రామానాయుడు మార్క్ మల్టీస్టారర్‌ మూవీ!!

Sharing is Caring...

 Subramanyam Dogiparthi ………………

రామానాయుడు నిర్మాత అంటే సినిమా రీచ్ గా ఉంటుంది.. భారీ తారాగణం .. సెట్టింగులు
మామూలే .. ఏవిషయంలోనూ ఆయన రాజీ పడరు.. ఆయన తీసిన మల్టీస్టారర్‌ మూవీ ఈ ‘మండే గుండెలు’. సురేష్  సంస్థలో హీరో కృష్ణ శోభన్‌బాబు కలసి నటించిన సినిమా ఇది.ఈ ఇద్దరు హీరోలకు తోడుగా మరో హీరో చంద్రమోహన్‌ కూడా ఇందులో ఒక పాత్ర పోషించారు.ఈ ముగ్గురికి జోడీలుగా అందాల తారలు జయప్రద, జయసుధ, మాధవి నటించారు.

‘మండే గుండెలు’ చిత్రంతోనే జయప్రద సురేష్ సంస్థలోకి అడుగుపెట్టారు. సురేష్ సంస్థలో జయసుధకు ఇది మూడో సినిమా. ‘సోగ్గాడు’ సినిమాతో హిట్ కొట్టిన ఆస్థాన డైరెక్టర్ బాపయ్యకు ఈ మల్టీస్టారర్‌ మూవీ దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు రామానాయుడు.మాస్‌ హీరోగా కృష్ణకు, క్లాస్‌ హీరోగా శోభన్‌బాబుకు ఉన్న ఇమేజ్‌,ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకుని బాపయ్య గుహనాథన్ కథ ఆధారంగా ఈ సినిమా తీశారు.

లవ్‌,సెంటిమెంట్‌, యాక్షన్‌, కామెడీ, రివెంజ్‌ అంశాలతో చిత్రకథను రూపొందించారు. రచయిత జంధ్యాల మాటలు అందించారు.అన్ని పాటలూ ఆచార్య ఆత్రేయ రాసారు.మామ మహదేవన్‌ బాణీలు ఇచ్చారు. బాగానే ఉంటాయి. థియేటర్లో వింటానికి శ్రావ్యంగానే ఉంటాయి. 

బాలసుబ్రమణ్యం, సుశీలమ్మలు పాడిన ‘చల్లాచల్లని సత్యభామ’ పాట చాలా బాగుంటుంది. ‘ఇది ప్రేమ సామ్రాజ్యం’  . ‘జిల్లు జిల్లుమంటున్నాయ్ నీళ్ళు’ , ‘వీడే ధీర వీర శూర భీమసేనుడు’ , ‘బంగారానికి సింగారానికి కుదిరింది బేరం’ పాటలు శ్రావ్యంగా ఉంటాయి. సత్యనారాయణ,అల్లు రామలింగయ్యల పాట ‘ఒరే కారయ్యా ఏరా సారా సాంబయ్య’ పాట ఎలా ఉన్నా వాళ్ళిద్దరి గోల బాగుంటుంది.  

భారీసెట్టింగులు, పడవ కార్లు, మధ్య తరగతి ప్రేక్షకులు వాటన్నింటిలో తమను ఊహించుకుని ఓలలాడేలా సినిమా తీశారు. భారీ తారాగణం.. ఇంతమంది యాక్టర్లను  ఎకామడేట్ చేస్తూ కధను తయారు చేసిన గుహనాధన్ని మెచ్చుకోవాలి. 

ఇద్దరు స్టార్లతో సినిమా ఎలా తీయాలో అలాగే తీసారు. ఇలాంటి ఇద్దరు హీరోల సినిమాల్లో తిప్పలు విలన్లకే . ఇద్దరి చేత సమానంగా తన్నులు తినాలి. ప్రి-శంకరాభరణం మంజు భార్గవి ఖవాలీ డాన్సుతో సినిమా మొదలవుతుంది. గుమ్మడి, ప్రభాకరరెడ్డి, కాంతారావు , సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, కాకరాల, పి యల్ నారాయణ, మిక్కిలినేని, నూతన్ ప్రసాద్, కె వి చలం, సారధి , అంజలీదేవి, సూర్యకాంతం, రాధాకుమారి ప్రభృతులు నటించారు. 

ముగ్గురు హీరోలు ,ముగ్గురు హీరోయిన్లు , తన్నులు తింటానికి కావలసినంత మంది విలన్లు వారి గేంగ్. ఫుల్ గరం మసాలా , వినోదాత్మక సినిమా.18 సెంటర్లలో యాభై రోజులు ఆడింది. విజయవాడ , రాజమండ్రి , విశాఖపట్నం లో వంద రోజులు ఆడింది. కృష్ణ , శోభన్ బాబు అభిమానులు కావాలంటే మళ్ళా చూడొచ్చు . యూట్యూబులో ఉంది.  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!