పొలిటికల్ ఎంట్రీ పై డైలమా ! 

Sharing is Caring...
స్వయంగా రజనీయే పార్టీ పేరు ను ప్రకటించి లక్ష్యాలను తెలియజేస్తారని అభిమానులు చెబుతున్నారు. అక్టోబర్ లో ముందస్తు ప్రకటన చేసి … ఆపై రంగంలోకి దిగుతారని అంటున్నారు. పార్టీ తరపున మహానాడు కూడా నిర్వహిస్తారని అందుకు సంబంధించి అభిమాన సంఘాల  నాయకులతో రజనీ చర్చలు జరుపుతున్నారని  ప్రచారం జరుగుతోంది.
ఈ తరహా ప్రచారం కొత్తేమి కాదు అంతకుముందు చాలాసార్లు జరిగింది. ఇదిలా ఉంటే రజనీ పొటీ చేస్తే గెలిచే అవకాశాలు మెండుగా ఉన్న నాలుగు నియోజకవర్గాల్లో సర్వే చేయించబోతున్నారట. 
అంతవరకు బాగానే ఉంది. మరి మిగతా స్టేట్ విషయం ఏమిటి ? స్టేట్ మొత్తం పార్టీ పోటీ చేయదా ? ఈ అంశాలపై క్లారిటీ లేదు.
ఇక రజనీ  ముఖ్యమంత్రి పదవి కి తాను పోటీ పడనని, పార్టీ అధ్యక్షుడిగానే ఉంటానని ఆరు నెలల క్రితం ప్రకటించారు. ఈ మాటతోనే అభిమానులు సగం డీలా పడ్డారు. వేరే ఎవరినో సీఎం పీఠం పై కూర్చోపెడతా అంటే అభిమానులు హుషారుగా పార్టీ కోసం పని చేస్తారా  అనేది సందేహమే. 
రజనీ ప్రకటనను గమనిస్తే ఆయనకే అధికారంలోకి వస్తామన్న నమ్మకం లేదని … అందుకే తటపటాయిస్తున్నారని అనిపిస్తోంది.
ప్రత్యర్థి పార్టీల నేతలు కూడా అదే అంటున్నారు.  నిజంగా పార్టీ పెట్టి దూసుకుపోవాలనుకుంటే రజనీ మీన మేషాలు లెక్కించరని  రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో రాజకీయాల్లో ప్రవేశించిన సినీ నటులు సక్సెస్ సాధించలేకపోయారు అన్నది వాస్తవం.
చిరంజీవి అట్టహాసంగా ప్రజారాజ్యం పార్టీని స్థాపించి.. కొద్దీ పాటి ఫలితాలు మాత్రమే సాధించి  …పార్టీ నడపలేక కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి 2019 ఎన్నికల్లో స్వయంగా తానే రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. ఒకే చోట మాత్రమే పార్టీ అభ్యర్థి గెలిచారు. పార్టీ వ్యవస్థాగత నిర్మాణం జరగకుండా ఎన్నికల్లో పోటీ చేయడం పవన్ తప్పిదం. కేవలం అభిమానులే పార్టీని ఆదుకోరనే సంగతి జనసేన విషయంలో రుజువైంది.
కన్నడ స్టార్ ఉపేంద్ర  పార్టీ  అభ్యర్థులు ఎన్నికల బరిలోకి దిగినా ఓటర్లు పట్టించుకోలేదు. నామమాత్ర ప్రభావం కూడా ఉపేంద్ర చూపలేకపోయారు. అలాగే తమిళనాట  నటుడు విజయకాంత్ పార్టీ ఏమైందో తెలిసిన  విషయమే.
ఇక నటుడు కమల్ హాసన్ పార్టీ  2019  లోక సభ ఎన్నికల్లో పోటీ చేసి పెద్ద ప్రభావం చూపలేకపోయింది. పార్టీ 36 చోట్ల పోటీ చేసి డిపాజిట్లు దక్కించుకోలేకపోయింది. ఈ విషయాలను అన్నింటిని ఇటీవల ఒక పొలిటికల్ అనలిస్ట్  రజనీకి వివరించారట. వీటన్నింటిని మించి ఎన్నికల ప్రచారం ఖర్చు , కార్యాలయాల నిర్వహణ వ్యయం , ఇతర ఖర్చులు కోట్లలో ఉంటుంది అని కూడా చెప్పారట.
దీంతో రజనీ పార్టీ ఏర్పాటు విషయమై తర్జన భర్జన పడుతున్నారని సమాచారం.  ఒక వైపు అభిమానుల ఒత్తిడి … మరో వైపు భయపెడుతున్న వాస్తవ పరిస్థితుల మధ్య రజనీ ఏ నిర్ణయం తీసుకోలేక పోతున్నారని అంటున్నారు. ధైర్యం చేసి నిర్ణయం తీసుకుంటే మటుకు సన్నిహితుడైన ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని  ముందుంచి పార్టీని నడపాలని రజనీ  భావిస్తున్నట్టు  సమాచారం. 
ఇక తమిళనాట పొలిటికల్ వాక్యూమ్ ఉన్నప్పటికీ రజనీ దానిని ఉపయోగించుకుని  రాజకీయాలలో దూసుకుపోగలరా ? అనేది కూడా సందేహమే. డీఎంకే బలమైన పార్టీ అందులో సందేహం లేదు. స్టాలిన్ అనుభవం ఉన్న రాజకీయ వేత్త. అన్నాడీఎంకే పై ప్రజల్లో కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ తక్కువగా అంచనా వేయలేం.  ముక్కోణపు పోటీ లో సత్తా చాటుకోవాలి. ముఖ్యంగా పొలిటికల్ లీడర్ కి కావాల్సిన డైనమిక్ లక్షణాలు రజనీకి లేవని ఆయన వ్యతిరేకుల అభిప్రాయం. అలాగే రజని నాన్ లోకల్ అన్న ప్రచారం చాపకింద నీరులా సాగుతోంది.  రజనీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే. 
Sharing is Caring...
Support Tharjani

One Response

  1. DRKREDDY September 20, 2020
error: Content is protected !!