నాదెండ్ల తో నాలుగు మాటలు !!

Sharing is Caring...

నాదెండ్ల భాస్కరరావు.
1984 లో ఆయనకొక సంచలనం.  అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ను పదవి నుంచి దించేసి తాను సీఎం అయ్యారు. 1983లో ఎన్టీఆర్‌ తెలుగు దేశం పార్టీ ని స్థాపించినప్పుడు నాదెండ్ల ఆయనతో కలిసి నడిచారు. నాడు  ఎన్టీ రామారావు సీఎం గా నాదెండ్ల భాస్కరరావు  ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఏడాదన్నర  కాలంలోనే ఇద్దరి మధ్య విభేదాలొచ్చి ఎన్టీఆర్ ను పీఠం నుంచి దింపేసి, ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. 1984 ఆగస్టు 16 నుంచి సెప్టెంబరు 16 వరకు, ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. “నెలరోజుల సీఎం ” అంటూ అప్పట్లో ఆయనపై చలోక్తులు కూడా వెల్లువెత్తాయి. అప్పటి ప్రతిపక్షాల సహాయంతో నాదెండ్లను పదవి నుంచి తప్పించి ఎన్టీఆర్  మళ్ళీ తన పదవిని దక్కించుకున్నారు.  చరిత్రలో అదొక రికార్డు.

ఇక నాదెండ్ల గారితో నాకు పెద్ద పరిచయం లేదు. ఎంపీ గా ఉన్నపుడు ఒకటి రెండు సార్లు కలిసాను. తర్వాత ఒక ఛానల్ కోసం ఆయనతో సుదీర్ఘంగా మాట్లాడాను.  అప్పటికి ఆయన వయసు 83 ఏళ్ళు. అయినా ఓపికగా నాలుగు గంటలు కూర్చున్నారు.. మధ్య మధ్యలో మాకు టీ తెప్పించారు కానీ ఆయన చుక్క నీరు తాగలేదు. ఆయన జ్ఞాపకశక్తి కూడా అపూర్వం. ఆయన మంచి మాటకారి. లా కూడా చదివేరు కాబట్టి లాజికల్ గా మాట్లాడతారు.

ఆ రోజు ఆయన చాలా విషయాలు ప్రస్తావించారు. అప్పట్లో “నేను ఎన్టీఆర్ ను దించితే వెన్నుపోటు” అన్నారు .  అదే “చంద్రబాబు దించితే చారిత్రిక అవసరం ” అన్నారు.”అప్పట్లో నాకు మీడియా మద్దతు లేదు. మా వాయిస్ సరిగ్గా ప్రజల్లోకి వెళ్ళలేదు. రామోజీ నాకు వ్యతిరేకంగా పని చేశారు. అదే పెద్ద మనిషి బాబుకి అండగా నిలిచారు. తిమ్మిని బొమ్మి చేసారు” అంటూ చెప్పుకొచ్చారు. ఎన్టీ రామారావు దుందుడుకు నిర్ణయాలే ఆయన పట్ల ప్రజల్లో వ్యతిరేకతను పెంచాయి. ఎన్టీఆర్‌లో పాజిటివ్ విషయాలు ఏమీలేవు. అతని గురించి చెప్పేందుకు మంచి ఏమిలేదు “అని  నాదెండ్ల వ్యాఖ్యానించారు.

ఎన్టీఆర్ చరిష్మా కారణంగానే తెలుగు దేశం గెలిచింది. గంగా యమునా ఏకమయ్యాయి .. అందుకే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. నామూలంగానే టీడీపీ పుట్టింది.సినిమాల్లో ఎన్టీఆర్ హీరో …  నిజజీవితం లో ఎన్టీఆర్ విలన్. ఒక దశలో ఎన్టీఆర్ పోటీ చేయడానికి మొండికేసాడు. ఎందుకంటె ఓడిపోతానని భయం . కానీ ధైర్యం చెప్పి ఒప్పించాను . ఎన్టీఆర్‌ మంచి నటుడు …. ఆయనలో ఒక ప్రత్యేకత ఏమిటంటే..తన కుటుంబ సభ్యులను కూడా ‘రండి’ అంటూ గౌరవిస్తారు. తన భార్యను కూడా ‘రండి’ కూర్చోండి ” అంటాడు.  “నాడు టీడీపీలో నేనేనెంబర్ వన్..  ఎన్టీఆరే నెంబర్ టు.  ఆ రోజు మీడియా అంతా నేను దుర్మార్గుడిని, ఎన్టీఆర్ సన్మార్గుడు’ అన్నట్లుగా చిత్రీకరించింది. కానీ వాస్తవాలు వేరు”.  అన్నారు ఆయన.

ఎన్టీఆర్ ప్రమాణస్వీకారానికి ఒక రోజు ముందే చంద్రబాబు మామగారింటికి వచ్చారు. భార్య ద్వారా ఎన్టీఆర్ పై ఒత్తిడి తెచ్చారు. బాబును పార్టీలో చేర్చుకునే అంశాన్ని  ఒంగోలు ఎంపీ బెజవాడ పాపిరెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే వెంకటరామానాయుడు ( 83 ఎన్నికల్లో చంద్రబాబు ను ఓడించిన వ్యక్తి ) తీవ్రంగా వ్యతిరేకించారు. మరికొంతమంది కూడా బాబు పట్ల సుముఖం గా లేరు. ఈ విషయాలన్నీ నాదెండ్ల “నా జీవిత ప్రస్థానం” అనే పుస్తకంలో కూడా రాశారు. కాగా తాను అధికారంలోకి రాగానే తిరుమల తిరుపతి దేవస్థానం ఏటా 30 కోట్ల రూపాయలు సర్కార్ ఖజానా లో జమ చేయాలంటూ జారీ చేసిన జీవో ను రద్దు చేశానని చెప్పారు. మరి కొన్నాళ్ళు పవర్ లో ఉన్నట్టయితే ఇంకా ప్రజలకు  ఉపయోగపడే పనులు చేసేవారం అన్నారు.

అయితే  నెల లోపలే   మెజారిటీ ప్రూవ్ చేసుకోలేక  నాదెండ్ల పదవి కోల్పోయారు. అయితే ఇదంతా కాంగ్రెస్ గేమ్ ప్లాన్ అని  పేరు చెప్పటానికి ఇష్టపడని ఒక కాంగ్రెస్ నేత  వ్యాఖ్యానించారు. ఆ సమయంలోనే నాదెండ్ల “ప్రజాస్వామ్య తెలుగుదేశం” పేరిట ఒక పార్టీ పెట్టారు . 1985 ఎన్నికల్లో కాలికి బలపం కట్టుకుని రాష్ట్రమంతా తిరిగాడు. 220 స్థానాల్లో అభ్యర్ధులను బరిలోకి దింపారు. కేవలం రెండే స్థానాల్లో డిపాజిట్లు దక్కాయి . ప్రచారం మాత్రం పెద్ద ఎత్తున చేశారు. ఆ తర్వాత  కొంత కాలానికి మళ్ళీ కాంగ్రెస్ లో చేరారు.  

1998లో ఖమ్మం నియోజక వర్గం నుండి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యాడు. తర్వాత పార్టీ టిక్కెట్ ఇవ్వలేదు. ఆ తర్వాత  కాంగ్రెస్ లోనే ఉన్నారు కానీ అంత యాక్టీవ్ గా లేరు. ఇక మహానాయకుడు సినిమాలో తనను విలన్ గా చూపారని నాదెండ్ల  చెప్పారు. (ఆ రోజుకి  సినిమా రిలీజ్ కాలేదు.) ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ బయోపిక్ అంటే అన్ని కూడా నిజాలే చూపించాలి కాని ఈ బయోపిక్ లో మాత్రం అంత రివర్స్ లో జరిగింది. చంద్రబాబు ని పాజిటివ్ గా చూపించి నన్ను మాత్రం నెగటివ్ గా చూపించారని నాదెండ్ల మండిపడ్డారు. 

ఇక  ప్రస్తుతం నాదెండ్ల బీజేపీ లో ఉన్నారు. కానీ పెద్ద వయసులో ఏమి చేస్తారు. ఈయన సేవలు కూడా పార్టీ ఉపయోగించుకోవడం లేదు. ఇక ఆయన కుమారుడు మనోహర్ జనసేన పార్టీ లో ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 

———  KNMURTHY

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!