ప్రజల సొమ్మును వృధా చేయడంలో మననేతలు ముందుటారు . కర్ణాటక ముఖ్యమంత్రి గా కుమారస్వామి ప్రమాణస్వీకార మహోత్సవం 2018 మే 23న జరిగింది . ఈ కార్యక్రమానికి జాతీయ పార్టీల నేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఆయన ప్రమాణస్వీకార ఖర్చులకు సంబంధించి ఓపత్రిక ఆసక్తికర కథనాన్ని తెరపైకి తెచ్చింది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయిన అతిథులకు కుమారస్వామి ఘనంగా మర్యాదలు చేశారని, బెంగళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్‌లో అతిథులకు కుమారస్వామి ప్రభుత్వం ఖర్చు చేసిన బిల్లులు ఇవేనంటూ సంచలన అంశాలను ఆ పత్రిక వివరించింది. ఓ ఆర్టీఐ కార్యకర్త అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు వెల్లడించారని పత్రిక తెలిపింది.
ఏడు నిమిషాల ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం కుమారస్వామి ప్రభుత్వం ఏకంగా 42లక్షలు ఖర్చు చేసినట్లు పత్రిక ప్రస్తావించింది. పత్రిక వివరించిన అంశాల ప్రకారం.. ఏపీ సీఎం చంద్రబాబు మే 23న హోటల్‌లో దిగారు. మే 24న హోటల్ ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఆయన పేరుపై హోటల్ వేసిన బిల్లు 8,72,485 లక్షల రూపాయలు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లక్షా 85వేల ఖర్చు చేసినట్లు బిల్లు వేశారు. ఈ జాబితాలో ఉన్న అతిథులు.. వారి పేరుతో ఉన్న మరికొన్ని బిల్లుల వివరాలివి.
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్: రూ. 1,02,400
బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ అధినేత్రి మాయావతి: రూ. 1,41,443
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్: రూ. 1,02,400
కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లట్: రూ. 1,02,400
సీపీఎం నేత సీతారం ఏచూరి: రూ. 64,000
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్: రూ. 38,400
ఎన్సీపీ నేత శరద్ పవార్: రూ. 64,000
ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ: రూ. 38,400
జార్ఖండ్ మాజీ సీఎం బాబూలాల్: రూ. 45,952
సినీ నటుడు కమల్ హాసన్: రూ.1,02,040
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆతిథ్యానికి సంబంధించిన వివరాలను వెల్లడించకపోవడం గమనార్హం.
ఇదిలా ఉంటే, 2013లో సిద్ధరామయ్య ప్రమాణస్వీకార కార్యక్రమానికి గానీ, 2019 మే 17న సీఎంగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో గానీ కర్ణాటక ప్రభుత్వం అతిథులకు ఖర్చు పెట్టలేదని తెలిసింది. కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమ సమయంలో విచ్చేసిన అతిథుల కోసం రెండు ఫైవ్ స్టార్ హోటల్స్‌ను(తాజ్ వెస్ట్ ఎండ్, షాంగ్రీ లాన్) బుక్ చేశారని.. వాటికి ప్రభుత్వం 37,53,536రూపాయలను చెల్లించిందని సదరు పత్రిక పేర్కొంది. అంతేకాదు, విధాన సభ హాల్‌లో మే 23న ఇచ్చిన తేనీటి విందుకు కర్ణాటక ప్రభుత్వం 4,35,001 ఖర్చు చేసినట్లు తెలిపింది. టీ, స్నాక్స్ కూడా తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్ నుంచి తెప్పించినట్లు సమాచారం.
కర్ణాటక ప్రభుత్వం చేసిన ఖర్చుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. కర్ణాటక మాజీ లోకాయుక్త జస్టిస్ సంతోష్ హెగ్దే ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. అభివృద్ధి కార్యక్రమాలకు చేపట్టేందుకు నిధులు లేవని చెబుతున్న ప్రభుత్వం.. ఇలాంటి వృథా ఖర్చును ఎలా భరించిందని ప్రశ్నించారు. అయినా ప్రమాణ స్వీకార కార్యక్రమం ఒక రాజకీయ పార్టీకి చెందిన అంశమని.. ఇతర పార్టీల నేతలను ఆహ్వానించడం, వారి ఖర్చులను భరించడం.. ఇవన్నీ ఆ పార్టీనే చూసుకోవాలని.. ప్రభుత్వ సొమ్మును ఎలా ఖర్చు చేస్తారని సంతోష్ హెగ్దే నిలదీశారు.
2019 లో ఈ సమాచారం బయటకొచ్చింది. ఆయన పదవి మధ్యలోనే ఊడింది. విమర్శలు వచ్చినా స్వామి నుంచి స్పందనలేదు.
———–KNM
మన చంద్రబాబు గారు దీనిలో కూడా ఫస్ట్ వచ్చారు, చూశారా ? ఏదయినా మెరిట్, విజన్ ఎక్కడికీ పోవు !😃😀😅
మన తెలుగు వారు ఏమీ తక్కువతినలేదు గా…
తనది కాకుంటే తిరుపతి దాకా డెక మనే సామెత
ఉండనేఉంది గా