Action Movie…..
‘కాసర్గోల్డ్’ (Kasargold) 2023 నాటి సినిమా ఇది. ఆసిఫ్ అలీ, సన్నీ వేన్,వినాయకన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మలయాళ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ కి మృదుల్ నాయర్ దర్శకత్వం వహించారు.
కథ ఏమిటంటే ?
కేరళ బ్యాక్‌డ్రాప్‌లో సాగే బంగారం స్మగ్లింగ్ కథ ఇది. దుబాయ్ నుండి అక్రమంగా తరలిస్తున్నఎమ్మెల్యే మూసా (సిద్ధిఖీ) కి చెందిన రూ. 2.5 కోట్ల విలువైన బంగారాన్ని ఆల్బీ (ఆసిఫ్ అలీ), నాన్సీ స్మగ్లింగ్ చేస్తుంటారు. అయితే, ఒక రోడ్డు ప్రమాదం కారణంగా ఆ బంగారం అదృశ్యమవుతుంది.
ఆ సమయంలో డబ్బు కోసం ఇబ్బంది పడుతున్న ఫైసల్ (సన్నీ వేన్) గ్రూపుతో వీరికి గొడవ జరుగుతుంది. పోయిన బంగారాన్ని రికవరీ చేయడానికి ఎమ్మెల్యే తన గూండాలను, సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ అలెక్స్ (వినాయకన్) ను రంగంలోకి దింపుతాడు. అసలు ఆ బంగారం ఎటు పోయింది? ఆల్బీ, ఫైసల్ ప్రాణాలతో బయటపడ్డారా? లేదా? అనేదే మిగతా సినిమా.
స్మగ్లింగ్ గ్రూప్‌లో ఉంటూ, మరింత డబ్బు సంపాదించాలనే అత్యాశ ఉన్న ఒక రెక్లెస్ యువకుడి పాత్రలో ఆసిఫ్ అలీ అద్భుతమైన నటనను కనబరిచారు. యాక్షన్ సీన్స్, టెన్షన్ క్రియేట్ అయ్యే సన్నివేశాల్లో ఆయన బాడీ లాంగ్వేజ్ చాలా సహజంగా ఉంది.
ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి, అనుకోకుండా బంగారం స్మగ్లింగ్ గొడవల్లో చిక్కుకునే పాత్రలో సన్నీ వేన్ చాలా మెప్పించారు. ఆసిఫ్ అలీ ,సన్నీవేన్ కాంబినేషన్ సీన్లు, వారిద్దరి మధ్య సాగే డ్రామా సినిమాకు మంచి బలాన్ని ఇచ్చాయి. ‘జైలర్’ సినిమా విలన్‌గా తెలుగువారికి సుపరిచితుడైన వినాయకన్, ఇందులో సస్పెండ్ అయిన కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు.
ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, క్రూరమైన నటన సినిమాకు ఒక పవర్ఫుల్ వైబ్‌ని తెచ్చాయి. ఆయన కనిపించే ప్రతి సీన్ ప్రేక్షకులలో ఆసక్తిని పెంచుతుంది. స్మగ్లింగ్ వెనుక ఉండే పొలిటికల్ మాఫియా లీడర్‌గా సీనియర్ నటుడు సిద్దిఖీ తన అనుభవంతో కూడిన నటనతో పాత్రకు న్యాయం చేశారు.మాళవిక శ్రీనాథ్, శ్రీనాథ్ భాసి వంటి మిగతా నటీనటులకు పెద్దగా స్కోప్ లేకపోయినప్పటికీ, ఉన్నంతలో తమ పరిధి మేర బాగానే నటించారు.
ఈ సినిమా తెలుగు డబ్బింగ్ , డైలాగులు చాలా సహజంగా, స్పష్టంగా కుదిరాయి. సినిమాలోని బైక్ చేజింగ్‌లు, యాక్షన్ బ్లాక్‌లు చాలా స్టైలిష్‌గా ఉన్నాయి. మాస్ యాక్షన్ ప్రియులను ఆకట్టుకుంటాయి.
‘అతి ఆశ సర్వనాశనానికి హేతువు’ అనే పాత నైతిక సూత్రం చుట్టూనే ఈ స్మగ్లింగ్ కథ తిరుగుతుంది. కథలో పెద్దగా ట్విస్ట్‌లు లేకపోవడం నిరాశపరుస్తుంది. మొదటి భాగంలో ఉన్న ఫ్లో సెకండాఫ్‌లో మిస్ అయింది. అనవసరమైన సబ్ప్లాట్లు, పాత్రల వల్ల కథనం కాస్త గందరగోళంగా మారుతుంది.
క్లైమాక్స్ బాగానే ఉన్నప్పటికీ .. మలుపులను ప్రేక్షకులు ముందే ఊహించేలా ఉంటాయి. మహిళా పాత్రలకు సరైన ప్రాధాన్యత కల్పించలేదు. ఫస్టాఫ్‌లో ఉన్న వేగం, థ్రిల్ సెకండాఫ్‌కి వచ్చేసరికి తగ్గుతుంది. పాత్రల మధ్య వచ్చే కొన్ని గొడవలు, సబ్ప్లాట్లు సినిమా నిడివిని పెంచినట్లు అనిపిస్తాయి.
విష్ణు విజయ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) సినిమా మూడ్‌కు తగ్గట్టుగా ఎనర్జిటిక్‌గా ఉంటుంది.సినిమాలో వచ్చే బైక్ చేజింగ్‌లు,గోవా వీధుల్లో జరిగే రన్-అండ్-చేజ్ సన్నివేశాలను కెమెరాలో అద్భుతంగా క్యాప్చర్ చేశారు. కెమెరా మూవ్మెంట్స్ ప్రేక్షకుడికి ఒక హై-స్పీడ్ థ్రిల్ ఫీలింగ్‌ను ఇస్తాయి.
‘కాసర్గోల్డ్’ చిత్రం కేవలం యాక్షన్, చేజింగ్ సీన్లు ఫాస్ట్-పేస్డ్ క్రైమ్ థ్రిల్లర్లను ఇష్టపడే వారికి ఓ మోస్తరుగా నచ్చుతుంది. అయితే లోతైన కథ, బలమైన మలుపులు ఆశించే ప్రేక్షకులను మాత్రం ఇది పూర్తిగా మెప్పించలేకపోవచ్చు.ఆసక్తి ఉన్నవారు నెట్ఫ్లిక్ లో తెలుగు వెర్షన్ లో ఈ సినిమా చూడవచ్చు.

