జాతి వివక్షపై గాంధీ తిరుగుబాటు!(2)

Sharing is Caring...

Taadi Prakash …………………………………

ఒక రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమా కథ ఎలా వుంటుంది? ఒక హీరో, ఒక విలన్‌. సంపన్నుడైన విలన్‌ కూతురుగానీ, దగ్గర బంధువుగానీ ఓ అందారాశి మన హీరోయిన్‌. హీరో పేదవాడు, నిరుద్యోగి పోనీ రిక్షా తోక్కేవాడు, ఐనా మచ్చలేని వ్యక్తిత్వం. నిలువెత్తు నిజాయితీ ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచే కుతూహం రేపే conflict వుండాలి. ఆమె రిక్షావాణ్ణి వొదులుకోలేదు. హీరో పవిత్ర ప్రేమకి బానిస. విలన్‌ గ్యాంగ్‌తో ఫైట్‌, పాట, క్లెయిమాక్స్‌… యిదంతా కల్పించి, కథ నడిపిస్తాం కదా!

అసలు గాంధీజీ జీవితం కంటే కమర్షియల్‌ స్టోరీ ఏముంటుంది? ఎన్ని షోలేలు తీసి, ఎన్ని బాహుబలులు యిస్తే ఒక గాంధీ జీవితం అవుతుంది! ఎన్నివందల సినిమా క్లైమాక్స్ లు కలిపితే .. ఒక స్వాతంత్య్ర పోరాటం అవుతుంది? బాగా బట్టతల వున్న ఒక బక్కపల్చని పెద్దాయన. ఖద్దరు పంచె కట్టుకొని, చేతికర్ర పట్టుకొని నడిచి వెళ్తుంటాడు. శక్తిమంతమైన బ్రిటిష్‌ సామ్రాజ్య వాదుల్ని ఈ దేశం నుంచి తరిమికొడదాం అంటుంటాడు. చ్లలని బీరు తాగడు.మూడు పెగ్గులేసుకోడు. మటన్‌ బిర్యానీ తినడు, పల్లీలు అంటాడు. మేకపాలు కావాలంటాడు. పైగా యుద్ధం చేస్తానంటూ వుంటాడు.సినిమా వాళ్ళుకోరే conflict ఐతే ok వుందికదా!

లాఠీ ఛార్జీలు, జైళ్లు! ఊరేగింపులు… మరి మసాలా ఏది? ప్రేక్షకుడికి మాడు పగిలిపోయే మసాలా కావాలిగా, ఏది? అదే truth… సత్యం! నువ్వు లాఠీల్తో కొట్టు, తిరగబడం. జైళ్ళల్లో పెట్టు, కాదనం, సత్యమే చెబుతాం. దానికోసం పోరాడతాం. స్వాతంత్య్రం యిప్పుడే కావాలి, ఈ క్షణంలోనే, మేం సత్యం మాట్లాడుతున్నాం. ఈ దేశం మాది. క్విట్‌ ఇండియా… ఇది సత్యాగ్రహం!… Virtuous anger ! నువ్వొక జలియన్‌ వాలాబాగ్‌తో దీన్ని క్లయిమాక్స్‌కి జేర్చు…భగత్‌సింగ్‌ని ఉరితీయ్‌. పతాక సన్నివేశాన్ని మేం మువ్వన్నెల జెండాతో పండిస్తాం. నిన్నూ నీ తొత్తుల్నీ తరిమేస్తాం. నీ జెండా పీకేస్తాం. భారత స్వాతంత్య్ర సంగ్రామానికి శుభం కార్డు వేస్తాం.

గాంధీ దర్వకత్వం వహించిన, 50 కోట్లమంది నటించిన యీ సినిమాలో మహత్ముడే హీరో.ఇలాంటి సినిమా ఎవరన్నా తీయగలరా? దక్షిణాఫ్రికా అయినా, ఇండియా అయినా గాంధీకి ఒక్కటే. బాధితుల పక్షానే నిలబడతాడు. కరుణ కురిపిస్తాడు… అహింస ప్రవచిస్తాడు… విజయం సాధిస్తాడు, అయినా వినమ్రంగానే, నిరాడంబరంగానే, కన్నతండ్రిలానే వుంటాడు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ.

గాంధీ లాంటి ఒక మహావీరుణ్ణి, విజనరీని, విప్లవకారుణ్ణి హీరోగా పెట్టి సినిమా తీయడమంటే షారూక్‌ ఖాన్నో, అమితాబ్‌ నో పెట్టి రక్తికట్టించడం కాదుగదా! శ్యాంబెనెగల్‌కి ఐనా, అటెన్‌బరోకి అయినా కళ, సృజనాత్మకత మాత్రమేకాదు, ఒక సాహసం, ఒక నిబద్ధతతోపాటు, చిత్తశుద్ధి, నిజాయితీ పొంగిపొర్లుతుండాలి! దానికోసం సమస్త శక్తినీ వొడ్డి, బృందంలోని అందర్నీ సమాయిత్తం చేయగలగాలి. It’s a herculean task !

పకడ్బందీ అయిన ప్రణాళికతో జోహన్నెస్‌బర్గ్‌లో దిగాడు మన దర్శకుడు. అటు ఆరితేరిన భారతీయ అత్యుత్తమ ఫోటోగ్రాఫర్‌ అశోక్‌ మెహతా బృందంతో  సిద్ధంగా వున్నాడు. శబ్దబ్రహ్మ వనరాజ్‌ భాటియా శ్రావ్యమైన, గంభీరమైన సంగీతం శ్యాంబెనగల్ని ఉత్తేజితుణ్ణి చేస్తోంది. సహజమైన గెటప్‌తో పల్లవిజోషి మధ్య తరగతి గృహిణిగా, కస్తూర్బాగాంధీగా రూపాంతరం చెందింది. యువ లాయర్‌గా రజిత్‌ కపూర్‌ ఉత్సాహంగా వున్నాడు. మొత్తం షూటింగ్‌ 39 షిఫ్టుల్లో జరిగిపోవాలి.

45 రోజుల్లోనే సినిమా పూర్తయిపోవాలి. ఎక్‌స్ట్రా నటులుగా 700మంది ఆఫ్రికన్లు కావాలి. ఫాతిమా చొరవతో కొందరు దక్షిణాఫ్రికా నటులు, సాంకేతిక నిపుణులు రెడీ అయి వున్నారు. ప్రభుత్వ సహకారం ఎలాగు వుంది.ఇంగ్లండ్‌లో బారిష్టరు చదువు పూర్తి చేసుకున్న గాంధీ, ఇద్దరు సంపన్న ముస్లింల గొడవ పరిష్కరించడానికి దక్షిణాఫ్రికా వెళ్ళారు. కొన్ని నెలలు మాత్రమే అక్కడవుండి ఇండియా వెళ్ళిపోవాని గాంధీ అనుకున్నాడు. అప్పట్లో గనుల్లో, తోటల్లో, రైల్వేల్లో పని చేయడానికి వలస వ్యాపారులు ఇండియా నుంచి 30 వేల మంది పనివాళ్ళని తీసికెళ్ళారు. అయిదేళ్లు గనక పనిచేస్తే, కార్మికుల పిల్లల్ని చదివిస్తామనీ, భూములు ఇస్తామని పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు. మాట నిలబెట్టుకోకపోగా, కార్మికులపై వేధింపులు పెరిగాయి.

ప్రతిపనివాడు మూడేసి పౌండ్లు పన్ను కట్టాలని పాలకులు షరతు పెట్టారు. పనివాళ్ళ పెళ్ళిళ్ళు చెల్లవని, కనక వాళ్ళ పిల్లలకి సౌకర్యాలు వర్తించవనీ చట్టం చేశారు. దిక్కుతోచని కార్మికులకీ, వందల వేలమంది ఆడకూలీలకీ అండగా నిలిచాడు గాంధీ. అహింస ఆయుధంగా పోరాడాడు. కోర్టులో నిలబెట్టారు. తనకి వీలైనంత కఠిన కారాగార శిక్ష వేయాలని గాంధీ కోరారు. జైలు, విడుదల, మళ్ళీ జైలు… ఆగని పోరాటం! జాతి వివక్షపై తిరుగుబాటు, జాత్యహంకారంపై ధిక్కారం! 1893లో 24 ఏళ్ళ వయసులో గాంధీ దక్షిణాఫ్రికా వెళ్ళారు.

ప్రతి దినమూ పోరాటంతో 21 సంవత్సరాలు ఆయన అక్కడే వుండిపోయారు. లాయర్‌గా అక్కడ అడుగుపెట్టిన కుర్రాడు నాయకుడిగా ఎదిగాడు.  ప్రతిఘటనోద్యమ వీరునిగా రాటుదేలాడు.పెద్ద కొడుకుని పట్టించుకోడం లేదని గాంధీతో భార్య గొడవ పడింది. గర్భవతిగా వున్న కస్తూర్బాని ఈడ్చి బయటికి వెళ్ళగొట్టే ప్రయత్నం చేసిన గాంధీని, ఆ మామూలు మనిషి దురాగ్రహాన్ని ఎంతో సహజంగా పిక్చరైజ్‌ చేశాడు బెనెగల్‌. సరైన టిక్కెట్‌ వున్నా నల్లవాడయిన నేరానికి గాంధీని ఫస్ట్‌క్లాస్‌ కంపార్ట్‌మెంట్‌ నించి ఫ్లాట్‌ఫాం మీదికి తోసేసిన ప్రఖ్యాత సంఘటనని ఎఫెక్టివ్‌గా తెరకెక్కించారు.

మనకి చైనాలో మావో లాంగ్‌మార్చ్‌ తెలుసు. ఇక్కడ ఉప్పు సత్యాగ్రహం, దండి లాంగ్‌మార్చ్‌ తెలుసు. అయితే మొట్టమొదటి లాంగ్‌మార్చ్‌ దక్షిణాఫ్రికాలో గాంధీ నాయకత్వాన జరిగింది. అక్కడి భారతీయ కార్మికుల డిమాండ్లు ఎంతకీ పరిష్కారం కాకపోవడంతో పాదయాత్ర జరపాలని గాంధీ నిర్ణయించారు. హిందువులు, ముస్లింలు, యూదులు, పార్సిలు, క్రిస్టియన్లు, గని కార్మికులు, స్త్రీలు, వ్యాపారులు అంతా ఇళ్ళు వొదిలేశారు. ఉద్యోగాలు మానేశారు. తిండిలేదు. పోలీసు దాడులు… దుర్భర జీవితం!

ఆ శ్రమ జీవులందరిని సాహసంతో ముందుండి నడిపించాడు గాంధీ. న్యూకేజిల్‌ నుంచి 36 కిలోమీటర్ల దూరంలో వుంది ట్రాన్స్‌వాల్‌ రాష్ట్రం. రెండువేలమంది నడక ప్రారంభించారు. అరెస్టులు, పోలీసు వేధింపులు… అయినా యాత్ర ఆగలేదు. జైలుకెళ్ళి వచ్చిన గాంధీ మళ్ళీ లాంగ్‌ మార్చ్‌లో కలిశారు. తెల్ల పాలకులు గడగడలాడిపోయారు. ఇటు ఇండియా నుంచీ లండన్ నుంచీ గాంధీ మద్దతు కూడగట్టారు, నరకయాతన పెట్టిన తెల్లజాతి అహంకారులు చివరికి దిగివచ్చారు. 1914లో కార్మికుల అన్ని డిమాండ్లు ఒప్పుకున్నారు. గాంధీ పట్టుదల, పోరాటపటిమ చూసి తెల్లవాళ్ళు భయకంపితులాయ్యారు.ఈ ఉద్విగ్న సన్నివేశాల్ని, అహింసాయుత యుద్ధతంత్రాన్ని బెనెగల్‌ ఉత్తేజకరంగా చిత్రించారు.

1996 ఏప్రిల్‌లో ఇండియా అంతా విడుదలైంది the making of mahatma. దక్షిణాఫ్రికా పోరాటాల్లో నిగ్గుదేలిన యువకుడు, పరిణతి చెందిన నాయకునిగా, అహింసని ఆయుధంగా మలిచిన భారత యోధునిగా, ఒక మహాత్మునిగా, 45 సంవత్సరాల గాంధీజీ ఇండియాకి తిరిగొస్తారు. భుజాన సంచితో చేతిలో కర్రతో గాంధీజీ సముద్ర కెరటాలవైపు నడిచి వెళుతుండగా సినిమా ముగుస్తుంది. ఇక భారత స్వతంత్ర సంగ్రామమనే మహాసముద్రాన్ని గాంధీజీ జయించబోతున్నాడు .. అనే ప్రతీకాత్మక పతాక సన్నివేశం అది. RESISTANCE WITHOUT VIOLENCE.. CONFRONTATION WITHOUT ENEMIES…  VICTORY WITHOUT LOOSERS..  GANDHI MORE RELEVANT THAN EVER  ఇదే ఈ సినిమా సారాంశం.

అప్పటికి దక్షిణాఫ్రికాలో ఇంగ్లీషే అధికార భాష అయినందువల్ల, ప్రపంచమంతా విడుదల చేయడానికి ఇంగ్లీషు తప్పనిసరి అవ్వడం చేతా, ఈ సినిమాని ఇంగ్లీషులోనే తీశారు. ఇంగ్లీష్ లో ఉత్తమ కథా చిత్రంగా the making of mahatma – గాంధీ సే మహాత్మా తక్ – ఆ ఏడాది జాతీయ అవార్డు పొందింది. 1996లో జాతీయ చిత్రంగా స్పెషల్‌ జూరీ అవార్డు శ్యాంబెనెగల్‌కి యిచ్చారు. 1996లో ఉత్తమ నటునిగా రజిత్‌కపూర్‌ జాతీయ అవార్డు పొందారు. అనేక ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్స్‌లో ఈ సినిమా శ్యాంబెనెగల్‌కి అంతర్జాతీయ కీర్తి ఆర్జించింది. దక్షిణాఫ్రికాలో రెండు నెలలు జైల్లో వున్నప్పుడు గాంధీజీ ఒక చెప్పుల జత తయారు చేశారు.

విడుదలై బయటికి వచ్చినప్పుడు అప్పటి సౌతాఫ్రికా హోంమంత్రి Mr. Smut కి వాటిని బహుకరించారు. వాటిని చాలాసంవత్సరాలు వాడిన Mr. Smut “Even though, I may feel that I’m not worthy to stand in the shoes of so great a man” అని అన్నారు.
శ్యామ్ బెనెగల్ వయసు 86 ఏళ్ళు. 1934 ఏప్రిల్ 14న సికింద్రాబాద్ లో జన్మించారు. 1991 లో పద్మ విభూషన్, 2005 లో జీవిత సాఫల్య పురస్కారం: దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ పొందారు.

Read it also ————————- జాతి వివక్షపై గాంధీ తిరుగుబాటు ! (1)

Sharing is Caring...
Support Tharjani

One Response

  1. యూవీరత్నం September 6, 2021
error: Content is protected !!