నాటి పోరాటాలను కించపరచడం మంచిది కాదు.
——–KNMURTHY with Govardhan Gande