బయట తమ్ముడిగా … సెట్ పై అన్నగా !

Sharing is Caring...

An incomparable actor……..

సుప్రసిద్ధ నటుడు కైకాల సత్యనారాయణ అలనాటి హీరో ఎన్టీఆర్ కి వెన్ను దన్నుగా ఉండేవారు. కైకాల నటుడిగా ఎదగడానికి ఎన్టీఆర్ చాలా సహాయపడ్డారు. ఎన్టీఆర్  సొంత సినిమాల్లో కైకాలకు తప్పనిసరిగా  ఒక కీలక పాత్ర ఉండేది. సత్యనారాయణ ఎన్టీఆర్ సినిమాల్లో ఎక్కువగా అన్న పాత్రల్లోనే కనిపించేవారు. నిజజీవితంలో మటుకు ఎన్టీఆర్ ను కైకాల అన్నగారు అంటూ పిలిచే వారు. ఎన్టీఆర్ ఆయనను తమ్ముడు అనేవారు.

ఎన్టీఆర్ డబల్ యాక్షన్ చేసిన ఎన్నో సినిమాలో ఆయనకు సత్యనారాయణ డూప్ గా చేసేవారు. ఎన్టీఆర్  హీరోగా కైకాల విలన్ గా  ఆరోజుల్లో  ఇద్దరు  పాపులర్ అయ్యారు. సినిమాల్లో ని యుద్ధ సన్నివేశాల్లో  కైకాలను ఎన్టీఆర్ గట్టిగా కొట్టేవారట. షూటింగ్ అయ్యాక దెబ్బ తగిలిందా .. సారీ అనేవారట. ఈ విషయం సత్యనారాయణ స్వయంగా ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పారు.

కేవలం సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలో కూడా ఆ ఇద్దరూ అన్నదమ్ముల్లా ఉండేవారు. ” హీరో కృష్ణ నటించిన కురుక్షేత్రం తీసే సమయంలోనే ఎన్టీఆర్ దాన వీర శూర కర్ణ షూటింగ్ మొదలు పెట్టారు.  అప్పట్లో రెండు సినిమాలను పోటా పోటీగా తీశారు. కురుక్షేత్రం లో దుర్యోధనుడి పాత్రకు ముందు వేరే నటుడిని అనుకున్నారు.

అపుడు కృష్ణ సత్యనారాయణ ఆ పాత్ర  చేస్తే బాగుంటుందని సూచించారు. ఆ సినిమా నిర్మాత సూచన మేరకు కృష్ణ సత్యనారాయణ తో మాట్లాడారు. అప్పటికే కైకాల ఎన్టీఆర్ కర్ణ లో భీముడి పాత్ర చేస్తున్నారు. సుయోధనుడి పాత్ర చేస్తే బాగుంటుంది కానీ ఎన్టీఆర్ ఏమైనా అనుకుంటారేమో అని తటపటాయించారు. కృష్ణ పట్టుబట్టడం తో ఇక తప్పదు అనుకుని ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లి  అసలు విషయం చెప్పారు. అది విన్న ఎన్టీఆర్ ఒకే కానీయ్ మరి .. డేట్స్ క్లాష్ కాకూడదు అని కండిషన్ పెట్టారట.

దాంతో ఎన్టీఆర్ చెప్పినట్టే  కైకాల కృష్ణ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కర్ణ లో ఎన్టీఆర్ సుయోధనుడిగా చేస్తే .. కైకాల కురుక్షేత్రంలో సుయోధనుడిగా నటించారు.  అలా ఎన్టీఆర్ సన్నిహితుడిగా సుపరిచితులైన కైకాల సత్యనారాయణ 1996 లో మచిలీ పట్నం నుంచి తెలుగు దేశం పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసి గెలిచారు. తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో కైకాల ఒకరు. ఎన్టీఆర్ బతికుండగా  ఆయనకు రాజకీయంగా సలహాలు కూడా ఇచ్చేవారు.

పార్టీ జెండా రూపకల్పనలో ఎన్టీఆర్ కైకాల సలహాలు తీసుకున్నారు. కైకాల ఎన్టీఆర్ తో ఉన్న రాజకీయ అనుబంధం గురించి  కొన్ని ఇంటర్వ్యూలలో వివరించారు. కైకాలను ఒక దశలో రాజ్యసభకు పంపాలని ఎన్టీఆర్  అనుకున్నారు. ఈ లోగానే ఆయన  కన్నుమూసారు. తర్వాత చంద్రబాబు కైకాల కు టిక్కెట్ ఇచ్చి ఎన్నికల్లో పోటీ చేయించారు.1996లో గెలిచిన  కైకాల 1998 ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. తరువాత రాజకీయాలకు దూరం అయ్యారు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!