Rights ………………………
చందమామపై ప్రపంచ దేశాల ఆసక్తి పెరుగుతోంది. వివిధ దేశాలు వరుసగా వ్యోమనౌకలను పంపుతున్న నేపథ్యంలో..చంద్రుడిపై , అక్కడి వనరులపై హక్కులు ఎవరివి ? అనే ప్రశ్న తెరపై కొచ్చింది. ఈ హక్కుల విషయం పై అంతర్జాతీయ చట్టాలు కూడా ఉన్నాయి. చందమామ మానవాళి మొత్తానిదని ఆ చట్టాలు స్పష్టం చేస్తున్నాయి.
అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి 1966లో ఐరాస.. ఔటర్ స్పేస్ ట్రీటీని తీసుకొచ్చింది. దీని ప్రకారం చందమామ, ఇతర గ్రహాలూ,నక్షత్రాలపై .. అక్కడి వనరులపై ఏ ఒక్కరికి హక్కు లేదు. ఏ దేశమూ సార్వభౌమాధికారాన్ని ప్రకటించుకోకూడదు. అన్ని దేశాల ప్రయోజనం కోసం ఖగోళ అన్వేషణ జరగాలి. అయితే ఈ ఒప్పందంలో ప్రభుత్వాల ప్రస్తావనే ఉంది.
ఈ నేపథ్యంలో 1979లో మూన్ అగ్రిమెంట్ తెరపైకి వచ్చింది. దీని ప్రకారం ఏ ప్రభుత్వ, అంతర్జాతీయ, ప్రభుత్వేతర సంస్థలు, వ్యక్తులు చందమామను తమ ఆస్తిగా ప్రకటించుకోకూడదు. అక్కడ కాలనీలు ఏర్పాటు చేసుకొని, జాబిల్లి మాదే అనడం చెల్లదు. చందమామ, అక్కడి సహజవనరులు మానవాళి ఉమ్మడి సొత్తు. ఈ ఒప్పందం 1984లో అమల్లోకి వచ్చింది.
అయితే చందమామపైకి ల్యాండర్లు పంపిన అమెరికా, రష్యా, చైనా మాత్రం ఇంకా ఈ ఒప్పందాన్ని ఆమోదించలేదు. అంతరిక్ష ఒప్పందానికి కొనసాగింపుగా అమెరికా 2020లో అర్టెమిస్ ఒప్పందాన్ని ప్రతిపాదించింది. చందమామపై సురక్షితంగా ప్రయోగాలు చేపట్టడం దీని ఉద్దేశం. ఇందులో కెనడా, జపాన్, ఐరోపా తదితర దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. భారత్ కూడా ఇటీవల ఇందులో చేరింది.
ఇటీవల తాము చంద్రునిపై స్ధలాలు కొనుగోలు చేసినట్టు పలువురు ప్రకటనలు చేస్తున్నారు. చంద్రుడిపై భూమిని విక్రయించేందుకు లూనార్ రిజిస్ట్రీ అనే వెబ్సైట్ ఉంది. అమెరికా ఈ వెబ్సైట్ ను అందుబాటులోకి తెచ్చింది.దీని ద్వారా చంద్రుడిపై స్థలం కొనుగోలు చేసే వారి సంఖ్య క్రమంగా ఊపందుకుంటోంది.
లూనా సొసైటీ ఇంటర్నేషనల్, ఇంటర్నేషనల్ లూనార్ ల్యాండ్స్ రిజిస్ట్రీ సంస్థలు చంద్రుడిపై భూమిని ఎవరికి కావాలన్నా అమ్ముతాయి. అయితే కొన్ని షరతులు వర్తిస్తాయి. చంద్రుడిపై కొనుగోలు చేసే భూమిపై యాజమాన్య హక్కులు కొనుగోలుదారులు పొందలేరు. కేవలం వారి పేరుపై మాత్రమే భూమి రిజిస్ట్రర్ అయి ఉంటుంది. అంటే గొప్పలు చెప్పుకోవడం కోసమే ఇలాంటి కొనుగోళ్లు పనికొస్తాయి. చట్టాల్లో ఏవైనా మార్పులు జరిగితే తప్ప ఈ కొనుగోళ్లు చెల్లవు.