నగదు లావాదేవీలతో జాగ్రత్త సుమా !

Sharing is Caring...

Cash Transactions ……………………………………..

నగదు లావాదేవీల విషయంలో ఇక అప్రమత్తంగా వ్యవహరించాలి. లేకపోతే జరిమానానాలు చెల్లించక తప్పదు.  ఆర్బీఐ ఇటీవల నగదు లావాదేవీల విషయంలో  కొన్ని ఆంక్షలు విధించింది.పరిమితికి మించి నగదుతో లావాదేవీ లు జరిపితే భారీ జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయి. 

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) రూపొందించిన నియమ నిబంధనల ప్రకారం.. ఏడాదికి రూ.20లక్షల పైన డిపాజిట్లు చేసేవారు పాన్ కార్డు, ఆధార్ తప్పనిసరిగా సమర్పించాలి. గతంలో రోజుకి రూ.50 వేలు డిపాజిట్ చేసేవారికి పాన్ కార్డు తప్పనిసరి చేశారు. కానీ అప్పుడు వార్షిక పరిమితులేమీ లేవు. ఇపుడు ఈ కొత్త నిబంధన పెడుతున్నారు.

ఆదాయ పన్ను విభాగం కేంద్ర ఆర్థిక శాఖలోని ఇతర డిపార్ట్ మెంటులతో కలిసి ఎప్పటికప్పుడు ఆర్థిక మోసాలను అరికట్టేందుకు కొత్త నియమ నిబంధనలను రూపొందిస్తోంది.భారత ఆదాయపు పన్ను చట్టం.. రూ. 2లక్షలకు మించి ఎలాంటి నగదు లావాదేవీలను అనుమతించదు.

ఉదాహరణకు  రూ.3లక్షలకు ఏదైనా వస్తువు కొనాలని భావిస్తే …  క్రెడిట్ లేదా డెబిట్ కార్డు, చెక్కు బ్యాంకు నుంచి బదిలీ ద్వారా మాత్రమే సొమ్ము పంపాలి.  రూ.2లక్షల లోపు లావాదేవీ అయితే  నగదు చెల్లించవచ్చు. ఈ నిబంధన 2017 నుంచి అమల్లోకి వచ్చింది.

మీ కుటుంబ సభ్యుల నుంచి నగదును తీసుకుంటున్నా ఈ నిబంధన పాటించాల్సిందే. నగదు ఉపయోగాన్ని పరిమితం చేసేందుకు ప్రభుత్వం సెక్షన్ 269ఎసీ కింద ఒక రోజులో రూ.2లక్షలకు మించి వ్యక్తిగత నగదు లావాదేవీలు చేయడాన్ని నిషేధించింది. దగ్గరి బంధువుల నుంచి తీసుకున్నా రూ.2లక్షలు మాత్రమే అంగీకరించాల్సి ఉంటుంది. 

నగదును బహుమతిగా స్వీకరించేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒక వ్యక్తి దగ్గర్నుంచి రూ. 2 లక్షలకు మించి నగదు బహుమతి స్వీకరించకూడదు. ఒకవేళ అంతకు మించి తీసుకుంటే నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుంది. బహుమతికి సమానమైన మొత్తాన్ని అపరాధ రుసుముగా విధించే అవకాశం లేకపోలేదు. 

ఆరోగ్య బీమా ప్రీమియాన్ని ఖచ్చితంగా చెక్కు లేదా ఆన్లైన్ ద్వారా చెల్లించే ఏర్పాటు చేసుకోవాలి. నగదుగా చెల్లిస్తే సెక్షన్ 80డీ కింద మినహాయింపు కోల్పోతారు.వ్యక్తులు లేదా ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకునే సమయంలో  ఆ మొత్తం రూ. 20వేలకు మించితే ఆన్లైన్ ద్వారానే లావాదేవీ నిర్వహించాలి.

ఏవైనా ఆస్తులకు సంబంధించిన లావాదేవీల్లోనూ నగదు పరిమితి రూ.20 వేలే. చివరకు అడ్వాన్సు చెల్లించినా.. తీసుకున్నాకూడా  ఆన్లైన్ లోనే జరగాలి. ఒక రోజులో ఒకేసారి రూ.10 వేలు నగదు రూపంలో చెల్లిస్తే.. దానికి పన్ను మినహాయింపు కోరేందుకు వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు అవకాశం లేదు. అయితే  రవాణాదారులకు మాత్రం రూ.35  వేల వరకు చెల్లించేందుకు అనుమతి ఇచ్చారు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!