Great Song ……………………………..
శృతి లయలు సినిమాలో “తెలవారదేమో స్వామీ” అనే సూపర్ హిట్ పాట ఉంది. చాలామంది ఈ పాట వినే ఉంటారు. ఈ పాట అన్నమాచార్య విరచితమని అందరూ భావిస్తారు. ఎందుకంటే పాటలో పదాల కూర్పు అలా ఉంటుంది. సిరివెన్నెల ఈ పాట రాసినప్పటికీ అన్నమాచార్యే రాసారని నమ్మే వాళ్ళు ఇప్పటికి ఉన్నారు.
ఆస్థాయిలో సిరివెన్నెల పద విన్యాసం చేశారు. సామాన్యులకు కాదు పండితులకు .. సాహితీ ప్రియులకు కూడా సందేహం వచ్చింది. నంది అవార్డుల కమిటీ న్యాయ నిర్ణేతలు కూడా సందేహపడ్డారట. వాకబు చేసి అది సీతారామ శాస్త్రి రాసారని తెలుసుకుని ఆ సాహిత్య విన్యాసానికి అబ్బురపోయారట. ఈ పాట కు గాను 1987లో సీతారామ శాస్త్రి కి నంది అవార్డు లభించింది.కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన శృతిలయలు చిత్రానికి కూడా ఆ ఏడాది నంది అవార్డు ప్రకటించారు.
కాగా ఒకసారి చెన్నైలో తెలుగు సాహిత్యం మీద ఒక సదస్సు జరిగింది. అందులో పాత సినిమా సంగీత చరిత్రకారులుగా పేరున్న ఓ ప్రముఖ వ్యక్తి పాల్గొన్నారు. ఆ సదస్సు ముగిసిన తర్వాత ఆ ప్రముఖ వ్యక్తి రచయిత వనమాలీ వద్దకొచ్చి ఈ పాట గురించి అడిగారట.”ఇది అన్నమయ్య రాసిన సంకీర్తనలా ఉంది కొన్ని వేల సంకీర్తనలు నేను పరిశీలించాను.ఇది నాకెక్కడా కనిపించలేదే?” అన్నారట.
దానికి ఆ రచయిత అది సిరివెన్నెల రాసిన పాట అని వివరించారట. ‘తెలవారదేమో స్వామీ..’ అనే పల్లవితో ఆ పాట మొదలవుతుంది.పాటలోని చరణాలు గమనిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు.
తెలవారదేమో స్వామీ .. నీ తలపుల మునకలో అలసిన దేవేరి అలమేలూ మంగకూ.. అంటూ సాగే ఆ పాట అచ్చం అన్నమాచార్య పద కూర్పు లాగే అనిపిస్తుంది.
చెలువమునేలగా చెంగట లేవని కలతకు నెలవై నిలచిన నెలతకు…….
కలల అలజడికి నిద్దుర కరవై
అలసిన దేవేరి.. అలసిన దేవేరి.. అలమేలు మంగకూ
తెలవారదేమో స్వామీ..
మక్కువ మీరగ అక్కున జేరిచి
అంగజుకేళిని పొంగుచు తేల్చగ
మక్కువ మీరగ అక్కున జేరిచి
అంగజుకేళిని పొంగుచు తేల్చగ
ఆ మత్తునే మది మరి మరి తలచగా
మరి మరి తలచగా..
ఇక ఈ పాట పల్లవిని సూచిస్తూ కే. విశ్వనాధ్ ‘అలవేలు మంగకూ’అనే మాట కూడా రావాలి అని సిరివెన్నెలకు చెప్పారట. తొలుత ఈ పాట ను మంగళం పల్లి బాలమురళి కృష్ణ చేత పాడించాలని అనుకున్నారు. దీంతో సిరివెన్నెల కూడా అంత గొప్ప గాయకుడు స్వరం అందిస్తుంటే .. సాహిత్యం కూడా అదే స్థాయిలో ఉండాలని అన్నమయ్య శైలిలో ఆ పాట రాశారు.
మంచి పదాలు పడేలా చూసుకున్నారు. పాట అద్భుతంగా వచ్చింది. రికార్డింగ్ సమయానికి బాలమురళి ఏదో కారణంగా రాలేదు. దాంతో సంగీత దర్శకుడు మహదేవన్ అప్పటికప్పుడు జేసుదాస్ ని పిలిచింది ఒక రిహార్సల్ వేయించి వెంటనే పాట పాడించారు. పాట కు బ్రహ్మాండమైన ఆదరణ లభించింది. పాటను విశ్వనాధ్ అద్భుతం గా తెరపైకెక్కించారు. మొదట్లో జేసుదాసు కూడా ఈ పాట అన్నమయ్యదే అనుకున్నారట. తర్వాత ఎపుడో ఆయనకు అసలు సంగతి తెలిసింది. ఆ పాట వెనుక అంత కథ ఉంది మరి.
మీరు కూడా ఆ పాట వినండి ..చూడండి……. “తెలవారదేమో స్వామీ”